ఆంధ్రప్రదేశ్ జాతీయం తెలంగాణ రాజకీయం

ఎన్నికలపై మంత్రి ముందస్తు వ్యూహం!ఆ వ్యూహంతోనే ధీమాతో కనిపిస్తున్న అజయ్ కుమార్..!ఖమ్మం పై పట్టు కోసం తుమ్మల బలమైన అడుగులు..

Written by Mohiddin Shaik

మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ తాను అమలు చేస్తున్న ముందస్తు వ్యూహం తనను గెలుపు తీరాలకు చేర్చుతుందని బలంగా నమ్ముతున్నట్లు కనిపిస్తోంది. అభివృద్ధి మంత్రమే తన విజయానికి తారక మంత్రంగా ఆయన భావిస్తున్నారు. అదే సందర్భంలో కాంగ్రెస్ అభ్యర్థిగా రంగంలోకి దిగుతున్న మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కూడా ఖమ్మం నియోజకవర్గం పై పట్టు బిగించేందుకు శక్తి వంచన లేకుండా ప్రయత్నం చేస్తున్నారు. సత్తుపల్లి నియోజకవర్గం తో పాటుగా ఉమ్మడి జిల్లాలోని తుమ్మల అనుయాయులు , అభిమానులు అందరూ ఖమ్మం లో మకాం వేసి తుమ్మల గెలుపు కోసం ఉన్న ఏ చిన్న అవకాశాన్ని కూడా విడిచి పెట్టకుండా , తమ ప్రయత్నాలను ముమ్మరం చేస్తున్నారు. 10 ఏళ్ల పాటు అధికారంలో ఉన్న పార్టీ పట్ల సహజంగానే ఎంతోకొంత వ్యతిరేకత ఉంటుంది. అటువంటి వ్యతిరేకత ఉన్న వర్గాలను గుర్తించి వారిని తమ వైపు ఆకర్షించే ప్రయత్నాలను తుమ్మల వర్గం ముమ్మరంగా చేస్తుంది

కొందరు బి ఆర్ ఎస్ కార్పొరేటర్లు తుమ్మల సమక్షంలో కాంగ్రెస్లో చేరడం, అదే సందర్భంలో రఘునాధపాలెం మండల ఎంపీపీ, మాజీ సర్పంచ్ తదితరులు కాంగ్రెస్లో చేరడం, తుమ్మల శిబిరంలో కొంత ఊపును తెచ్చింది అనే ప్రచారం జరుగుతోంది. కాంగ్రెస్ కి సహజసిద్ధంగా ఉన్నటువంటి ఓటు బ్యాంకుతోపాటు బీఆర్ఎస్ నుంచి సాధ్యమైనంత వరకు ఓట్లను తమ వైపు తిప్పుకునేందుకు ఇటు తుమ్మల నాగేశ్వరరావు, అటు మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి వ్యూహరచన చేసి ముందుకెళుతున్నారు .

…… అభివృద్ధి మంత్రం అజయ్ గెలుపుకు తారక మంత్రం….

