సీట్ల కేటాయింపు పై అంగీకారం కుదిరినట్లేనా..!
రాష్ట్రవ్యాప్తంగా 30 ఉమ్మడి జిల్లాలో 6 స్థానాలట.
సత్తుపల్లి సీటు కోసం రాజీనామా చేసిన పిఆర్ ఈ ఈ.
పొంగులేటి శ్రీనివాసరెడ్డి హస్తం పార్టీ వైపు అడుగులు వేయడం దాదాపు ఖాయమైపోయింది.. ఇక ప్రకటించటమే లాంచన మాట…
ఇక కాంగ్రెస్ పార్టీతో సీట్ల కేటాయింపు విషయంపై కూడా ఒక అంగీకారం కూడా కుదిరినట్లు అత్యంత విశ్వసినియ వర్గాల ద్వారా తెలిసింది. రాష్ట్రవ్యాప్తంగా తనతో పాటుగా మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావుతో సహా తనతో నడిచే వారందరికీ 30 అసెంబ్లీ స్థానాలు కేటాయించాలని కాంగ్రెస్ను కోరగా సూత్రప్రాయంగా అంగీకరించినట్లు సమాచారం. తెలంగాణలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు ఏ చిన్న అవకాశాన్ని కూడా విడిచి పెట్టకూడదని కాంగ్రెస్ అధిష్టానం భావిస్తున్న నేపథ్యంలో పొంగిలేటి ప్యానల్ కు అధిష్టానం ప్రాధాన్యతనిస్తున్నట్లు తెలుస్తోంది. కోరుకున్న 30 స్థానాలలో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 6 అసెంబ్లీ, ఒక ఎంపీ స్థానాన్ని పొంగులేటి ప్యానల్ కోరుకున్నట్లు సమాచారం. దానికి దాదాపు కాంగ్రెస్ అధిష్టానం నుంచి సానుకూల సంకేతాలు వచ్చాయని చర్చ జరుగుతోంది. కాంగ్రెస్తో దాదాపు ఒక ఒప్పందానికి వచ్చిన నేపథ్యంలో పొంగులేటి ఆశీస్సులతో టిక్కెట్లు ఆశిస్తున్న వారు ఇక పోటీకి సిద్ధం అయిపోతున్నారనే చర్చ జరుగుతుంది. అందులో భాగంగానే సత్తుపల్లి నియోజకవర్గంలో నుంచి పోటీ చేయాలని ఆశిస్తున్న కొత్తగూడెం పి ఆర్ ఈ ఈ సుధాకర్ మంగళవారం తన ఉద్యోగానికి రాజీనామా చేశారని ప్రచారం జరుగుతుంది. పొంగులేటి సూచన మేరకే ఆయన తన ఉద్యోగానికి రాజీనామా చేసి పోటీకి సిద్ధమవుతున్నారని తెలుస్తోంది. జిల్లాలోని ఆరు స్థానాల్లో అశ్వరావుపేట , పినపాక , కొత్తగూడెం , ఇల్లందు , వైరా , నుంచి పొంగిలేటి అనుచరులు ఆయన సూచించిన అభ్యర్థులు రంగంలోకి దిగుతారనే ప్రచారం జరుగుతుంది. ఇదిలా ఉంటే కొత్తగూడెం నియోజకవర్గం నుంచి పొంగులేటి ద్వారా జలగం వెంకట్రావు రంగంలోకి దిగుతారనే విశ్వసనీయంగా తెలిసింది. పాలేరు, ఖమ్మం ,భద్రాచలం ,మధిర ,నియోజక వర్గాలు మినహా మిగిలిన నియోజకవర్గాల్లో పొంగిలేటి ప్యానల్ నుంచి కాంగ్రెస్ పక్షాన ఈసారి ఎన్నికల్లో పోటీ పడబోతున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ షర్మిల కూడా కాంగ్రెస్తో చేయి కలిపితే పాలేరు స్థానాన్ని ఆమెకు కేటాయిస్తారు అనే ప్రచారం జరుగుతోంది. మధిర నుంచి బట్టి విక్రమార్క , భద్రాచలం నుంచి పో దెం వీరయ్య తిరిగి పోటీ చేస్తారని సమాచారం. ఈ విధంగా జరుగుతున్న ప్రచారంతో పొంగులేటి వర్గీల్లో సంతోషం వ్యక్తం అవుతుండగా , కాంగ్రెస్ పక్షాన పోటీ చేసేందుకు ఆశావహులుగా ఉన్న నాయకులు మాత్రం ఈ తాజా పరిణామాలతో తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. పొంగులేటి చేరిక పై కాంగ్రెస్ క్యాడర్ లో మాత్రం సంతోషం వ్యక్తం అవుతుండగా ఒక విధంగా ఇప్పటివరకు సీట్లపై ఆశలు పెట్టుకున్న, కాంగ్రెస్ నేతలు మాత్రం నిరాశకు గురవుతున్నారు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి కాంగ్రెస్ లో చేరిక జూన్ నెల రెండవ వారంలో కచ్చితంగా ఉంటుందని ఆయన వర్గీల్లో ముఖ్యులు కొందరు చెబుతున్నారు. మొత్తం మీద పొంగులేటి కాంగ్రెస్ గూటికి చేరడం దాదాపు ఖాయమైపోయిందని చెప్పవచ్చు.
