ప్రధాని మోడీ మాటల్లో ఓటమి భయం కనిపిస్తుందని సిపిఐ జాతీయ కార్యదర్శి కె నారాయణ అన్నారు. అందుకే ఆయన కొన్ని సందర్భాల్లో దిగజారి మాట్లాడుతున్నారని , బిజెపి వ్యతిరేక పార్టీల ముఖ్యమంత్రుల పై చట్టాన్ని ప్రయోగిస్తున్నారని , ఇప్పటికి ఇద్దరు ముఖ్యమంత్రులను జైల్లో పెట్టారని , మూడో ముఖ్యమంత్రి కి నోటీసులు ఇచ్చారని అన్నారు. మూడవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని అరెస్టు చేస్తే బిజెపికి పుట్టగతులు ఉండవని ఆయన పేర్కొన్నారు. సి

సిపిఐ ఖమ్మం పార్లమెంటరీ స్థాయి సమావేశంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగించారు. గురువారం ఆ పార్టీ జాతీయ కమిటీ సభ్యులు భాగం హేమంతరావు అధ్యక్షతన జరిగిన సభలో నారాయణతో పాటు రాష్ట్ర మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనం నేని సాంబశివరావు కాంగ్రెస్ ఖమ్మం పార్లమెంటు అభ్యర్థి రామసహాయం రఘురామిరెడ్డి పాల్గొని ప్రసంగించారు.

సమావేశానికి భారీ సంఖ్యలో హాజరైన కార్యకర్తలను ఉద్దేశించి నారాయణ మాట్లాడుతూ కాంగ్రెస్కు అధికారం ఇస్తే హిందువుల మంగళ సూత్రాలను ముస్లిములకు ఇస్తారంటూ మంగళసూత్రంపై నమ్మకం లేని మోడీ మాట్లాడడం విడ్డూరంగా ఉందన్నారు. మతోన్మాద బిజెపి నిరంకుశ పాలన కు పరాకాష్టగా మారిన టిఆర్ఎస్ ను ఓడించాలని కాంగ్రెస్ అభ్యర్థిని అఖండ మెజారిటీతో గెలిపించాలని ఆయన పిలుపునిచ్చారు.

ఎర్ర జెండాలే నాకు స్ఫూర్తి … మంత్రి తుమ్మల
ఎర్రజెండాల స్ఫూర్తితోనే రాజకీయాలు ప్రారంభించానని ఆ స్ఫూర్తితోనే బడుగు, బలహీన వర్గాల అభివృద్ధికి కృషి చేస్తున్నానని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. కమ్యూనిస్టులతో చెలిమి కొనసాగుతుందని తుమ్మల తెలిపారు. ఖమ్మంజిల్లాలో ఎర్రజెండాల రెప రెపల వెనక అనేక మంది త్యాగాలు ఉన్నాయని బడుగు, బలహీన వర్గాల కోసం ఆస్తులను అమ్మి కమ్యూనిస్టుల నేతల సేవతో పేదల గుండెల్లో ఎర్రజెండా నిలిచిపోయిందని అన్నారు.
ఇండియా కూటమిలో సిపిఐ, సిపిఎంలు కలిసి పని చేస్తున్నాయని ఖమ్మంజిల్లాలో కూటమి ఘన విజయం సాధిస్తుందని, అన్నారు.

పొత్తు పరోక్షం కాదు ప్రత్యక్షమే : మంత్రి పొంగులేటి…
బిజెపితో బిఆర్ఎస్ పొత్తు పరోక్షం కాదు ప్రత్యక్షమేనని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆరోపించారు. కేసిఆర్ మాటలు దీనిని రుజువు చేస్తున్నాయని కేంద్రంలో నామ మంత్రి అవుతారంటే బిజెపితో పొత్తు లేకుండా ఎలా సాధ్యమని పొంగులేటి ప్రశ్నించారు. సిపిఐ పార్లమెంటరీ స్థాయి సదస్సులో ఆయన మాట్లాడుతూ మార్పు కోసం శాసనసభ ఎన్నికల్లో సిపిఐ, కాంగ్రెస్ కలిసి పనిచేసి రాష్ట్రంలో ఇందిరమ్మ రాజ్యాన్ని తెచ్చుకున్నామని అదే రీతిలో కేంద్రంలో ఇందిరమ్మ రాజ్యం కోసం మరోమారు కలిసి పని చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
ఉద్యమ ఖిల్లాలో కూటమికి ఎదురు లేదు : కూనంనేని
ఉమ్యమ ఖిల్లాలో ఇండియా కూటమికి ఎదురు లేదని అపూర్వ విజయాన్ని సొంతం చేసుకుంటుందని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి,
కొత్తగూడెం శాసన సభ్యులు కూనంనేని సాంబశివరావు తెలిపారు. ఖమ్మం జిల్లా అంటే కమ్యూనిస్టుల కంచుకోట అని ఆయన
తెలిపారు. జాతీయ రాజకీయాల దృష్ట్యా కాంగ్రెస్ను బలపరుస్తున్నామని దేశం కోసం కమ్యూనిస్టులు అనేక త్యాగాలు చేశారని
ఈ పొత్తు కూడా త్యాగం లాంటిదేనన్నారు. దేశ ప్రయోజనాల దృష్ట్యా బిజెపిని ఓడించేందుకు కూటమి అభ్యర్థులను
గెలిపించాలన్నారు. కమ్యూనిస్టులకు మోసం, దగా తెలియదని కూనంనేని తెలిపారు.
