తెలంగాణ ఉద్యమంలో ప్రాణత్యాగాలకు వెనకాడని ఉస్మానియా విద్యార్థులు కేసీఆర్ను వ్యతిరేకిస్తున్నారని సిపిఐ జాతీయ కార్యదర్శి అన్నారు. దమ్ముంటే కేసీఆర్ ఉస్మానియా యూనివర్సిటీలో మీటింగ్ పెట్టగలరా అని సవాల్ విసిరారు.
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ జాతీయ నాయకురాలు ప్రియాంక గాంధీ పాల్గొనే రోడ్ షోలలో ఆమెతో కలిసి పాల్గొని ప్రచారం చేసేందుకు తాను, సిపిఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి రాజా ఇద్దరు వచ్చినట్లు చెప్పారు. ఉద్యమ ఆకాంక్షలు నెరవేరకపోవడంతో కెసిఆర్ కు ఉస్మానియాలోని విద్యార్థులంతా వ్యతిరేకిస్తున్నారని అన్నారు.శుక్రవారం ఆయన ఖమ్మం సిపిఐ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో మాట్లాడారు.
మొన్నటివరకు కర్ణాటకలో అధికారంలో ఉన్న బిజెపి ప్రభుత్వం కాంట్రాక్టర్ల వద్ద 40 శాతం కమిషన్లు తీసుకుంటే , ప్రస్తుత తెలంగాణ ప్రభుత్వం 50 శాతం కమిషన్లు తీసుకుంటుందని ఆరోపించారు. ఫలితంగానే కాలేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం నాసిరకంగా మారిందని, కాంగ్రెస్ హయాంలో నిర్మించిన భారీ ప్రాజెక్టులు నాగర్జున సాగరు , శ్రీశైలం వంటి పెద్ద ప్రాజెక్టులు ఇంతవరకు దెబ్బతినలేదని అన్నారు . మేడిగడ్డ ప్రాజెక్టు మాత్రం పునాదులు కృంగిపోయాయని పేర్కొన్నారు.
… బిజెపికి బిఆర్ఎస్ బీ టీంగా పనిచేస్తుంది…
చెప్పు చేతల్లోనే టిఆర్ఎస్ పని చేస్తుందని అన్నారు. అదేవిధంగా ఎంఐఎం కూడా బిజెపితో లోపాయికారి ఒప్పందాలు కలిగి ఉందని ఆరోపించారు. దానికి ఉదాహరణ చెబుతూ గోషామహల్ నియోజకవర్గంలో బిజెపి అభ్యర్థి రాజాసింగ్ పోటీ చేస్తుండగా ఎంఐఎం అక్కడ అభ్యర్థిని నిలబెట్టలేదు, కానీ కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న అజరుద్దీన్ పై ఎంఐఎం అభ్యర్థిని నిలబెట్టిందని ఆయన పేర్కొన్నారు. అందుకే ఈ ఎన్నికల్లో కాంగ్రెస్కు ఓటు వేయడం ద్వారా ఆ మూడు పార్టీలను ఓడించినట్లు అవుతుందని ఆయన అన్నారు.
కెసిఆర్ సర్కారు అహంభావం ప్రదర్శించిందని, ప్రజలు అవినీతినైనా భరిస్తారు కానీ, అహంభావాన్ని భరించరని నారాయణ పేర్కొన్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ అభ్యర్థులను , కాంగ్రెస్ బలపరుస్తున్న సిపిఐ అభ్యర్థిని గెలిపించాలని ఆయన పిలుపునిచ్చారు.
జాతీయస్థాయిలో ఏర్పడిన ఇండియా కూటమిలో తాము భాగస్వాములుగా ఉన్నామని, దానికి అనుగుణంగానే రాష్ట్రంలో కూడా కాంగ్రెస్తో కలిసి ప్రయాణం చేయాలని ఉద్దేశంతో ఒక్క సీటు కైనా ఒప్పుకున్నామని నారాయణ పేర్కొన్నారు.పాత్రికేయుల సమావేశంలో సిపిఐ జిల్లా కార్యదర్శి పోటు ప్రసాద్ జిల్లా నాయకులు దండి సురేష్ ,నగర కార్యదర్శి జానీ మియా, జిల్లా కార్యవర్గ సభ్యులు జమ్ముల జితేందర్ రెడ్డి పాల్గొన్నారు .
