ఎన్నికల సమయంలో రాజకీయ పార్టీలు విడుదల చేసే మేనిఫెస్టోలో నిజంగానే అద్భుతాలు సృష్టించే వాగ్దానాలు , హామీలు, ఉంటాయి… వాటిని చూసినప్పుడు, విన్నప్పుడు ప్రజలకు స్వర్గంలో తేలినట్లు అనిపిస్తుంది.. ఒక్కో పార్టీది , ఒక్కో విధానం… విధానాలు వేరైనా వాటి మేనిఫెస్టోల్లోని విషయాలు మాత్రం ఓటర్లను అమాంతం ఆకట్టుకునే విధంగానే ఉంటాయి… అధికారంలోకి వచ్చాక వాటిని అమలు చేసే విషయంలోనే ఆయా పార్టీల పనితీరు బయటపడుతుంది… చాలా సందర్భాల్లో ఓటర్లు మోసపోవడమే జరిగింది… ఇప్పుడు మళ్లీ సీజన్ వచ్చింది.

కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో నీ హైలెట్ పథకాల, వాగ్దానాల ,జాబితా ఇప్పటికే గ్యారంటీ కార్డు రూపంలో బయటికి వచ్చింది. ఆ కార్డును ఇచ్చిన హామీలు, పథకాలకు సంబంధించి రంగుల బొమ్మలతో అందంగా ముద్రించి ప్రజల చేతుల్లో కాంగ్రెస్ నేతలు పెడుతున్నారు. ఇకత్వరలో స్వయంగా గులాబీ బాస్ కెసిఆర్ ఆలోచనలతో రూపొందించిన, కారు పార్టీ మేనిఫెస్టో కూడా ప్రజల ముందుకు రాబోతోంది… ఇప్పటికే గ్యారెంటీ కార్డుతో మురిసిపోతున్న ఓటర్ అన్నకు , కారు పార్టీ మేనిఫెస్టోలోని అద్భుతాలను కూడా చూసి మరింత మురిసిపోవాల్సి ఉంది.. ఒక చేత్తో గులాబి అద్భుతమైన మేనిఫెస్టో , మరో చేత్తో సోనియమ్మ ఇచ్చిన గ్యారంటీ కార్డు పట్టుకొని , వాటిలోని అద్భుతాలను చూసి ఇన్ని ప్రయోజనాలు నేనేమి చేసుకోవాలి రా దేవుడా…అంటూ ఇక జుట్టు పీక్కోవడం నీ వంతు…
…..ఫ్లోరైడ్ విముక్తి కలిగించకపోతే నన్ను రాళ్లతో కొట్టండి….కేసీఆర్..

వాగ్దానాలు చేస్తే ఓట్లు రాలతాయని రాజకీయ పార్టీలన్నీ ఆశిస్తాయి. 2014 ఎన్నికల తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ నల్గొండ జిల్లా ఫ్లోరైడ్ పీడిత ప్రాంతాలకు వెళ్లారు. అది ఎన్నికల వాగ్దానం కూడా కాదు ఆ ప్రాంత ప్రజలు ఫ్లోరైడ్ వల్ల పడుతున్న ఇబ్బందులు చూసి మీ అందరికీ ఫ్లోరైడ్ రహిత మంచినీళ్లు వచ్చే ఎన్నికల నాటికి అందించలేకపోతి నన్ను రాళ్లతో కొట్టండి, అంటూ గంభీరంగా ప్రకటించారు. అప్పట్లో ఆ ప్రకటన ఒక సంచలనం. ఆ ఆ పని అయితదా అని చాలా మంది అనుకున్నారు. కానీ ఎంతో పట్టుదలతో మిషన్ భగీరథ పథకాన్ని తెచ్చి, అనేక దశాబ్దాలుగా ఫ్లోరైడ్ భూతం నుంచి ఇబ్బందులు పడుతున్న, ప్రజలను రక్షిస్తూ స్వచ్ఛమైన మంచినీటిని అందించారు. ఓట్ల కోసం వాగ్దానం చేయడం వేరు. ప్రజల కోసం చిత్తశుద్ధితో పనిచేయడం వేరు. ఆ పథకంలో అక్రమాలు అన్యాయాలు, అవినీతి జరిగిందని ఆరోపణలు రావడం సహజం. కానీ అంతిమంగా ఆ ప్రజలకు మేలు జరిగిందనేది గొప్ప విషయం అని మేధావులు పేర్కొంటున్నారు. ఏ పార్టీ నాయకుడైన, ఏ పార్టీ విధానం అయినా, అలా ప్రజలకు మేలు చేసేదిగా ఉండాలి దాన్ని ఓటర్ అన్న ఎన్నికల సమయంలో కన్ఫ్యూజన్ లేకుండా, పనిచేసే ప్రభుత్వాలను అధికారంలోకి తేవాలి. పనిచేసే పార్టీలను గుర్తించి గెలిపించుకోవాలి.. జన్‌ధన్ ఖాతాలు తెరవండి ఒక్కొక్కరికి 15 లక్షలు ఖాతాలో వేస్తానన్న మోడీ నయా పైసా ఇవ్వలేదు. రెండు కోట్ల మందికి ఉద్యోగాలు ఇస్తానని చెప్పి ఇవ్వకపోగా, ప్రభుత్వ రంగ సంస్థల్లో ఉద్యోగులకు భద్రత లేకుండా చేశారని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. మరుగుదొడ్లు కట్టించడం ఉజ్వల పథకం కింద ఉచిత గ్యాస్ సిలిండర్ ఇవ్వడం మంచిపని. కానీ 400 ఉన్న గ్యాస్ సిలిండర్ 1200 కు పెంచడం ప్రజలపై ప్రేమ చూపినట్లు కాదు. ఇక నిత్యావసర వస్తువుల ధరల విషయం వేరే చెప్పుకోవలసిన అవసరం లేదు. ఓటర్లందరూ మూకుమ్మడిగా అనుభవిస్తున్నవే…
ఈ విషయాలు మచ్చుకే గుర్తు చేసుకుంటున్నాం వైఫల్యాలు, అనవసర కయ్యాలు , విద్వేషాలు అనేకం ఉన్నాయి. ఇక కాంగ్రెస్ నాయకుల్లోనూ ఆశలు కలుగుతున్నాయి.. డబల్ బెడ్ రూమ్ తో పోల్చుకున్నప్పుడు ఇందిరమ్మ ఇండ్లే నయమని సామాన్యులు చెబుతున్నట్లు కాంగ్రెస్ నేతలు పేర్కొంటున్నారు.. అలా చూసినప్పుడు తమ ప్రభుత్వం పట్ల ప్రజలకు విశ్వాసం ఉందనే నమ్మకంతో ఆ పార్టీ గ్యారెంటీ కార్డును పంపిణీ చేస్తుంది. ఏమైనా ఎన్నికల సీజన్ మొదలైంది . అందుకే మ్యానిఫెస్టోలు చేతుల్లోకి తీసుకొని కన్ఫ్యూజ్ కాకుండా ఆలోచించు ప్రభుత్వాన్ని మార్చే శక్తి నీకే ఉంది ఓటరే షూటర్…
