కాంగ్రెస్ పార్టీ వామపక్ష పార్టీలకు సీట్లు కేటాయింపు విషయంలో జాప్యం చేస్తుండడం పై ఆయా పార్టీల్లో అసంతృప్తి వ్యక్తం అవుతోంది. ప్రధానంగా సిపిఎం పార్టీ తమకు వైరా నియోజకవర్గాన్ని కేటాయించడంపై , అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నట్లు కనిపిస్తోంది. ఆ పార్టీ ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని పాలేరు నియోజకవర్గాన్ని తమకు కేటాయించాలని మొదటి నుంచి కాంగ్రెస్ను కోరుతుండగా , పాలేరు గాకుండా వైరా నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని కాంగ్రెస్ అధిష్టానం సూచించినట్లు సమాచారం. మిర్యాలగూడెం స్థానం నుంచి ఆ తరువాత వైరా నుంచి పోటీ చేయాలని కాంగ్రెస్ సూచించినట్లు తెలుస్తోంది. దీంతో ఆ పార్టీ వైరా తమకు వద్దని పాలేరు కావాలని పట్టుబడుతున్నట్లు సమాచారం. పాలేరు నియోజకవర్గం నుంచి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పోటీ చేసేందుకు కాంగ్రెస్ అధిష్టానం ఇప్పటికే లైన్ క్లియర్ చేసింది . ఆ నియోజకవర్గంలో పొంగులేటి విస్తృతంగా ఎన్నికల ప్రచారం కూడా నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ తరుణంలో వైరా వైరా నియోజకవర్గం తమకు వద్దని సిపిఎం ఒకపక్క అంటుండగా మరోపక్క వైరా నుంచి కాంగ్రెస్ అభ్యర్థి రంగంలో ఉంటారని, ఆ అభ్యర్థిని గెలిపించాలని, ప్రచార కో కన్వీనర్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి వ్యాఖ్యానించారు. మంగళవారం చేసిన వ్యాఖ్యల పై రాజకీయ వర్గాల్లో విస్తృతంగా చర్చ జరుగుతుంది. పాలేరు నియోజకవర్గం కేటాయించకుండా సిపిఎం పార్టీకి వైరా కేటాయించడం పట్ల ఆ పార్టీ వ్యతిరేకిస్తున్న తరుణంలో, పొంగులేటి కాంగ్రెస్ అభ్యర్థి పోటీ చేస్తారని ప్రకటించడం పై చర్చ జరుగుతోంది.
అంటే కాంగ్రెస్ పాలేరులో పోటీ చేసే అవకాశం ఇవ్వదు, వైరాలో పోటీ చేసేందుకు సిపిఎం వర్గాలు అంగీకరించడం లేదు. ఈ నేపథ్యంలో మరి సిపిఎం ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఒక్క స్థానం కూడా తమకు కేటాయించకుండా వేరే జిల్లాలోనే రెండు స్థానాలు కేటాయిస్తే పోటీ చేస్తుందా.., లేక దీనిపై ఇంకా స్పష్టత రావడానికి మరింత లోతుగా కాంగ్రెస్ అధిష్టానం చర్చిస్తుందా, అనేది ఇప్పుడు ఆసక్తిగా మారింది..
సీట్ల కేటాయింపు విషయంలో ఇటు సిపిఎం అటు కాంగ్రెస్ మధ్య ఒక స్పష్టమైన అవగాహనతో ప్రకటన వస్తేనే ఎన్నికల పొత్తుపై స్పష్టత వస్తుందని కొందరు అంటున్నారు.. లేకుంటే సీట్ల కేటాయింపు విషయంలో సిపిఎం తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్న సందర్భంలో దీని ప్రభావం పొత్తులపై పడుతుందా, అనే అనుమానాలు కూడా కొంతమంది పరిశీలకులు వ్యక్తం చేస్తున్నారు. ఈనెల 26న దీనిపై స్పష్టత వస్తుందని కామ్రేడ్లు భావిస్తున్నారు.
….. ఈనెల 26న కామ్రేడ్ల సీట్ల కేటాయింపు పై స్పష్టత రానుంది..

రాష్ట్రవ్యాప్తంగా సిపిఐ సిపిఎం పార్టీలకు ఏ ఏ స్థానాలు కేటాయించారు అనే అంశంపై ఈనెల 26న స్పష్టత రానుంది. సిపిఐ కి కేటాయించిన రెండు స్థానాల విషయంలో కొత్తగూడెం నుంచి ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి మాజీ ఎమ్మెల్యే సాంబశివరావు రంగంలోకి దిగుతున్నట్లు ఇప్పటికే సంకేతాలు వచ్చాయి. చెన్నూరు నుంచి సిపిఐ రెండవ స్థానంగా పోటీ చేయబోతున్నట్లు ప్రచారం జరుగుతుంది సీట్ల కేటాయింపు విషయంలో సిపిఐ కి కూడా తాను కోరుకోని చెన్నూరు నియోజకవర్గాన్ని కాంగ్రెస్ కేటాయించింది.అయినప్పటికీ సీట్ల విషయంలో సిపిఐ కి కాంగ్రెస్తో పెద్దగా తేడా లేదు కానీ సిపిఎం పార్టీకి సీట్ల కేటాయింపు విషయంలోనే స్పష్టత రావాల్సి ఉంది… ఇదిలా ఉండగా సిపిఐ ఈనెల 27వ తేదీ నుంచి అన్ని నియోజకవర్గాల్లో ఎన్నికల యుద్ధానికి సన్నాహం చేసేందుకు కార్యకర్తలతో సమావేశాలు నిర్వహించేందుకు నిర్ణయం తీసుకుంది. అంటే ఇక ఎన్నికల యుద్ధానికి సిపిఐ శంఖం పూరెంచినట్టే లెక్క. సిపిఎం విషయంలో కూడా మిర్యాలగూడ స్థానం నుంచి దాదాపు సిపిఎం పోటీ చేసేందుకు సంసిద్ధంగా ఉన్నప్పటికీ ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కేటాయించి స్థానం పైనే స్పష్టత రావాల్సి ఉంది.
