ఆంధ్రప్రదేశ్ జాతీయం తెలంగాణ రాజకీయం

ఓటరే షూటర్.. అనుచరులే నిర్దేశకులు.. మొన్న పొంగులేటి.. నేడు తుమ్మల.. గులాబీ బాస్ ఏం చేస్తారో.. !

Written by Mohiddin Shaik

ప్రజాస్వామ్యంలో ఓటరే షూటర్.. ఆయన ఎవరిని షూట్ చేస్తాడో.. ఎవరికి ఓటు వేస్తాడో ఆయన ఇష్టం.. అదే విధంగా నాయకుల ను నడిపించే అభిమానులు, అనుచరులు కూడా అంతే.. తమ నాయకుడు ఏ పార్టీలో ఉండాలో ఏ పార్టీలో చేరకూడదు వారే నిర్దేశిస్తారు.. ఇప్పుడు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో బి ఆర్ ఎస్ ను వీడే బడా నాయకుల విషయంలో ఇదే ట్రెండు కొనసాగుతోంది…

… తుమ్మల కాంగ్రెస్ వైపే అడుగులు వేస్తారేమో….

తుమ్మల నాగేశ్వరరావు అభిమానులు అనుచరులు ఆయనను కాంగ్రెస్ పార్టీలో చేరాలని ఆయనపై పెద్ద ఎత్తున ఒత్తిడి చేస్తున్నారు. శుక్రవారం తుమ్మలకు స్వాగతం పలికే సందర్భంలో అనేకమంది తుమ్మల అభిమానులు కాంగ్రెస్ జెండాలతో ఆయనకు స్వాగతం పలకటం చూసాం. ఆయన కూడా తన ఉద్వేగ భరిత ప్రసంగంలో కార్యకర్తలు ఏమి కోరుకుంటున్నారో అదే చేస్తామని తన అభిమానులు అన్యాయులు తలదించుకునే పని ఏది చేయనని గట్టిగా చెప్పారు. అలా అభిమానులకు వ్యతిరేకంగా ఏది చేయనంటూనే తలదించుకోవాల్సి వస్తే తల నరుక్కుంటానంటూ ఘాటుగా మాట్లాడారు. అంటే సుదీర్ఘ రాజకీయ చరిత్ర కలిగిన ఉమ్మడి ఖమ్మం జిల్లా రాజకీయాలను ఒకప్పుడు తన కను సన్నల్లో నడిపిన మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కూడా తన అభిమానుల ఒత్తిడి మేరకు కాంగ్రెస్లో చేరడం ఖాయం అనే సంకేతాలు స్వయంగా తుమ్మల నాగేశ్వరరావు పంపినట్లేనా.. అంటే పంపినట్లేనని ఆయన హస్తం పార్టీలో చేరి కచ్చితంగా అసెంబ్లీకి పోటీ చేస్తారని తుమ్మల వర్గంలోని కొందరు నాయకులు గట్టిగా చెబుతున్నారు…

…. అనుచరులు చెప్పిందే పొంగులేటి కూడా చేశారు..

ఇటీవల పొంగులేటి శ్రీనివాస రెడ్డి కూడా తన అనుచరుల సూచనలకు ఒత్తిళ్లకు విలువనిచ్చి కాంగ్రెస్ పార్టీలో చేరిన విషయం తెలిసిందే.. ప్రస్తుతం తుమ్మల మనసులో ఏముందో స్పష్టంగా తెలియదు కానీ గతంలో మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి బి ఆర్ ఎస్ ను వీడి బిజెపిలో చేరతారనే చర్చ పెద్ద ఎత్తున జరిగింది. కొన్ని సందర్భాల్లో పొంగులేటి కూడా బిజెపిలోకే వెళ్లాలని యోజన చేసినట్లు ఆయనకు అత్యంత సన్నిహితులు వెల్లడించిన విషయం తెలిసిందే.
ఆ విషయం తెలిసిన తన అనుచరులు బిజెపి వైపు వెళితే తాము తనతో నడవడం కష్టం అవుతుందని ఖరాఖండిగా చెప్పారు. కొంతమంది ముఖ్య అనుచరులు పొంగులేటి బిజెపి వైపు వెళతారేమో అనే అనుమానంతో ముందుగానే కాంగ్రెస్ లో కూడా చేరిపోయారు. ఆయన తన అనుచరుల మనసు ఏమైనా మారుతుందేమోనని కొంతకాలం ఎటు వెళ్లేది తేల్చకుండా ఆత్మీయ సమ్మేళనాళలతో సమయం తీసుకున్నారు. అయినా ఆయన అనుచరుల్లో మార్పు రాలేదు. అందరూ కాంగ్రెస్కే జై కొట్టారు. అంతిమంగా ఆయన కూడా కాంగ్రెస్కు జై కొట్టిన విషయం తెలిసిందే. అది పాత విషయం ఇప్పుడు తుమ్మల నాగేశ్వరరావు వంతు వచ్చింది.

