ఓట్ల పండగ రాకముందే ఓటర్ అన్న ప్రసన్నం కోసం రాజకీయ నేతలు పడే పాట్లు చూస్తుంటే భలే గమ్మత్తుగా అనిపిస్తుంది… తెలంగాణలో ఓట్ల పండగ రానే వచ్చింది. ఇక్కడ ఓట్ల కోసం నేతల పాట్లు వర్ణనాతీతం.. ఓటు కోసం నోట్లు ఇవ్వడం, పండగలకు మేకలనివ్వడం, ప్రతిరోజు వారిని కలుసుకొని రెండు చేతులు జోడించి వినయంగా మొక్కడం… ఇవన్నీ ప్రతిరోజు మహామహుల అనుకునే నాయకులు పడుతున్న పాట్లు… వచ్చే నెలలోనే ఎన్నికలు ఉండడంతో ఇది తెలంగాణ ముచ్చట…
కానీ ఆంధ్రాలో ఎన్నికలు ఇప్పుడే లేవు, దాదాపు ఇంకా ఐదు, ఆరు నెలలు సమయం ఉంది.. అయినా, అక్కడి కొందరు నాయకులు అప్పుడే ఓటర్ అన్నను ప్రసన్నం చేసుకోవడానికి వెరైటీ పద్ధతిలో ప్రయత్నాలు మొదలుపెట్టారు… దసరా పండుగ సందర్భంగా, ఒక నాయకుడు ఒక వెరైటీ స్కీమ్ ఏర్పాటు చేసి ప్రతి కుటుంబానికి ఒక కోడిపెట్ట , ఒక క్వార్టర్ మందు బాటిల్ చేతికి ఇచ్చి, దసరా శుభాకాంక్షలు చెబుతున్నారు… ఈ కొత్త స్కీము అమలు చేసే నాయకుడు ఏ పార్టీ వారు తెలిసేందుకు కోడిపెట్టను ఇచ్చే నాయకుడు మెడలో ఓ కండువా వేసుకున్నారు…
పండగ పూట మందు కోసం తంతాలు పడే కొన్నికుటుంబాలకు వేసుకోవడానికి క్వార్టర్ బాటిల్ , మొక్క కొరకడానికి ఓ కోడిపెట్టను ఇస్తే ఇక ఆ ఇంట్లో పండగ సంబరానికి కొదవ ఏముంటుంది …! ఈ సంతోషం వచ్చే ఎన్నికల దాకా ఓటర్ అన్నకు గుర్తుంటుందో లేదో కానీ… కోడినిచ్చిన నాయకుడికి మాత్రం అందరికంటే మనమే ముందు ఇచ్చామనే సంతృప్తి ఉంటుంది .. ఉచితంగా కోడికూర, మత్తులో జోగేందుకు మందు దొరికినందుకు ఆ కుటుంబాలకు కూడా సంతోషం కలుగుతుంది. ఆంధ్రాలో కోడిపెట్ట , మందు బాటిల్ పంపిణీ చేసే స్కీమును , ఎవరో వీడియో తీసి చక్కగా సోషల్ మీడియాలో పెట్టారు.ఆ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది… ఎన్నికల సందర్భంలో ఓటర్లకు రాజభోగాలు అనుభవించే అవకాశం రావడం సహజమే… ఈ ఎన్నికలు కనీసం ఏడాదికి ఒకసారి వస్తే ఎంత బాగుండునో అని ఈ కోడిపెట్ట స్కీమును చూసిన అనేకమంది అనుకుంటున్నారు…