ఇదిలా ఉంటే మంత్రి అజయ్ కుమార్ ఈ ఎన్నికల యుద్ధానికి ముందస్తు వ్యూహంతో సమగ్రమైన అవగాహన, ప్రణాళికతో ముందుకెళుతున్నారు. అది ఏమంటే దాదాపు ఆరు నెలల ముందు నుంచే పువ్వాడ గ్రామీణ ప్రాంతంలో యువకులతో ప్రత్యేకమైన కమిటీలు ఏర్పాటు చేసినట్లు సమాచారం. ఆయా యువకులు గ్రామాల్లోని ప్రతి ఇంటికి వెళ్లి ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలు తమకు అందుతున్నాయా ,లేవా, అనే విషయాలను అడిగి తెలుసుకోవడంతో పాటు ప్రభుత్వం వచ్చాక జరిగిన అభివృద్ధి , ప్రధానం గా ఖమ్మం నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధిపై ప్రజలకు సమగ్రంగా వివరించే ప్రయత్నం చేస్తున్నారు. అదే సందర్భంలో ప్రభుత్వ సంక్షేమ ఫలాలు ప్రజలకు మంత్రి అజయ్ స్వయంగా వారి ఇండ్లకు వెళ్లి అందించిన , అందిస్తున్న తీరును కూడా ఆయా కమిటీల సభ్యులు ప్రజలకు స్వయంగా వివరిస్తున్నారు. ఈ ప్రక్రియ 6 నెలల నుంచి చాప కింద నీరులా ఖమ్మం నియోజకవర్గం మొత్తం జరుగుతున్నట్లు తెలుస్తోంది. ప్రధానంగా గ్రామ పంచాయతీల పరిధిలో ఈ రకమైన కార్యాచరణ కొనసాగుతున్నట్లు సమాచారం. ఆయా కమిటీలు ప్రభుత్వ అభివృద్ధిని వివరించడంతోపాటు ఎక్కడైనా ప్రజలకు ఏవైనా సమస్యలు ఉన్నాయా, ఎక్కడైనా కొన్ని కుటుంబాలు ఏదైనా అంశంలో అసంతృప్తితో ఉన్నారా, అనే విషయాలను సమగ్రంగా తెలుసుకొని ఆ నివేదికను మంత్రికి, అందజేసినట్లు తెలుస్తోంది. అలా ఇవ్వడం ద్వారా వాటి పరిష్కారానికి కూడా వెంటవెంటనే ప్రయత్నాలు జరుగుతున్నట్లు కూడా ప్రచారం జరుగుతుంది. ఎక్కడైనా ప్రజల సమస్యలు మంత్రి దృష్టికి వచ్చినప్పుడు ఆయన వాటిని పరిష్కారం చేయడం ద్వారా అసంతృప్తితో ఉన్న అటువంటి కుటుంబా లో కూడా ఆయన అభిమానాన్ని పొందే ప్రయత్నం చేశారని ప్రచారం ఆ పార్టీ వర్గాల్లో జరుగుతోంది. ఈ విధమైన ముందస్తు కార్యాచరణ చాప కింద నీరులా విస్తృతంగా జరగడం ఒక విధంగా క్షేత్రస్థాయికి ఇప్పటికే ఎన్నికల ప్రచారంలో మంత్రి అజయ్ కుమార్ ముందంజలో ఉన్నారని అభిప్రాయాలు కొందరు వ్యక్తం చేస్తున్నారు. ఇక అజయ్ కుమార్ కూడా ప్రభుత్వం చేసిన అభివృద్ధి ప్రజలకు అందిస్తున్న సంక్షేమం , షాదీ ముబారక్ , కళ్యాణ లక్ష్మి ఆరోగ్యపరమైన విషయాలలో సీఎంఆర్ చెక్కుల పంపిణీతో, సహా అనేక పథకాలు పింఛన్లతో సహా అవన్నీ తన విజయానికి సోపానాలుగా నిలుస్తాయని ఆయన బలంగా నమ్ముతున్నారు. గెలుపు పై ధీమా వ్యక్తం చేస్తున్నారు.

…..కక్ష సాధించే వ్యక్తిగా ముద్ర వేసే విధంగా తుమ్మల ఎన్నికల ప్రచారం..

మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మంత్రి అజయ్ కుమార్ ను తన వ్యతిరేకులపై కక్ష సాధించే వ్యక్తిగా ముద్ర వేసే విధంగా ఒక కొత్త నినాదంతో ప్రజల్లోకి వెళుతున్నారని కొందరు వ్యాఖ్యానిస్తున్నారు. అదేమిటంటే ఖమ్మం ప్రజలు నిర్భయంగా జీవించాలి , మీకు ఎటువంటి భయము అక్కర్లేదు నేను మీతో ఉంటాను అంటూ తాను వెళ్లిన ప్రతి చోట ఈ నినాదాన్ని ప్రధానంగా వినిపిస్తున్నారు. అంటే ప్రస్తుతం ఖమ్మం ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారని అభిప్రాయాన్ని తుమ్మల పరోక్షంగా వ్యక్తం చేస్తున్నట్లు భావించాలి. మంత్రి అజయ్ కుమార్ విపక్ష పార్టీల కార్యకర్తలను అక్రమ కేసులు పెట్టి ఇబ్బందులు పెట్టారని ప్రచారాన్ని చేస్తూ , సాధారణ ప్రజల్లోనూ ఇదే నినాదాన్ని వినిపిస్తూ, తుమ్మల ఎన్నికల ప్రచారం చేస్తున్నారు. ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ప్రధాన రాజకీయ పక్షాలు పరస్పరం విమర్శలు, ఆరోపణలు, ప్రతి ఆరోపణలు, వ్యూహాలు, ఎత్తులు వేయడం అత్యంత సహజం. అయితే ఏ పార్టీ సిద్ధాంతాలు ఏమిటి, ఎవరు ఏ రకమైన అభివృద్ధి చేశారు, ఎవరు ఏ రకమైన స్వభావం కలిగిన వారు అనే విషయాలపై ప్రజలకు కచ్చితంగా ఒక అభిప్రాయం ఉంటుంది. అంతిమంగా వారే న్యాయ నిర్నేతలు. ఎవరిని గెలిపించాలో వారి నిర్ణయించాలి.

About the author

Mohiddin Shaik

Leave a Comment