ప్రస్తుతం మూతపడిన బిజెపి చేరికల దుకాణం
ప్రస్తుతం మూతపడిన బిజెపి చేరికల దుకాణం
గతంలో వైయస్ రాజశేఖర్ రెడ్డి మాదిరిగా ముఖ్యమంత్రి కేసీఆర్ తాను చేస్తున్న అభివృద్ధిని నమ్ముకున్నారు…. ఇక రాష్ట్రంలో బిజెపి చేరికల దుకాణం ప్రస్తుతానికి మూతపడిందని అంటున్నారు… కాగా ఇతర పార్టీల నుంచి వలసల వరద హస్తం పార్టీ వైపుకు మళ్ళింది… తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు కీలకమైనవిగా పరిశీలకులు భావిస్తున్నారు….
వలసలతో కాంగ్రెస్లో నయా జోష్ కనిపిస్తున్నప్పటికీ , అభివృద్ధి మంత్రంతో ముందుకెళుతున్న కెసిఆర్ మరోమారు అధికారంలోకి వస్తారనే వాదన కూడా బలంగానే వినిపిస్తోంది. పవర్ పాలిటిక్స్ లో తలపండిన నేతగా , తెలంగాణ ప్రజల నాడి తెలిసిన నాయకుడిగా, పేరున్న కేసీఆర్ ఎన్నికల వ్యూహాలు రచించడంలోనూ గట్టివాడని చెప్పవచ్చు.
……… కెసిఆర్ వ్యూహంతోనే బిజెపి జోరు తగ్గిందా…..
సీఎం కేసీఆర్ వ్యూహంతోనే రాష్ట్రంలో బిజెపి జోరు తగ్గిందని కొందరు విశ్లేషిస్తున్నారు. కర్ణాటక ఎన్నికల ఫలితాలకు ముందే బిజెపి జోరు తగ్గింది ఏక్ నాథ్ షిండేలు, కట్టప్పల తో సహా డబుల్ ఇంజన్ నినాదం కూడా అంచలంచలుగా వినిపించకుండా ఆగిపోయిందని కొందరు వ్యాఖ్యానిస్తున్నారు. అందుకు కారణం కేసీఆర్ వ్యూహమే అని వారు పేర్కొంటున్నారు. అంతకుముందు అంటే ఉప ఎన్నికల సందర్భాల్లోనూ కేసీఆర్ తమకు , బిజెపికి మధ్య పోటీ ఉంటుందని చెప్పేవారు. అంతటితో ఆగకుండా కాంగ్రెస్ తమకు పోటీ కాదని , అది ఇతర పార్టీలకు కార్యకర్తలను సప్లై చేసే ఏజెన్సీ అని కూడా వ్యాఖ్యానించిన సందర్భాలు ఉన్నాయి. అప్పట్లో బీజేపీ దూకుడు మరింత పెంచింది . ..
కమ్యూనిస్టులతో కలిసి , బిజెపి అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ని ఉప ఎన్నికల్లో ఓడించాక కేసీఆర్ వ్యూహం మార్చుకున్నారు. అప్పటివరకు బిజెపికి , బి ఆర్ఎస్ కి మధ్య పోటీ అన్న కేసీఆర్ , ఆ తరువాత కాంగ్రెస్ కి తమ పార్టీకి మధ్య పోటీ ఉంటుందని కాంగ్రెస్ రాష్ట్రంలో బలంగా ఉందని స్టేట్మెంట్ ఇచ్చారు. ఆ తర్వాత జరిగిన యూత్ కాంగ్రెస్ భారీ సభకు ఎటువంటి ఆటంకాలు కలగకుండా పరోక్షంగా కెసిఆర్ సర్కారు సహకరించిందనే ప్రచారం జరిగింది. తద్వారా బిజెపి కంటే కాంగ్రెస్ రాష్ట్రంలో బలంగా ఉందనే అంశం హైలైట్ అయింది.
ఫలితంగా బిజెపి డబుల్ ఇంజన్ నినాదం క్రమక్రమంగా వినపడకుండా ఆగిపోయింది.
ఇక ఆ తర్వాత ఏకంగా బిజెపి చేరికల కమిటీ బలహీనపడింది ఆ పార్టీలో చేరేందుకు బలమైన నాయకులు ఎవరు రావడంలేదని చేరకల కమిటీ అధ్యక్షుడే ప్రకటించే పరిస్థితి వచ్చింది . అంటే ఒక విధంగా చేరికల దుకాణం ప్రస్తుతానికి మూ తా బడినట్లేనని బిజెపి వ్యతిరేక వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. మారిన ఈ పరిణామాలన్నీ కెసిఆర్ వ్యూహంలో భాగమేనని విశ్లేషకులు కొందరు పేర్కొంటున్నారు. గతంలో కాంగ్రెస్ ను కూడా కేసీఆర్ వ్యూహాత్మకంగానే దెబ్బ కొట్టి ప్రతిపక్ష హోదా కంటే కూడా తగ్గే విధంగా చేశారనే వాదన ఉంది. అప్పట్లో కాంగ్రెస్ ను తగ్గించేందుకు బిజెపికి స్కోప్ ఇచ్చిన కేసీఆర్ ఇప్పుడు తన వ్యూహం మార్చుకొని కాంగ్రెస్కు వ్యూహాత్మకంగా స్కోపి ఇవ్వడం ద్వారా బిజెపి గొంతు వినిపించకుండా చేశారని కొందరు విశ్లేషిస్తున్నారు.
