కౌలు రైతు ల పట్ల తెలంగాణ సీఎం కేసీఆర్ సానుకూల నిర్ణయం తీసుకున్నారు. తుఫాను కారణంగా పంటలు నష్టపోయిన కౌలు రైతులకు సహాయ పునరావాస కల్పన కింద ఎకరానికి పదివేల రూపాయలు ఇస్తామని చేసిన ప్రకటన కవులు రైతుల్లో ఆనందాన్ని నింపింది. భవిష్యత్తులో రైతుబంధు వంటి స్కీముల్లో కూడా కౌలు రైతులకు కొంత మేలు చేస్తారేమో అని ఆశలు కూడా కౌలు రైతుల్లో రేకెత్తుతున్నాయి . గురువారం ఖమ్మం జిల్లా పర్యటనకు వచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్ కౌలు రైతుల పట్ల చూపించిన కారుణ్యంతో వారిలో ఆశలు చిగురిస్తున్నాయి. ఖమ్మం జిల్లాలో తుఫాను వల్ల దెబ్బతిన్న పంటలను ముఖ్యమంత్రి స్వయంగా పరిశీలించారు . ఈ సందర్భంగా ఆయన వెంట సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు, సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఉన్నారు . వారు ఈ సందర్భంగా కౌలు రైతుల దయనీయ పరిస్థితుల గురించి ముఖ్యమంత్రికి వివరించారు వారితో పాటు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమల రాజు స్థానిక ప్రజాప్రతినిధులు కూడా కౌలు రైతులకు న్యాయం చేయాలని ముఖ్యమంత్రి కి విజ్ఞప్తి చేశారు. దాంతో ఆయన సానుకూలంగా స్పందించి పంటలు నష్టపోయిన కౌలు రైతులకు నష్టపరిహారం అందిస్తామని , అవసరమైన నిబంధనలు రూపొందించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఆదేశించారు. పది రోజుల్లో రైతులకు పంట నష్టపరిహారం అందించాలని అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు . రాష్ట్రవ్యాప్తంగా జరిగిన పంట నష్టాన్ని అంచనా వేశారని దానికి 228 కోట్లు అవసరమవుతాయని వేసిన అంచనా ప్రకారం నిధుల విడుదలకు కూడా ఆదేశాలు ఇచ్చినట్లు ముఖ్యమంత్రి స్వయంగా చెప్పారు. రైతులకు నష్టపరిహారం ఇచ్చే సందర్భంలో భూమి యజమాని అయిన రైతును , కౌలు రైతును పిలిపించి పంట ఎవరు వేశారు ఎవరు నష్టపోయారు తెలుసుకొని పరిహారం చెల్లించాలని ముఖ్యమంత్రి జిల్లా , కలెక్టర్ ను ఆదేశించారు. పరిహారం ఎకరాకు పదివేల రూపాయలు ప్రకటించడం పట్ల రైతుల్లో హర్షం వ్యక్తం అవుతుంది. అదేవిధంగా కేంద్రం సహాయం అందించే వరకు వేచి చూడకుండా రాష్ట్ర ప్రభుత్వమే 10 రోజుల్లో సహాయం అందిస్తామని ప్రకటించడం పట్ల కూడా రైతులు ఆనందం వ్యక్తం చేశారు. ఇదిలా ఉంటే కౌలు రైతుల పట్ల ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పటివరకు ప్రభుత్వం తరఫున వర్తించే ఏ రాయితీలు కూడా వారికి వర్తింప చేయలేదు. గతంలో కౌలు రైతును రైతుగా గుర్తించడం కష్టమని ఆయన స్వయంగా ప్రకటించిన విషయం తెలిసిందే. భూమి కలిగిన వాడు మాత్రమే రైతు అనే విధానంతో ఉండడం వల్లే భూములు కౌలుకు ఇచ్చుకొని వ్యాపారాలు చేసుకునే భూమి కలిగిన రైతులకు ఇటు కవులు , డబ్బు , అటు ప్రభుత్వ నుంచి పంట సాయం కింద వచ్చే రైతుబంధు నిధులు ఒక్కరే పొందుతున్నారు. అయితే పంటకు పెట్టుబడులు పెట్టి నష్టపోయేది వ్యవసాయం చేసే కౌలు రైతులే అధికం. ఈ విషయంలో కవులు రైతు పట్ల కూడా ముఖ్యమంత్రి సానుకూల దృక్పథంతో కారుణ్య కోణంలో ఆలోచిస్తే భవిష్యత్తులో కౌలు రైతులకు కూడా రైతుబంధు వంటి పథకాల కింద రాయితీలు పొందే అవకాశాన్ని ముఖ్యమంత్రి కల్పిస్తారేమో అని ఆశలు వారిలో చిగురుస్తున్నాయి . మొత్తం మీద ముఖ్యమంత్రి లో కవులు రైతుల పై వచ్చిన మార్పు పట్ల సర్వత్ర హర్షం వ్యక్తం అవుతోంది.
…….. ……………….
…… బై మొహిద్దిన్

