మున్నేరు ముంపు బాధితులకు గృహ అవసరాలకు సంబంధించిన వస్తువులను రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ మంగళవారం ఖమ్మం లో పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తన ప్రజలకు ఎప్పుడు ఎటువంటి ఆపద వచ్చిన ఆయా సందర్భాల్లో అజయ్ అన్నగా తాను వారికి ఎప్పుడూ తోడుగా ఉంటానని పేర్కొన్నారు. తనవంతుగా అన్ని విధాలుగా శక్తి మేరకు ఆదుకుంటానని ఆయన పేర్కొన్నారు. వరదలు వచ్చినప్పుడు గతంలో ఎన్నడు లేని విధంగా ఈ సంవత్సరం మున్నేరు పొంగిందని ఆ సందర్భంలో ఎన్డీఆర్ఎఫ్ బృందాలను రప్పించి తన వాళ్ళనందరిను సురక్షిత ప్రాంతాలకు చేర్చగలిగానని ఆయన పేర్కొన్నారు. ఆ వరదలకు సర్వం కోల్పోయిన అందరికీ ఐటిసి వారి సహకారంతో గృహ వస్తువులను అందజేస్తున్నామని ఆయన తెలిపారు. భవిష్యత్తులో ఇటువంటి విపత్తు వచ్చినప్పుడు తట్టుకునే నిలిచేందుకు మున్నేరు కరకట్ట నిర్మాణానికి ఒకటిన్నర కోట్ల రూపాయలు మంజూరు చేయించానని వెంటనే స్పందించి నిధులు మంజూరు చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్ కు కేటీఆర్ కు తాము తమతో ఉన్న ప్రజలు రుణపడి ఉన్నారని ఆయన పేర్కొన్నారు.

ఖమ్మం నియోజకవర్గ పరిధిలో ఒక్క ప్రాణ నష్టం జరగలేదని, పాలేరు నియోజకవర్గంలో దురదృష్టవశాత్తు అతని స్వయంకృతాపరాదం వల్లే ఒక్క ప్రాణం కోల్పోయామన్నారు. వరద ముంపులో చిక్కుకున్న వారికి బొట్ల ద్వారా కాపాడాలని కష్టపడినా ఫలితం లేకపోవడంతో ముఖ్యమంత్రి కేసీఅర్ దృష్టికి తీసుకెళ్లి హుటాహుటిన ఎన్డీఆర్ఎఫ్ బృందాన్ని ఖమ్మంకు తీసుకొచ్చి నిర్విరామంగా కృషి చేసి అర్థరాత్రి 3 గంటల వరకు శ్రమించి ప్రతి ఒక్కరినీ కాపాడడం జరిగిందన్నారు. పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసి, మంచి భోజనంతో పాటు అన్ని వసతులు కల్పించామన్నారు. మరుసటి రోజు ముంపు ప్రాంతాల్లో మురుగు, చెత్త తొలగించి మున్సిపల్ శాఖ అధ్వర్యంలో పారిశుద్ధ్య చర్యలు యుద్ధప్రాతిపదికన పూర్తి చేసినట్లు ఆయన తెలిపారు. ముంపు బాధిత కుటుంబాలకు పువ్వాడ ఫౌండేషన్ అధ్వర్యంలో ప్రతి ఇంటికి నిత్యావసర వస్తువులు పంపిణి చేశామని మంత్రి అన్నారు. అనంతరం జరిగిన క్యాబినెట్ సమావేశంలో మున్నేరు సమస్యను వివరించగా కేసీఅర్ రూ.150 కోట్లు మంజూరు చేశారని ఆయన తెలిపారు. మున్నేరు పరివాహక ప్రాంతంలోని ముంపు బాధితులకు ఇక ఇబ్బందులు రావని, మున్నేరుకు ఇరువైపులా ఆర్సిసి రిటైనింగ్ వాల్ నిర్మాణం కోసం వేగంగా ప్రతిపాదనలు సిద్దం అవుతున్నాయన్నారు. అతి త్వరలో ఆయా పనులకు శంకుస్థాపన చేసి ప్రారంభించనున్నట్లు ఆయన తెలిపారు. శాశ్వత పరిష్కారం కోసం రూ.777 కోట్లుతో ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నట్లు, రూ.30 కోట్లతో పద్మావతి నగర్ రంగనాయకుల గుట్ట, ప్రకాష్ నగర్ ల వద్ద మరో మూడు చెక్ డ్యాం ల నిర్మాణం చేపట్టడానికి ప్రభుత్వం మంజూరు చేసినట్లు ఆయన అన్నారు. మున్నేరు పై బ్రిటిష్ కాలం నాటి బ్రిడ్జి పక్కనే మరో నూతన బ్రిడ్జి నిర్మాణం రూ.180 కోట్లతో చేపట్టనున్నట్లు ఆయన తెలిపారు. పేదల పరిస్థితి వివరించగా తక్షణమే స్పందించి వరద ముంపు బాధితుల కోసం రూ. 1 కోటితో గృహ వినియోగ వస్తువులు అందజేసినందుకు ఐటీసీ కంపెనీ సిఇఓ కులకర్ణి కి మంత్రి ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలిపారు. దీనితో పాటు మున్నేరు ముంపు బాధితులకు రూ. 1.50 కోట్ల నగదు పంపిణీకి ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి అన్నారు. ఖమ్మం నియోజకవర్గం పరిధిలోని ముంపు బాధితుల మరింత ఆదుకోవాలనే సంకల్పంతో రాజ్యసభ సభ్యులు బండి పార్థసారథి రెడ్డిని సహకారం కోరగా అడిగిన వెంటనే రూ. కోటి, నా కోడలు అపర్ణ తన తాత కంపెనీ నుండి రూ. 50 లక్షలు మొత్తం రూ.1.50 కోట్లను జిల్లా కలెక్టర్ అకౌంట్ కు నగదును బదలాయించినట్లు, ఆయా నగదును వరద ముంపులో గృహాలు దెబ్బతిన్న వారికి నగదు రూపంలో చెక్కులు అందజేయనున్నట్లు ఆయన తెలిపారు.
కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ మాట్లాడుతూ, మున్నేరు వరదల్లో నష్టపోయిన బాధితులు 2461 మందికి ఐటీసీ సహకారంతో గృహోపకరణాలు అందజేస్తున్నట్లు అన్నారు. విపత్తు లో రెవిన్యూ, పోలీస్, మునిసిపల్ అధికారులు, సిబ్బంది చక్కగా సహాయక చర్యలు చేపట్టారన్నారు.
ఈ కార్యక్రమంలో మేయర్ పునుకొల్లు నీరజ, సుడా చైర్మన్ విజయ్ కుమార్, ఖమ్మం మునిసిపల్ కమీషనర్ ఆదర్శ్ సురభి, ఖమ్మం ఆర్డీవో జి. గణేష్, ఐటీసీ పరిపాలన అధికారి చెంగల రావు, కార్పొరేటర్ లు కమర్తపు మురళి, మాటేటి లక్ష్మీనాగేశ్వరరావు, కన్నం వైష్ణవి ప్రసన్న, తోట గోవిందమ్మ రామారావు, దండా జ్యోతి రెడ్డి, నాయకులు ఆర్జేసి కృష్ణ, పగడాల నాగరాజు, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
