ఈ సంవత్సరం వర్షాకాలం కురిస్తే అతివృష్టి , లేకుంటే అనావృష్టి, అన్న చందంగా సాగుతోంది.. ఈ సంవత్సరం 2005 నాటి వర్షాభావ పరిస్థితులు తప్పవని నిపుణులు హెచ్చరిస్తున్నారు… దాదాపు సాగర్ ఎడమ కాలువ పరిధిలో 6.50 లక్షల ఎకరాల్లో వరి సాగు ప్రశ్నార్ధకంగా మారి , ఆయకట్టు రైతులు ఆందోళన చెందుతున్నారు.. మరోపక్క 40 రోజులు ఆలస్యంగా వేసిన పత్తి మొక్కజొన్న వంటి మెట్ట పంటలు కూడా సరైన వర్షాలు లేక పలుచోట్ల ఎండిపోతున్నాయి.. దీంతో ఈ సంవత్సరం కరువు మేఘాలు కమ్ముకొస్తున్నట్లేనని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు..
… ఇరవై ఏళ్ల నాటి పరిస్థితి తప్పదా..!

ప్రస్తుత వాతావరణ స్థితిని బట్టి అంచనా వేసిన నిపుణులు 2005 నాటి పరిస్థితులు తప్పవని అంటున్నారు. 2005 సంవత్సరంలో ఆగస్టు నెల వర్షపాతం 25% తక్కువగా కురువగా, ఈ సంవత్సరం ఇంకా తగ్గి 32 శాతం తక్కువ వర్షపాతంగా నమోదయింది. అయితే అప్పట్లో సెప్టెంబర్ నెల కూడా వర్షపాతం బాగా తగ్గింది.ఈ సంవత్సరం కూడా సెప్టెంబర్ లో వర్షాలు తగ్గుతాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. 1920లో 24.4%, 1965లో 24.6% ఆగస్టు వర్షపాతం తగ్గగా, 1913లో 24.1 శాతం వర్షపాతం తగ్గింది అంటే దాదాపు 20 ఏళ్ల తర్వాత వర్షాకాలంలో వర్షపాతం భారీగా తగ్గిందని వాతావరణ నిపుణులు చెబుతున్నారు.
…. ఆరుతడి పంటలకైనా నీరు ఇస్తారా…!

ప్రధానమైన ఒరిసాగుకు సరిపడా నీళ్లు లభించే అవకాశం ఇప్పటికి లేనందున , కనీసం ఆరుతడి పంటల కైనా నీళ్లు సరఫరా చేస్తారా , లేదా , అనే అంశంపై కూడా ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన చేయడం లేదని రైతులు పేర్కొంటున్నారు. వరి సాగు కష్టంగా మారినప్పుడు ఆయకట్టు రైతులు ఆయా పొలాల్లో మొక్కజొన్న ,పత్తి ,వేరుశనగలాంటి పంటలతో పాటు మినుము , పెసర, కంది వంటి అపరాలను కూడా పండిస్తారు. అదృష్టం బాగుంటే సెప్టెంబర్ నెలలో భారీ వర్షాలు కృష్ణా ప్రాంతంలో కురిస్తే తప్ప సాగరు పరిధిలో పూర్తిస్థాయిలో వరి సాగు ప్రశ్నార్ధకంగా మారే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది.
…. సాగర్ ప్రస్తుత నీటి మట్టం 151 టీఎంసీలు మాత్రమే….
నాగార్జునసాగర్ లో ప్రస్తుతం 151 టీఎంసీ నీరు మాత్రమే నిల్వ ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. సాగర్ నీటి నిల్వ సామర్థ్యం 315 టీఎంసీలు.
కాగా అందులో 50 శాతం కూడా సాగర్ నిండలేదు. ఈ నీటిలో అత్యధిక శాతం తాగునీటి అవసరాలకే ప్రభుత్వం వినియోగించాల్సి ఉంటుంది. ఇక శ్రీశైలం ప్రాజెక్టులోను ప్రస్తుతానికి కేవలం 96 టిఎంసి నీళ్లు మాత్రమే నిల్వ ఉన్నట్లు తెలుస్తోంది. శ్రీశైలం నీటి నిల్వ సామర్థ్యం 215 టీఎంసీలు కాగా 96 టిఎంసిలు మాత్రమే ఉన్నాయట. వర్షాభావ పరిస్థితులు నెలకొన్న సందర్భంగా తెలంగాణ ప్రాంతంలోని ప్రధానంగా మూడు జిల్లాలు నల్గొండ ,సూర్యాపేట, ఖమ్మం జిల్లాల పరిధిలో సాగర ఆయకట్టు పరిధిలోని 6 లక్షల 50 వేల ఎకరాల్లో వరి సాగు ప్రశ్నార్ధకంగా మారింది. ఖమ్మం జిల్లాలో 2.40 లక్షల ఎకరాల్లో వరి సాగు సాగర్ ఆయకట్టులో సాగు అవుతుండగా , ఈ సంవత్సరం ఒక లక్ష , ఎకరాల్లో నాట్లు వేసేందుకు రైతులు వరి నార్లు పోశారు. అందులో కూడా సగానికి పైగా నారుమళ్లు నీరందక ఎండిపోతున్నాయి. మిషన్ కాకతీయ ద్వారా చెరువులు కుంటలన్ని పూడికలు తీయడం వల్ల కనీసం ఈ వర్షాలకు ఆయా చెరువులు కుంటల్లో నీటి నిల్వ కొంత ఎక్కువగా ఉండి, తెలంగాణలోని రైతులకు చాలావరకు మేలు జరుగుతుంది . కానీ సాగర కాలువ ద్వారా చెరువులు కుంటలు నింపుకొని పంటలు పండించే రైతులకు మాత్రం సాగర్ నీళ్లు ఆగిపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. వారి పొలాలు పండటం ప్రశ్నార్థకంగా మారింది. ఈ సెప్టెంబర్ లోనైనా వరుడు కరుణించి కృష్ణ ప్రాంతంలో భారీ వర్షాలు కురవాలని రైతు లోకం కోరుకుంటుంది.
