ముఖ్యమంత్రితో సహా రాష్ట్ర రాజకీయ వర్గాలను ఆకర్షిస్తున్న ఖమ్మం నియోజకవర్గ ఎన్నికల పర్వంలో అటు కాంగ్రెస్లోకి ఇటుఆర్ఎస్ లోకి చేరికలు జరుగుతున్నాయి…
కాంగ్రెస్ పక్షాన మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు రంగంలో ఉండడంతో గతంలో కాంగ్రెస్ నుంచి విఆర్ఎస్ లో చేరిన అనేకమంది తిరిగి మళ్ళీ కాంగ్రెస్ లో తుమ్మల సమక్షంలో చేరుతున్న విషయం తెలిసిందే. అయితే ఇతర పార్టీల నుంచి అనేకమంది పువ్వాడ అజయ్ కుమార్ సమక్షంలో విఆర్ఎస్ పార్టీలో కూడా చేరికలు జరుగుతూనే ఉన్నాయి.

ఇది ఇలా ఉంటే శుక్రవారం సిపిఎం ఖమ్మం హవేలీ కమిటీ కార్యదర్శిగా పనిచేసే దాదాపు 30 ఏళ్ల రాజకీయ అనుభవం కలిగిన కోదాటి గిరి పువ్వాడ అజయ్ కుమార్ సమక్షంలో బి ఆర్ ఎస్ లో చేరారు. గిరి చేరికతో బి ఆర్ ఎస్ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం కనిపిస్తోంది.
రాజకీయంగా చూసినప్పుడు ఆయన పెద్ద నాయకుడు అనిపించక పోయినప్పటికీ ఎన్నికల నిర్వహణలో ఓట్లు పోల్ చేయించడం దగ్గర నుంచి అనేక మేలుకోలు తెలిసిన కమ్యూనిస్టు పార్టీ నాయకుడు ఈ సందర్భంలో బిఆర్ఎస్ లో చేరడం ఆ పార్టీకి కచ్చితంగా మేలు చేస్తుందని పరిశీలకులు అంటున్నారు. సాధారణ కార్యకర్తలు ఇతర పార్టీల్లో అంతగా జనంలో పట్టులేని నాయకులు అనేకమంది అటు ఇటు చేరుతున్నప్పటికీ, ఇటువంటి ప్రజా సంబంధాలు కలిగిన ఒక నిబద్దతతో పనిచేసే స్వభావం కలిగిన నాయకులు ప్రస్తుత తరుణంలో టిఆర్ఎస్ లో చేరడం ఆ పార్టీకి కచ్చితంగా మేలు చేస్తుందని పలువురు విశ్లేషిస్తున్నారు.
అదే విధంగా ఆయనతో పాటు మరికొంతమంది కార్యకర్తలు కూడా ఆ పార్టీలో చేరారు. ఇదిలా ఉంటే గిరి చేరిక తర్వాత జరిగిన ప్రచార కార్యక్రమాల్లో రోడ్ షోలో మంత్రి అజయ్ కుమార్ మాట్లాడుతూ సిపిఎం నాయకుడు తమ పార్టీలో చేరడం సంతోషకరమని తమ విజయానికి శుభసూచకమని పేర్కొన్నారు.
అదేవిధంగా కమ్యూనిస్టు పార్టీలోని మరికొంతమంది పరోక్షంగా తన విజయానికి సహకరిస్తారని ఆశాభావాన్ని ఆయన బహిరంగంగా వ్యక్తం చేయటం కూడా రాజకీయంగా ఖమ్మంలో చర్చనీయాంశమైంది. నిన్న మొన్నటి వరకు కొంతమంది ముస్లిం మైనారిటీ వర్గాల్లో కొంత అసంతృప్తి ఉన్నట్లు ప్రచారం జరగగా హోం మంత్రి మహమూద్ అలీ పర్యటన తర్వాత అలాంటి వారిలోనూ ఉత్సాహం కనిపించినట్లు ఆయన సభకు పెద్ద సంఖ్యలో హాజరైన ముస్లిం మైనారిటీలను బట్టి తెలుస్తోంది.
మొత్తం మీద సిపిఎం అభ్యర్థిగా ఎర్ర శ్రీకాంత్ ఖమ్మం అసెంబ్లీ నుంచి రంగంలో ఉన్నప్పటికీ ఆ పార్టీకి చెందిన సీనియర్ నాయకుడు విఆర్ఎస్ లో చేరడం, మారుతున్న రాజకీయ సమీకరణలకు నిదర్శనమని పలువురు విశ్లేషిస్తున్నారు. ఖమ్మంలో ఇటు పువ్వాడ అజయ్ కుమార్ అటు తుమ్మల నాగేశ్వరరావు మధ్య పోటీ ప్రతిష్టాత్మకంగా మారింది ఇరు పార్టీలు కూడా పోటాపోటీగా ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి.
