తెలంగాణ రాజకీయం

అమాత్యుని ధీమ అభివృద్దే నా

Written by Mohiddin Shaik

సవాళ్లపై సరికొత్త చర్చ

ఖమ్మం అసెంబ్లీపై విపక్షాల ప్రత్యేక దృష్టి

ఖమ్మం జిల్లాలో గత కొన్ని రోజులుగా చోటుచేసుకుంటున్న రాజకీయ పరిణామాలు రాష్ట్ర రాజకీయ పండితుల దృష్టిని ఆకర్షిస్తున్నాయి. ఎన్నికలకు ఇంకా సమయం ఉన్నప్పటికీ ఇక్కడ రాజకీయ ప్రముఖులు విసురుతున్న సవాళ్లు , ప్రతిజ్ఞల నేపథ్యంలో ఉమ్మడి జిల్లాలో ఇప్పుడే ఎన్నికల వేడి కనిపిస్తోంది. కర్ణాటక ఎన్నికలు కూడా పూర్తి కావడంతో ఇప్పటివరకు ఆ రాష్ట్రంలో ప్రచారాలు నిర్వహించిన బిజెపి నాయకులు ఉమ్మడి జిల్లాలో పర్యటనలు మొదలుపెట్టారు. మరోవైపు మాజీ ఎంపీ బి ఆర్ ఎస్ బహిష్కృత నేత పొంగులేటి శ్రీనివాసరెడ్డి నీ తమ పార్టీలో చేర్చుకునేందుకు అన్ని ప్రయత్నాలను బిజెపి చేస్తుంది . మరోవైపు కాంగ్రెస్ కూడా పొంగులేటిని ఇప్పటికే ఆహ్వానించిన సంగతి తెలిసిందే. అయితే పొంగులేటి కాంగ్రెస్ వైపు అడుగులు వేస్తారనే ప్రచారం పెద్ద ఎత్తున జరిగింది. ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి బి ఆర్ ఎస్ పక్షాన ఏ ఒక్కరిని అసెంబ్లీ గేటు తాకనివ్వను అని ఆయన చేసిన ప్రతిజ్ఞ రాష్ట్రవ్యాప్తంగా రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీసింది. ఆ ప్రతిజ్ఞ తర్వాత పొంగులేటి కచ్చితంగా కాంగ్రెస్ వైపే అడుగులు వేస్తారని చర్చ కూడా పెద్ద ఎత్తున జరిగింది. ఈ నేపథ్యంలోనే మాజీ కేంద్రమంత్రి కాంగ్రెస్ ఎంపీ రేణుక చౌదరి పొంగిలేటిని ఉద్దేశించి, ఒక న్యూస్ ఛానల్ ప్రతినిధి అడిగిన ప్రశ్నలకు సమాధానంగా మాట్లాడుతూ , ఆ పార్టీ ఈ పార్టీ తనకు ఇన్ని సీట్లు కావాలి అంటూ సమయం వృధా చేయడం పొంగులేటిది అనుభవ రాహిత్యం అంటూ విమర్శలు చేశారు. అంతటితో ఆగకుండా ఎక్కడా పనికిరాని వారు కాంగ్రెస్ లోకి వస్తారని ఓ మాట అంటూ పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఖమ్మంలో పోటీచేసి మంత్రిని ఓడించవచ్చుగా ,అంటూ కూడా వ్యాఖ్యానించారు. రేణుక చౌదరి వ్యాఖ్యలపై రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఫైర్ అయ్యారు. ఆమె మాటలకు స్పందిస్తూ దమ్ముంటే రేణుకా చౌదరి తనపై పోటీ చేసి గెలవాలని సవాలు విసిరారు, అలా గెలిస్తే తాను రాజకీయ సన్యాసం తీసుకుంటాను అని కూడా ప్రకటించారు. ఇలా పొంగులేటి ఒకపక్క పదిమందిని ఓడిస్తానని శపధం చేయగా , మరోపక్క తనను ఓడిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటాను అంటూ మంత్రి సవాల్ విసిరారు. ఈ రెండు సవాళ్లు వేరువేరు, సందర్భాల్లో చేసినప్పటికీ ఉమ్మడి జిల్లా రాజకీయ వర్గాల్లో వేడిని పుట్టించాయి.
…… మంత్రి సవాల్ ఫై సర్వత్రా చర్చ. ….

మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ తాను నియోజకవర్గంలో చేసిన అభివృద్ధిపై అత్యంత ధీమాగా ఉన్నారని ఆ పార్టీ నేతలు అంటున్నారు. ప్రధానంగా ఖమ్మం నగరంలో జరిగిన అభివృద్ధి, అన్ని వర్గాల ప్రజలతో ఆయన మమేకమై ఉండే విధానం వచ్చే ఎన్నికల్లో ఆయనను గెలిపించి తీరుతుందని ఆ పార్టీ వర్గాలు బలంగా నమ్ముతున్నాయి. ఖమ్మం నగరానికి ఐటీ హబ్ ను తీసుకురావడం, ఆ రంగానికి చెందిన నిరుద్యోగుల్లో ఆత్మస్థైర్యాన్ని నింపడం అజయ్ కుమార్ వల్లే సాధ్యపడిందనే భావన నియోజకవర్గ ప్రజల్లో ఉంది. అదేవిధంగా ఖమ్మం నగర సుందరీకరణ, ఇందులో ప్రధానంగా ఖమ్మం నగరంలోని కొంత భాగాన్ని అత్యంత దుర్గంధం వెదజల్లే గోళ్లపాడు ఛానల్ పెనవేసుకుని దశాబ్దాలుగా ఉన్న విషయం అందరికీ తెలిసిందే. గొల్లపాడు ఛానల్ ను ఆధునికరించి తీవ్రదుర్గంధపూరితమైన వాతావరణాన్ని , పూర్తిగా మార్చేసి అదే గొల్లపాడు మురుగు కాలువను సుగందాలు వెదజల్లే ఉద్యానవనాలుగా, ఆట స్థలాలుగా తీర్చిదిద్దిన ఘనత పువ్వాడ అజయ్ కుమార్ కే దక్కుతుందని నగర ప్రజలు అంటున్నారు. అదేవిధంగా ఆ మురుగు కాల్వ పై దశాబ్దాలుగా గుడిసెలు వేసుకొని అష్ట కష్టాలు పడి నివసించిన వందలాది మంది పేదలకు నూతన కలెక్టరేట్ సమీపంలో అత్యంత ఖరీదైన స్థలాన్ని కేటాయించి వారు ఇండ్లు వేసుకునే విధంగా మౌలిక సదుపాయాలు కల్పించిన ఘనత కూడా అజయ్ కుమార్ కే దక్కుతుంద నీ ఆ పార్టీ వారు పేర్కొంటున్నారు . ఖమ్మం నియోజకవర్గ పరిధిలో అత్యధికంగా ఓటు బ్యాంకు కలిగిన ముస్లిం మైనారిటీ ఓటర్లంతా అత్యధిక శాతం అజయ్ వెంటే ఉంటారనే వాదన ఉంది . ఈ అంశం ఆయనకి బాగా కలిసి వచ్చే అంశంగా చెప్పవచ్చు. అదే సందర్భంలో బీసీ, ఓసి వర్గాల్లో కూడా ఆయనకు మంచి పేరే ఉందని ఆ పార్టీ నేతలు పేర్కొంటున్నారు. ఇక వివిధ రకాల సామాజిక పింఛన్లను పొందే ఓటర్ల అండదండలు తనకే ఉంటాయని కొందరు విశ్లేషిస్తున్నారు. ఇదిలా ఉంటే సంక్షేమ పథకాలు తన నియోజకవర్గంలోని ప్రజలకు పూర్తిస్థాయిలో అందే విధంగా కృషి చేయడంలో కూడా అజయ్ కుమార్ ముందున్నారనే చర్చ ఉంది. కోవిడ్ సందర్భంలో అనేకమంది పేద రోగులకు తన సొంత ఖర్చులతో కూడా ఖరీదైన వైద్యం చేయించారనే పేరు ఉంది. కోవిడ్తో హైదరాబాద్ ప్రైవేట్ ఆసుపత్రిలో చనిపోయిన కొందరి మృతదేహాలను సైతం డబ్బు కోసం ఆయా ఆసుపత్రులు ఆపు చేస్తే , ఆ యాజమాన్యాలకు తన సొంత డబ్బు చెల్లించి