తెలంగాణ ప్రత్యేక కథనాలు రాజకీయం

కొంచెం ఆసక్తి.. కొంచెం నిరా సక్తి…సర్పంచ్ పదవులపై మోజు కొందరికి తగ్గిందా..!పదవులు పోయినా, కొందరిని వదలని అప్పులు

గ్రామపంచాయతీ ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తోంది… ఆగస్టు నెలలోనే నోటిఫికేషన్ వస్తుందని కొందరు అంటే , కులగణన తర్వాత ఎన్నికలు జరుగుతాయని మరి కొందరు అంటున్నారు.. మొత్తం మీద త్వరలోనే గ్రామాల్లో పంచాయతీ ఎన్నికల సందడి మొదలు కాబోతోంది…అయితే ఇదివరకు సర్పంచులు గా పని చేసిన వారిలో చాలామంది ఈసారి ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఆసక్తి చూపడం లేదని చర్చ జరుగుతుంది. కారణాలు ఏమిటని పరిశీలిస్తే, మొన్నటి వరకు సర్పంచ్లుగా పని చేసిన అనేకమంది ప్రభుత్వం నుంచి పంచాయతీలకు రావలసిన గ్రాంట్లు ,రాష్ట్ర ఆర్థిక సంఘం నిధులు రాకపోవడంతో సొంత డబ్బులతో కూడా అనేకమంది పనులు చేయించారు. అప్పుల పాలయ్యారు. అప్పటి కెసిఆర్ ప్రభుత్వం గ్రామాలను స్వచ్ఛ గ్రామాలుగా తీర్చిదిద్దే అనేక ఆకర్షణీయమైన కార్యక్రమాలతో సర్పంచులను బాగా మోటివేట్ చేసింది.

కెసిఆర్ రెండవసారి అధికారంలోకి వచ్చాక మూడు సంవత్సరాల నాలుగు నెలలు మాత్రమే రాష్ట్ర ఆర్థిక సంఘం నిధులు సజావుగా పంచాయతీలకు అందాయి. దాంతో సర్పంచులంతా నిధులు ఇదేవిధంగా వస్తాయనే నమ్మకంతో అనేకమంది అభివృద్ధిలో తామే పేరు తెచ్చుకోవాలని , ఎవరికి వారే పోటీపడి పనులు చేయించారు. కానీ స్టేట్ ఫైనాన్స్ నిధులు హఠాత్తుగా ఆగిపోయాయి. ఈ నెలలో వస్తాయి, ఆ నెలలో వస్తాయని ఎదురుచూసిన సర్పంచులు దాదాపు 20 నెలల పాటు నిధులు ఆగిపోవడంతో దిక్కుతోచని స్థితిలో పడిపోయారు. ప్రభుత్వం మొదట్లో ఇచ్చిన
ఊపుతో నిధులు పుష్కలంగా వస్తున్న తరుణంలో ఊరుకోక ట్రాక్టర్ కొన్నారు .

. సర్పంచులు లేక వెనక్కి వెళ్లిన కేంద్ర నిధులు…

కెసిఆర్ ప్రభుత్వంలో స్టేట్ ఫైనాన్స్ నిధులు రాక గ్రామపంచాయతీలో సర్పంచులు అనేక ఇబ్బందులు పడ్డారు. ఇక కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక కూడా స్టేట్ ఫైనాన్స్ నిధులు పంచాయతీలకు రాలేదు. మల్టీపర్పస్ పంచాయతీ వర్కర్ల జీతాలు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన నాటి నుంచి ఆగిపోగా, ఇటీవల ఆందోళనలు చేస్తే వారికి ప్రభుత్వం జీతాలు విడుదల చేసింది. ఇదిలా ఉంటే సర్పంచుల పదవీకాలం అయిపోయి ప్రత్యేక అధికారుల పాలన రాష్ట్రవ్యాప్తంగా కొనసాగుతున్న విషయం తెలిసిందే. అయితే కేంద్ర 15వ ఆర్థిక సంఘం నిధులు దాదాపు 1600 కోట్లు పంచాయితీల్లో పాలకవర్గాలు లేకుండా ప్రత్యేక అధికారులతో నడుపుతున్నందున వెనక్కి వెళ్లినట్లు సమాచారం. అంటే 20 నెలల నుంచి స్టేట్ ఫైనాన్స్ నిధులు ఆగిపోవడంతో పాటు కేంద్ర 15వ ఆర్థిక సంఘం నిధులు 1600 కోట్లు వెనక్కి వెళ్లడంతో గ్రామపంచాయతీలో అభివృద్ధి ఒకరకంగా పడకేసిందని చెప్పవచ్చు.ఇటువంటి పరిస్థితుల్లో పంచాయతీ ఎన్నికలకు ప్రభుత్వం సిద్ధం అవుతున్నందున గత అనుభవాలు ఇబ్బంది పెట్టిన అనేకమంది మాజీ సర్పంచులు ఈసారి ఎన్నికల్లో పోటీ చేసేందుకు అంతగా ఆసక్తి చూపడం లేదని కొందరు అంటున్నారు

……. అవార్డులు వచ్చాయి అప్పులు మిగిలాయి…

ఇదిలా ఉంటే కేసీఆర్ హయాంలో ప్రభుత్వం చేసిన మోటివేషన్ తో అనేక గ్రామపంచాయతీల సర్పంచులు తమ శక్తి కొలది అప్పులు చేసి పంచాయతీలను సుందరంగా తీర్చిదిద్దడంతో కేంద్ర స్థాయిలో నిర్వహించిన స్వచ్ఛభారత్ తో సహా అనేక పోటీల్లో అత్యధిక కేంద్ర అవార్డులు తెలంగాణ పంచాయతీలకు ,నగరపాలిక సంస్థలకు వచ్చాయి. కానీ అవార్డులు పొందిన అనేక పంచాయతీ సర్పంచులు అప్పులు పాలయామనే బాధను దిగమింగుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని వాదన అబద్ధం కాదు..
సరే గత అనుభవాలు ఎలా ఉన్నా , సర్పంచ్ పదవినేది గ్రామీణ ప్రాంతాల్లోని రాజకీయ నాయకులకు అదో ముఖ్యమంత్రి పదవితో సమానం. అందుకే ఎన్ని కష్టాలు వచ్చినా , నష్టాలు వచ్చినా పంచాయతీ ఎన్నికలు వస్తున్నాయి అంటే పోటీలో దిగటానికి పోటీ పడుతూనే ఉంటారు. అయితే మొన్నటి పాలనలో కోలుకోలేని దెబ్బలు తిన్న వారు మాత్రం పోటీకి దూరంగా ఉండాలని అనుకుంటున్నట్లు ప్రచారం జరుగుతుంది. మొత్తం మీద గ్రామాల్లో త్వరలో స్థానిక ఎన్నికల సందడి మొదలు కావడం ఖాయం.

About the author

Mohiddin Shaik

Leave a Comment