రాజకీయం

ఒకపక్క కోలాహలం …మరోపక్క ఆందోళన..ప్యారాచూట్ తీర్మానం బుట్ట దాఖలేనా..!

Written by Mohiddin Shaik

కాంగ్రెస్లో పరిణామాల పై బి ఆర్ఎస్ ప్రత్యేక దృష్టి.

కాంగ్రెస్ పార్టీలో ఒకపక్క చేరికల ఊపుతో కోలాహలం కనిపిస్తుండగా మరోపక్క పార్టీ కోసం దశాబ్దాలుగా పనిచేసిన కొందరు నాయకుల్లో ఆందోళన కనిపిస్తోంది.
వలసలు ,చేరికలు ,విలీనాల ప్రచారం నేపథ్యంలో ,గతంలో రాహుల్ గాంధీ నేతృత్వంలో జరిగిన జాతీయ కాంగ్రెస్ మహాసభల్లో చేసిన ఒక ముఖ్యమైన తీర్మానం పై సర్వత్ర చర్చ జరుగుతుంది.
అదేమంటే, ఎన్నికల ముందు ఇతర పార్టీల నుంచి పారాషూట్ లో దిగిన వలస నాయకులకు ఎన్నికల్లో టిక్కెట్లు ఇవ్వకూడదని తీర్మానం చేశారు. అప్పట్లో యువ నాయకుడు తీసుకున్న నిర్ణయం పట్ల కాంగ్రెస్లో పెద్ద ఎత్తున హర్షం వ్యక్తం అయింది. ఆ తీర్మానం చేసేందుకు కూడా బలమైన కారణం ఉంది. అదేమంటే, అంతకు ముందు జరిగిన ఎన్నికల్లో కొత్తగా పార్టీలోకి వచ్చిన అనేక మంది నాయకులకు కాంగ్రెస్ టికెట్లు ఇచ్చింది . వారిలో అత్యధిక సంఖ్యలో గెలిచారు కూడా, కానీ ఆ తర్వాత వారిలో మూడొంతులు కాంగ్రెస్ ను వీడి బిజెపి , ఇతర పార్టీలో చేరిపోయారు. దాంతో నిజమైన కాంగ్రెస్ కార్యకర్తలను కాదని కేవలం సీటు కోసమే చేరిన పారాచూట్ వలస నాయకులకు సీట్లు ఇవ్వకూడదని రాహుల్ గాంధీ తీర్మానించారు.
మళ్లీ ఇప్పుడు కాంగ్రెస్ లోకి రాష్ట్రం తో పాటు జాతీయస్థాయిలో వలసల పర్వం మొదలైంది. ప్రధానంగా తెలంగాణలో అనేకమంది నాయకులు కాంగ్రెస్లో చేరేందుకు సిద్ధమయ్యారు. దాంతో ఆ కొత్త నాయకుల డిమాండ్లకు అధిష్టానం తలగ్గితే, ఇప్పటివరకు కాంగ్రెస్ ను నమ్ముకున్న తమ పరిస్థితి ఏమిటనే ఆందోళనకు గురైన కొందరు సీనియర్ కాంగ్రెస్ నాయకులు అధిష్టానం వైపు పరుగులు తీస్తున్నారు.
….. ఖమ్మం జిల్లాలో మొదలైన అలజడి…
ఇక ఖమ్మం జిల్లా విషయానికి వస్తే ఉమ్మడి జిల్లా నుంచి మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పెద్ద ఎత్తున తన అనుచరులతో మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు తో కలిసి కాంగ్రెస్ లో చేరేందుకు సిద్ధమయ్యారు. ఆయన ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఉన్న పది అసెంబ్లీ స్థానాల్లో ఏడు స్థానాలు తమ ప్యానల్ కి కేటాయించాలని , వాటితో పాటు రాష్ట్రవ్యాప్తంగా మరో 15 స్థానాలు కేటాయించాలని కాంగ్రెస్ అధిష్టానాన్ని కోరినట్లు తెలుస్తోంది.
దాంతో ఉమ్మడి ఖమ్మం జిల్లా పై పట్టు కలిగిన సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క వర్గీయులు, మాజీ కేంద్రమంత్రి రేణుక చౌదరి వర్గీయుల్లో ఆందోళన మొదలైంది. ఇప్పటికే రేణుక చౌదరి ఢిల్లీ పెద్దలను కలిసి తన వర్గీయులకు కొన్ని స్థానాలు కేటాయించాల్సిందేనని డిమాండ్ చేసినట్లు సమాచారం. అదేవిధంగా బట్టి విక్రమార్క కూడా తన వర్గీయులకు కొన్ని స్థానాలు కేటాయించాలని అధిష్టానం ముందు ప్రస్తావించినట్లు కూడా ప్రచారం జరుగుతోంది.
…. . బెడిసి కొట్టిన టిపిసిసి అధ్యక్షుడు వ్యూహం…