.. లీడర్ను నడిపిస్తున్న క్యాడర్…

లీడర్లు పార్టీలు మారేటప్పుడు అధికారం కోసమో, వ్యాపారం కోసము , లేదా తాము చెబుతున్నట్లు ప్రజాసేవ కోసమో ..బిజెపి వంటి పార్టీల్లో చేరేందుకు కూడా నిర్ణయాలు తీసుకోబోతుంటే… క్యాడర్ మాత్రం అటువైపు వెళ్ళద్దు..అటు వెళితే మేము మీ నుంచి దూరం అవుతాము, మీరు కాంగ్రెస్ వైపు అడుగులు వేయండి మీ వెన్నంటే ఉంటాం అంటూ లీడర్లను కేడర్ కట్టడి చేస్తున్నట్లు కనిపిస్తోంది . ఈ పరిణామం ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ప్రస్తుతం కొనసాగుతోంది . బి ఆర్ ఎస్ ను వ్యతిరేకిస్తున్న
ఓటర్లలో, సాధారణ క్యాడర్లో కనిపిస్తున్న ఈ మార్పు , ఉమ్మడి ఖమ్మం జిల్లాలో బిజెపి పట్ల వ్యతిరేకతను ,కాంగ్రెస్ పట్ల సానుకూలతను తెలియజేస్తుందని పరిశీలకులు అంటున్నారు.
అందుకే పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాదిరిగానే తుమ్మల నాగేశ్వరరావు కూడా కాంగ్రెస్ పార్టీకి జై కొట్టడం ఖాయమైనట్లేనని పరిశీలకులు

… గులాబీ బాస్ ఉమ్మడి జిల్లా నేతలకు ఏమి హితబోధ చేస్తారో..

తుమ్మల నాగేశ్వరరావు కాంగ్రెస్లో చేరుతారని వాతావరణం ఏర్పడిన నేపథ్యంలో గులాబీ బాస్ కెసిఆర్ ఉమ్మడి ఖమ్మం జిల్లా టిఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలను హుటాహుటిన హైదరాబాద్కు శనివారం పిలిచారు. వారితో అక్కడ భవిష్యత్తు వ్యూహాలపై ఉమ్మడి జిల్లాలో పార్టీని కాపాడుకోవడం పై ఆయన చర్చించనున్నారు. ఈ సందర్భంలో తుమ్మలను కట్టడి చేసేందుకు పాలేరు శాసనసభ్యుల్ని బుజ్జగించి తుమ్మలకు పాలేరు సీటు కేటాయిస్తామని కాంగ్రెస్ లోకి వెళ్లకుండా ఆగమని తుమ్మలకు ప్రతిపాదించే అవకాశాలు ఉన్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది. ఒకవేళ ఇంత జరిగాక తుమ్మల అటువంటి ప్రతిపాదన వస్తే మళ్లీ కేడర్ని కాదని వెనక్కి తిరుగుతారా.. లేక కాంగ్రెస్కు జై కొడుతూ ముందుకు అడుగు వేస్తారా అనే అంశంపై కూడా చర్చ జరుగుతోంది. ఇది ఇలా ఉంటే గులాబీ బాస్ మైండ్ లో ఫిక్స్ అయితే బ్లైండ్ గా వెళ్లిపోతారని ఆయన అటువంటి ప్రతిపాదనలేమి పెట్టరనే చర్చ కూడా జరుగుతుంది ఏమైనా ఉమ్మడి ఖమ్మం జిల్లా రాజకీయాలు రాష్ట్ర స్థాయి రాజకీయాలను కూడా వేడి పుట్టిస్తున్నాయి..

About the author

Mohiddin Shaik

Leave a Comment