ఈటెలతో పొంగులేటి మీట్ వ్యూహాత్మక లీకేజీ నా..!
రాష్ట్ర రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ.
పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్యానల్ , ఈటెల రాజేందర్ తో మాట్లాడి బిజెపిలోకి వెళుతుందా లేక ఈటెల రాజేందర్ తో సహా బీజేపీ అసంతృప్తి నేతలు అందరూ పొంగులేటి ప్యానల్ తో కలిసి కాంగ్రెస్లో చేరబోతున్నారా..? ఈ రహస్య భేటీ లో ఏం జరిగిందనే అంశంపై తెలంగాణ రాజకీయ వర్గాల్లో జరుగుతున్న సరికొత్త చర్చ ఆసక్తిని రేపుతోంది.. గురువారం రాజధాని సమీపంలోని ఓ ఫామ్ హౌస్ లో జూపల్లి కృష్ణారావుతో కలిసి బిజెపి చేరికల కమిటీ అధ్యక్షుడు ఈటెల రాజేందర్ తో పొంగులేటి శ్రీనివాసరెడ్డి రహస్య సమావేశం జరిగినట్లు వార్తలు వచ్చాయి. అంగరక్షకులతో సహా వ్యక్తిగత సహాయకులను సైతం వెంట లేకుండా అత్యంత రహస్యంగా ఈ సమావేశం జరిగినట్లు వివిధ ఛానల్ లో వార్తలు విలువడ్డాయి అయితే అంత గోప్యంగా జరిగిన సమావేశం వివరాలు వెంటనే అన్ని చానల్లో ఎలా ప్రచురితమయ్యాయి అనే అంశంపై కూడా ఆసక్తికర చర్చ జరుగుతోంది. ఈ రహస్య భేటీ వ్యవహారం వ్యూహాత్మకంగానే లీక్ అయిందని ప్రచారం జరుగుతోంది. పొంగులేటి ప్యానల్ ఇప్పటికే కాంగ్రెస్ గూటికి చేరేందుకు నిర్ణయం జరిగినట్లు ప్రచారం జరుగుతోంది ఇది ఇలా ఉంటే బిజెపి నేతలు ఈటెల తో సహా కొంతమంది ఇదివరకే ఖమ్మం లోని పొంగిలేటి నివాసంలో సంప్రదింపులు జరిపిన విషయం తెలిసిందే. ఆ తరువాత కాంగ్రెస్ రాష్ట్ర చీఫ్ రేవంత్ రెడ్డి పొంగులేటితో సహా జూపల్లి కృష్ణారావు ఈటెల రాజేందర్ తో పాటు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఇతర బిజెపి లోనే అసంతృప్తి నేతలు సైతం కాంగ్రెస్లోకి రావాలని ఆహ్వానించారు. ఈ సందర్భంగా వారి కోసం అవసరమైతే తాను పది మెట్లు దిగటానికి కూడా సిద్ధంగా ఉన్నానని, ఏదైనా సందర్భంలో తనను ఆయా నాయకులు దూషించినప్పటికీ తాను మనసులో పెట్టుకోనని కూడా రేవంత్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఆ తర్వాత బిజెపిలోని ఈటెల తో సహా రాజగోపాల్ రెడ్డి తో పాటు మరికొందరు బిజెపిని వేడతారని, కాంగ్రెస్ లో చేరే అవకాశాలు కూడా ఉన్నాయని ప్రచారం జరిగింది. ఆ ప్రచారానికి ఆయా నాయకులు కొన్ని సందర్భాల్లో ఖండనలు ఇచ్చినప్పటికీ గురువారం ఈటెలతో పొంగులేటి రహస్య సమావేశం సరికొత్త వ్యూహాలకు, ప్రచారాలకు, కేంద్ర బిందువుగా మారిందనే అభిప్రాయాలు రాజకీయ వర్గాల్లో వ్యక్తం అవుతున్నాయి. ఈ వ్యూహాత్మక భేటీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్యానల్ ను బిజెపిలోకి పంపిస్తుందా, లేక పొంగులేటి ప్యానల్ తో కలిసి ఈటెల రాజేందర్ వర్గం కాంగ్రెస్ వైపు అడుగులేస్తుందా, అనే అంశంపై రాజకీయ పరిశీలకులు ఆసక్తికర వ్యాఖ్యలు చేస్తున్నారు. ఈ రహస్య భేటీ ఎటు మలుపు తీసుకుంటుందో వేచి చూడాల్సిందే.
