ఆంధ్రప్రదేశ్ జాతీయం తెలంగాణ రాజకీయం

సత్తుపల్లి కారు పార్టీకి తుమ్మలగండం…!మట్ట దయానందుకు హస్తం టికెట్ వస్తే హోరాహోరీ ..సత్తుపల్లి పై రాజకీయ వర్గాల్లో విస్తృత చర్చ

Written by Mohiddin Shaik

సత్తుపల్లి నియోజకవర్గంలో కారు పార్టీకి మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గండం పొంచిఉన్న సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయని పరిశీలకులు అంటున్నారు.. ఉమ్మడి ఖమ్మం జిల్లా రాజకీయాలను బలంగా ప్రభావితం చేయగలిగిన ఇద్దరు నాయకులు మాజీ మంత్రి ,మాజీ ఎంపీ కారు పార్టీని వీడి కాంగ్రెస్లో చేరడం, ఆ ఇద్దరు నేతలు సత్తుపల్లి ప్రాంతానికి చెందినవారు కావడం, అక్కడ కారు పార్టీకి పెద్ద ముప్పుగా మారవచ్చని పలువురు విశ్లేషిస్తున్నారు. అటు తుమ్మల , ఇటు పొంగులేటి శ్రీనివాసరెడ్డి కి చెందిన , క్యాడర్ కారు పార్టీని ఓడించడానికి ఇప్పటినుంచే సిద్ధమవుతున్నట్లు ప్రచారం జరుగుతోంది.

…. తుమ్మల అచ్చంగా రాజకీయ నాయకుడు…

మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఎటువంటి వ్యాపారాలు లేకుండా అచ్చంగా రాజకీయాలు మాత్రమే చేసే నాయకుడు. ఆయన రాజకీయ జీవితంలో అత్యధిక కాలం వివిధ శాఖలకు మంత్రి గానే పనిచేశారు. అందుకే ఆయన వ్యవహార శైలి కూడా ప్రత్యేకమైని చెప్పాలి. ఆయన గులాబీ పార్టీ నుంచి కాంగ్రెస్లో చేరినప్పటికీ పూర్వపు పార్టీని గానీ, ఆ పార్టీ అధినేత పై గానీ అనుచిత వ్యాఖ్యలు చేయలేదు. అంతమాత్రాన ఆయన పూర్తిగా సాధుస్వభావుడని,రాజకీయ వ్యూహాలు తెలియనివాడని అనుకోవాల్సిన అవసరం లేదంటున్నారు కొందరు. మంత్రి కేటీఆర్ సత్తుపల్లి సభలో తుమ్మలపై వ్యంగ్యాస్త్రాలు సంధించగానే తుమ్మల అనుచరులు అభిమానులు శరవేగంతో స్పందించారు. సత్తుపల్లిలో ఆగ మేఘాల మీద సమావేశమై 500 మందికి పైగా కారు పార్టీకి రాజీనామాలు సమర్పించి జై తుమ్మల జై కాంగ్రెస్ అంటూ ముక్త కంఠంతో నినదించారు. ఈ పరిణామం సత్తుపల్లి కారు పార్టీకి ముమ్మాటికి ఇబ్బంది కరమైనది అని పరిశీలకులు అంటున్నారు.

… తెలుగుదేశంలోని అనేకమంది తుమ్మలతోనే ఉన్నారా..!

ఇది ఇలా ఉంటే చంద్రబాబు నాయుడు అరెస్టు కూడా సత్తుపల్లి కారు పార్టీపై ప్రభావం చూపిస్తుందని కొందరు విశ్లేషిస్తున్నారు. కారణమేమంటే సత్తుపల్లి నియోజకవర్గంలో పాటు అశ్వరావుపేట ప్రాంతాల్లో ఉన్న తెలుగుదేశం కార్యకర్తలు అనేకమంది తుమ్మల కు వచ్చే ఎన్నికల్లో అండగా నిలబడతారని ప్రచారం జరుగుతోంది. . చంద్రబాబు అరెస్టుపై హైదరాబాదులో జరుగుతున్న ఆందోళనలను ఉద్దేశించి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు కూడా ఈ ప్రాంత తెలుగుదేశం కార్యకర్తలపై ప్రభావం చూపుతున్నాయని కొందరు పేర్కొంటున్నారు. అందుకే సత్తుపల్లి ఎన్నికలపై తుమ్మల ప్రభావం బలంగా ఉంటుందని కొందరు పేర్కొంటున్నారు. ఇటు తుమ్మల అటు పొంగులేటి ఇద్దరు బలమైన కేడర్ కలిగిన నాయకులు శత్రు శిబిరంలో ఉన్నప్పుడు సహజంగానే కారు పార్టీ గెలవాలంటే అసాధారణమైన బలం కావాల్సి ఉంటుందని కొందరు విశ్లేషిస్తున్నారు.

….. మట్ట దయానందుకు హస్తం టికెట్ వస్తే హోరా హోరి…

సత్తుపల్లి అసెంబ్లీ నుంచి పోటీ చేసేందుకు మట్టా దయానందుకు కానీ ఆయన సతీమణి రాగమయికి కానీ హస్తం పార్టీ టికెట్ ఇస్తే సత్తుపల్లిలో ఎన్నికల యుద్ధం హోరా హోరీగా ఉంటుందని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. మారిన రాజకీయ సమీకరణల నేపథ్యంలో అభివృద్ధి మంత్రంతో ఎన్నికల బరిలో గిరి గీసి నిలువ బోతున్న కారు పార్టీ అభ్యర్థి విజయం సాధిస్తారా, వేచి చూడాల్సిందే..

About the author

Mohiddin Shaik

Leave a Comment