ఖమ్మం కాంగ్రెస్ ఎంపీ టికెట్ వ్యవహారం అందరూ ఊహించినట్లే పొంగులేటి చుట్టే తిరుగుతోంది…. ఆయన సోదరుడు ప్రసాద రెడ్డికి ఇస్తారా, లేక ఆయన వియ్యంకుడు రఘురామరెడ్డికి కేటాయిస్తారా అనేది తేలాల్సి ఉంది … బెంగళూరులో జరిగిన టిక్కెట్ కేటాయింపు మీటింగ్ కాస్తంత హాట్ హాట్ గానే జరిగినట్లు తెలుస్తోంది… ముగ్గురు మంత్రులు తమ వారికి కేటాయించాలని ప్రయత్నాలు గట్టిగానే చేశారట…చివరకు టిక్కెట్టు కేటాయింపు వ్యవహారం పొంగులేటి శ్రీనివాసరెడ్డి చుట్టూ తిరుగుతున్నట్టు విశ్వసనీయ సమాచారం…
ఖమ్మం ఎంపీ అభ్యర్థి వ్యవహారం కాంగ్రెస్ పార్టీ దాదాపు సోమవారం సాయంత్రానికి గాని లేదా మంగళవారం తేల్చేస్తుందని ఆ పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. ఈనెల 25 తో నామినేషన్ల స్వీకరణ గడువు ముగిస్తుండడంతో ఇంకా అభ్యర్థి ఎంపిక విషయంలో సాగదీసే అవకాశం లేకపోవడంతో అనేక తర్జనభర్జనల అనంతరం అభ్యర్థి పేరును సోమవారం సాయంత్రం లేదా మంగళవారం ప్రకటించే అవకాశం ఉందని కాంగ్రెస్ వర్గాలు పేర్కొంటున్నాయి. బెంగళూరులో ముగ్గురు మంత్రులతో జాతీయ అధ్యక్షుడు ఎంపీ టికెట్ వ్యవహారంపై సమావేశమైన విషయం తెలిసింది. ఈ సమావేశంలో ముగ్గురు మంత్రులు తమ వారికే సీటు కేటాయించాలని అధ్యక్షుడిని కోరినట్లు సమాచారం.
అయితే ఎవరికి సీటు కేటాయించాలని అంశంపై తుది నిర్ణయం కాంగ్రెస్ అధిష్టానం తీసుకోనుంది. అందరూ ఊహించినట్లే ఖమ్మం కాంగ్రెస్ సీటు రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సోదరుడు ప్రసాద రెడ్డి కి గాని లేదా ఆయన వియ్యంకుడు రామసహాయం రఘురామరెడ్డికి గాని కేటాయించే అవకాశాలు అధికంగా ఉన్నాయని విశ్వసనీయంగా తెలిసింది. వారిద్దరిలోనూ రఘురామిరెడ్డికి కేటాయించేందుకే అత్యధిక అవకాశాలు ఉన్నట్లు కొందరు పేర్కొంటున్నారు.
సహాయం సురేందర్ రెడ్డి తనయుడు రఘురామరెడ్డి కాంగ్రెస్ పార్టీకి అనే ఏక సంవత్సరాలుగా సేవలు చేస్తున్నారు. ఒకపక్క నామినేషన్ల గడువు ముగింపు తేదీ దగ్గర పడుతుండడం నామినేషన్ల తర్వాత కూడా ఎన్నికల ప్రచారానికి ఎంతో సమయం లేకపోవడంతో అభ్యర్థి ఎంపిక జాప్యం కావడంపై కాంగ్రెస్ శ్రేణుల్లో ఉత్కంఠ నేలకొంది. మొత్తం మీద కాంగ్రెస్ అభ్యర్థి ఎంపిక వ్యవహారం ఇక తేలిపోనుంది.
