కోడి పేగులు, కడుపు లోని వ్యర్ధాలు అక్షరాల ఒక కోటి 55 లక్షల 60 వేల రూపాయలకు వేలం లో ఒకరు దక్కించుకున్నారు.. సర్కారు వారి పాట 20 లక్షలతో మొదలై, చివరకు ఒక కోటి 55 లక్షల 60 వేలకు ముగిసింది.. ఇది విన్న వారంతా అమ్మో కోళ్ల వ్యర్థాలకు ఇంత డిమాండ్ ఉందా .. అని ఆశ్చర్యపోతున్నారు…
ఖమ్మం నగరంలోని కార్పొరేషన్ కార్యాలయంలో ఈ వేలం పాట శుక్రవారం జరిగింది.. ఖమ్మం నగర పరిధిలో ప్రతిరోజు వందలాది చికెన్ దుకాణాల ద్వారా చికెన్ వ్యర్ధాలను సదరు వ్యక్తికి సంబంధించిన వారు సేకరించి తీసుకెళ్తారట.. ఒక్క ఖమ్మం నగరంలోని వ్యర్ధాలకి ఇంత ధర పలికితే, మరి హైదరాబాదు మహానగరంలోని చికెన్ వ్యర్ధాలకు ఎన్ని కోట్లు ధర పలుకుతుందో …!అని ప్రజలు
చర్చించుకుంటున్నారు…రాష్ట్రవ్యాప్తంగా 13 మున్సిపల్ కార్పొరేషన్ లు ఉన్నాయి.. వాటిలో హైదరాబాద్ తర్వాత వరంగల్ కార్పొరేషన్ పెద్ద కార్పొరేషన్ గా చెప్పవచ్చు.. ఇవి గాక మున్సిపాలిటీలు కూడా అనేకం ఉన్నాయి.. వీటన్నింటిలో చికెన్ వ్యర్ధాలపై వందల కోట్ల రూపాయల వ్యాపారం జరుగుతోంది .
…. ఇన్ని కోట్లు పెట్టి కొనుగోలు చేసే వ్యర్థాలను ఏం చేస్తారు…!
కొంతమంది చికెన్ వ్యర్ధాలతో వందల కోట్ల రూపాయల వ్యాపారం చేస్తున్నారు. అది ఎలా అంటే రాష్ట్రవ్యాప్తంగా ఉన్న మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు , మండల కేంద్రాలు, పట్టణాల పరిధిలో చికెన్ దుకాణాల నుంచి వ్యర్ధాలను సేకరిస్తారు . వాటిని మన రాష్ట్రంతో పాటు పక్కనే ఉన్న ఆంధ్రప్రదేశ్ వంటి ఇతర రాష్ట్రాలకు కూడా ఎగుమతి చేస్తున్నారు. ఈ వ్యర్థాలను ఆయా రాష్ట్రాల్లో ఉన్న చేపల చెరువుల్లో చేపలకు మేతగా వేస్తున్నారు.
చేపల చెరువుల యజమానులు కొందరు వీటిని కొనుగోలు చేసి తమ చేపల చెరువుల్లో వినియోగిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. దీనివల్ల ఆయా చేపలను తింటున్న ప్రజల ఆరోగ్యాల పై కూడా ప్రభావం ఉంటుందని ప్రచారం ఉంది. అందుకే అనేక చోట్ల చేపల చెరువుల్లో చికెన్ వ్యర్ధాలను వేయడంపై నిషేధం కూడా విధించిన విషయం తెలిసిందే.. అయినా,
ఈ చికెన్ వ్యర్ధాల వ్యాపారం వందల కోట్లలో జరుగుతోంది. తెలంగాణ రాష్ట్రంలో 33 జిల్లాలు , 74 రెవెన్యూ డివిజన్లు, 33 కార్పొరేషన్లు, 141 పట్టణాలు ఉన్నాయి. వీటి పరిధిలో ఈ వ్యర్ధాల వ్యాపారం జోరుగా సాగుతోంది. ఖమ్మం కార్పొరేషన్ పరిధిలో ఒక కోటి 55 లక్షల 60 వేలకు వ్యర్ధాలను జోగులాంబ జిల్లా గద్వాలకు చెందిన , బాలరాజు అనే వ్యక్తి దక్కించుకున్నారు