కాంగ్రెసులో ప్రస్తుతం వలసల కోలాహలం కెసిఆర్ ముందుగా ఊహించిదేనని వారు పేర్కొంటున్నారు. అధికారం కోసం ఎప్పటికీ ఏ రాజకీయ ఆస్త్రం , అవసరము గురి చూసి ప్రయోగించే నేర్పరి కేసీఆర్ అని కొందరు పరిశీలకులు అంటున్నారు.
…… అభివృద్ధి మంత్రంతోనే కేసీఆర్ అడుగులు…..
వచ్చే ఎన్నికల్లో కేవలం అభివృద్ధిని చూపించి గెలవాలనే దృక్పథంతో కేసిఆర్ అడుగులు వేస్తున్నారు. గతంలో వైయస్ రాజశేఖర్ రెడ్డి సీఎంగా ఉండి రెండవసారి ఎన్నికల్లో మహాకూటమితో తలపడి విజయం సాధించారు . ఆయన అమలు చేసిన ఆరోగ్యశ్రీ , 108 , 104, ఇందిరమ్మ ఇండ్లు , ఫీజు రియంబర్స్మెంట్, రైతులకు ఉచిత విద్యుత్తు, రుణమాఫీ , ఇలా పథకాలన్నీ ప్రజల్లో నిలిచిపోయాయి. దాంతో రెండవ సారి ఎన్నికల్లో టిడిపి, కాంగ్రెస్ కమ్యూనిస్టులతో సహా అన్ని పార్టీలు మహాకూటమిగా ఏర్పడి పోటీ చేసిన, జనం మాత్రం వైయస్సార్ కే జై కొట్టారు.
ఇప్పుడు కేసీఆర్ కూడా అదే ఫార్ములా తో ఎన్నికల్లో పోటీ చేయబోతున్నారు. గతంలో వైయస్సార్ అమలు చేసిన పథకాలతో పాటు అనేక కొత్త పథకాలను అమలు చేస్తూ కేసీఆర్ ఓటర్ల ముందుకు వెళుతున్నారు. కెసిఆర్ తెచ్చిన కొత్త పథకాల్లో కళ్యాణ లక్ష్మి రైతు బంధు , దళిత బంధు , ప్రతి జిల్లాకి ఒక మెడికల్ కాలేజ్ , పెద్ద ఎత్తున గురుకులాల ఏర్పాటు , ఉచిత విద్యుత్తు, రైతు భీమా, ఎక్కడా లేని విధంగా పెద్ద ఎత్తున సామాజిక పెన్షన్లు మిషన్ భగీరథ , కాకతీయ పథకాలు అమలు చేస్తున్నారు. ఈ పథకాలు నేరుగా ప్రజల గుండెల్లో నిలిచిపోయేవిగా ఉండగా, రాష్ట్రానికి తలమానికంగా కొత్త సచివాలయం అంబేద్కర్ విగ్రహం అమర జ్యోతి తో పాటు రాష్ట్రవ్యాప్తంగా పట్టణ, పల్లె ప్రగతి పరుగులు తీసేలా చర్యలు తీసుకున్నారు. కాలేశ్వరం తో సహా నీటి ప్రాజెక్టుల నిర్మాణాలతో గణనీయంగా పంట పండే విస్తీర్ణాన్ని పెంచింది. ఇక అన్ని మతాలకు చెందిన పండుగలను రాష్ట్ర పండుగలుగా చేయడంతో పాటు మరో తిరుపతిని తలపించే విధంగా యాదాద్రి దేవాలయ నిర్మాణంతో భక్తిలోను తనకు సాటి ఎవరూ లేరనే ముద్ర కెసిఆర్ వేసుకున్నారు. ఇవన్నీ ప్రజలకు నిత్యం కంటికి కనపడేవి ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి విద్య , ప్రభుత్వ వైద్యం మెరుగైంది. అభివృద్ధి నమూనాలో జాతీయస్థాయిలో గుర్తింపు వచ్చింది . హైదరాబాద్ నగరం ఐటి తో సహా ఫార్మా కంపెనీలు అనేక విదేశీ కంపెనీల పెట్టుబడులతో ఉపాధికి చిరునామాగా మారిపోయిందని అంటున్నారు.
ఇక వీటితోపాటు ప్రభుత్వంపై నిరుద్యోగుల, నిరసనలు ప్రభుత్వ ఉద్యోగుల్లో కొంత వ్యతిరేకత, విమర్శలు విపక్షాల ఆరోపణలు కూడా ఉన్నాయి . కానీ అవి కేసీఆర్ను గద్దె దించే స్థాయిలో ఉన్నాయా , లేవా అనే విషయం తేలలంటే వచ్చే ఎన్నికల దాకా ఆగాలిగా మరి…