వారిని ఖమ్మం రప్పించి ఓదార్చిన సందర్భాలు అనేకం ఉన్నాయని ఆ సహాయం పొందిన వారు పేర్కొంటున్నారు. , కోవిడ్ సందర్భంగా జిల్లా ప్రధాన ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య సేవలు ఆయన చొరవతో పెద్ద ఎత్తున అందించారు జిల్లా వ్యాప్తంగా కూడా ప్రభుత్వ వైద్యం అందే విధంగా చురుకుగా చర్యలు తీసుకొని జిల్లాకు పేరు తెచ్చే విధంగా కూడా కృషి జరిగింది అనే అభిప్రాయాలు ఉన్నాయి .ఇవి గాక రైతు లోకం ఓటు గులాబీ పార్టీ వైపే ఉంటుందనే చర్చ కూడా ఉంది. రైతుబంధు రైతు భీమా, ఉచిత విద్యుత్తు, సకాలంలో విత్తనాలు ఎరువుల సరఫరా వంటి విషయాల్లో రైతులు ఏ ఒక్కచోట కూడా ఆందోళనలు చేయవలసిన అవసరం ఏర్పడకపోవడం బి ఆర్ ఎస్ కు కలిసొచ్చే అంశంగా పరిశీలకులు పేర్కొంటున్నారు . వైద్య పరంగా కూడా ప్రభుత్వ వైద్యం గతం కంటే మెరుగైన వైద్యం అందుతుందనే భావన ప్రజల్లో ఉంది. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని అజయ్ కుమార్ ఆ సవాలు విసిరారు అనే అభిప్రాయాలు ఉన్నాయి . అయితే ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు కూడా ఉన్నాయి ప్రభుత్వ ఉద్యోగుల్లో అత్యధిక శాతం అసంతృప్తితో ఉన్నారనే చర్చ ఉంది. ఇక నిరుద్యోగులు కూడా ప్రభుత్వంపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారనే అభిప్రాయాలు ఉన్నాయి. అయితే రానున్న ఎన్నికల్లో విపక్షాలు మంత్రిని ఓడించడానికి ప్రత్యేక దృష్టి సారించి ఎవరెవరు చేతులు కలుపుకుంటారో , ఏ అవగాహనతో ముందుకు వెళ్తారు , ఇప్పుడే చెప్పడం కష్టం. ఎవరు ఎవరితో కలిసినా, ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఉభయ కమ్యూనిస్టులు బి.ఆర్.ఎస్ తో ఎన్నికల పొత్తు ఉంటుంది అని చెబుతున్న నేపథ్యంలో. ఆయా పార్టీల ఓట్లు కచ్చితంగా బిఆర్ఎస్ అభ్యర్థుల్ని గెలిపించడంలో కీలకంగా మారతాయని అభిప్రాయాలు రాజకీయ వర్గాల్లో ఉన్నాయి. ఈ అంశం కూడా మంత్రి అజయ్ కుమార్ కు బాగా కలిసి వచ్చే అంశంగా చెబుతున్నారు. ఒకపక్క అభివృద్ధి సంక్షేమంతో పాటుగా తాను జనంతో కలిసిమెలిసి ఉండే విధానం ఆయనను సునాయాసంగానే గెలుపు తీరాలకు చేర్చుతుందని కొందరు విశ్లేషిస్తున్నారు. మొత్తం మీద ఎన్నికలు రాకముందే ఉమ్మడి ఖమ్మం జిల్లాలో సవాళ్లు , ప్రతి సవాళ్లతో రాజకీయాలు వేడెక్కాయి
…………….
By, మొహిద్దిన్.

About the author

Mohiddin Shaik

Leave a Comment