వైయస్ షర్మిల తన పార్టీని కాంగ్రెస్లో విలీనం చేస్తారనే ప్రచారం జరుగుతోంది. ఆమె ఖమ్మం జిల్లా పాలేరు స్థానం నుంచి పోటీ చేస్తానని కాంగ్రెస్ అధిష్టానానికి తెలిపారు. అయితే టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మాత్రం వైయస్ షర్మిల ఆంధ్ర ప్రదేశ్ పిసిసి స్థాయిలో పనిచేస్తే కాంగ్రెస్కు ప్రయోజనం ఉంటుందని ప్రకటించారు. ఆమెను ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఉంచాలని ఒక ప్రయత్నం చేశారు. కానీ ఆమె తన రాజకీయ పోరాట క్షేత్రం తెలంగాణ మాత్రమేనని , తాను ఆంధ్ర రాజకీయాల్లోకి వెళ్ళనని తెగేసి చెప్పారు. తెలంగాణ పిసిసి లో తనకు కీలక పదవి ఇవ్వాలని కూడా ఆమె డిమాండ్ చేసినట్లు ప్రచారం జరుగుతుంది. అంటే ఈ సరికొత్త సమీకరణలు కాంగ్రెస్లో టిపిసిసి అధ్యక్షుడు నుంచి క్రింది స్థాయి స్థానిక నాయకుల వరకు ఒక విధంగా , టెన్షన్ కు గురి చేస్తున్నాయని కొందరు అంటున్నారు.
. ….. ప్యారాచూట్ తీర్మానం బుట్ట దాఖలేనా…..!

ప్రస్తుతం కాంగ్రెస్ అధికారంలోకి రావాలంటే భారీగా వలసలు జరగాల్సిందే , అలా జరగాలంటే వచ్చే ప్యారాచూట్ నాయకులకు సీట్లు ఇవ్వక తప్పదు.
అలా జరిగినప్పుడు నిజమైన కాంగ్రెస్ నేతలు అధికారం వస్తుందని ఆశ కలుగుతున్న వేళ మరో మారు త్యాగానికి సిద్ధం కావాల్సి ఉంటుంది..
……… కాంగ్రెస్లో పరిణామాలపై బి ఆర్ఎస్ ప్రత్యేక దృష్టి….

కాంగ్రెస్ లో వేగంగా మారుతున్న పరిణామాలను గులాబీ పార్టీ ప్రత్యేకంగా పరిశీలిస్తోంది . అసంతృప్తి నేతల కోసం వల సిద్ధం చేసి ఉంచినట్లు తెలుస్తోంది. ఇప్పటికే రాష్ట్ర కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నాయకులుగా ఉన్న మాజీ మంత్రి జానారెడ్డి , ఉత్తంకుమార్ రెడ్డి తీవ్ర అసం తృప్తితో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇక కాంగ్రెస్లో కష్టపడి పనిచేసి టికెట్ ఆశించి భంగపడిన వారిని గుర్తించి , వారికి టిక్కెట్ ఇచ్చి గులాబీ కండువా కప్పేందుకు రహస్య గులాబీ దళం శక్తి వంచన లేకుండా పని చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. మొత్తం మీద ఎన్నికలు సమీపించే నాటికి తెలంగాణ రాజకీయాలు అత్యంత రసవత్తరంగా మారుతాయని పరిశీలకులు అంటున్నారు.

About the author

Mohiddin Shaik

Leave a Comment