ఎన్నికల సీజన్ మొదలు కావడంతో ఎక్కడ చూసినా రాజకీయాలపైనే చర్చ జరుగుతుంది.. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో బి ఆర్ ఎస్ నుంచి ఒక్క ఎమ్మెల్యేను కూడా అసెంబ్లీ గేటు తాకనివ్వను అన్న పొంగిలేటి ప్రతిజ్ఞ రాజకీయ వర్గాల్లో ప్రకంపనలు సృష్టించిన విషయం తెలిసిందే.. ఈ భీషణ ప్రతిజ్ఞ నేరుగా గులాబీ బాస్ ని తాకింది.. అంత పెద్ద ప్రతిజ్ఞ చేసిన మాజీ ఎంపీ ప్రస్తుత కాంగ్రెస్ రాష్ట్ర నేత పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఎక్కడి నుంచి పోటీ చేస్తారనే అంశం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది… ఆయన కొత్తగూడెం నుంచి పోటీ చేస్తారా… లేక ఖమ్మం నుంచి పోటీ చేస్తారా.. అది కూడా కాకుంటే చివరి నిమిషంలో పాలేరు వైపు వెళతారా.. అనే విషయాలపై విస్తృతంగా చర్చ జరుగుతోంది… బి ఆర్ ఎస్ ను ఉమ్మడి ఖమ్మంలో ఓడించాలని ఆయన టార్గెట్ పెట్టుకోగా, పొంగిలేటి ఎక్కడ పోటీ చేస్తే అక్కడ ఆయనను ఓడించి ఆయన కాళ్ళ కింద నేలను కదిలించాలని గులాబీ బాస్ వ్యూహరచన చేస్తున్నారు… అందుకే ఉమ్మడి జిల్లాలో ఎన్ని స్థానాల్లో ఏ పార్టీ గెలుస్తుందో అనే దానికంటే ప్రతిజ్ఞ చేసిన పొంగులేటి గెలుస్తారా, లేక ఆయనను గులాబీ బాస్ ఓడిస్తారా , అనే అంశంపైనే విశ్లేషకులు పరిశీలకుల్లోనూ విస్తృత చర్చ జరుగుతోంది.. అందుకే పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఎక్కడి నుంచి పోటీ చేస్తారనే అంశం ప్రాధాన్యతను సంతరించుకుంది….
….. కొత్తగూడెం నుంచి పోటీ చేయడం లేదా…?
పొంగులేటి కొత్తగూడెం నుంచి పోటీ చేయడం దాదాపు ఖాయమైంది. అందుకు సంబంధించి సన్నాహాలు కూడా జరిగాయి. ఆయనపై సిట్టింగ్ ఎమ్మెల్యే కాకుండా , బలమైన కాపు నాయకుడు రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర ను రంగంలోకి దింపాలని వ్యూహరచన చేసినట్లు ప్రగతి భవన్ స్థాయిలోనే ప్రచారం జరిగింది. అందుకు సంబంధించిన కార్యాచరణ కూడా మొదలు కాబోతుందంటూ కూడా వార్తలు వచ్చాయి. ఆ తర్వాత కొత్తగూడెంలో పొంగులేటి ఆత్మీయ సమ్మేళన సభకు జనం సరిగా రాకపోవడం, ఆ వెంటనే ముఖ్యమంత్రి కేసీఆర్ వనమా వెంకటేశ్వరరావును పిలిపించుకొని కొత్తగూడెం నుంచి నువ్వే పోటీ చేస్తావు గెలుస్తావు జాగ్రత్తగా చేసుకో , అంటూ భుజం తట్టి పంపించారు. ఈ విషయాలను స్వయంగా వనమా వెంకటేశ్వరరావు భారీ ర్యాలీలో బహిరంగంగా ప్రకటించిన విషయం తెలిసిందే. అంటే పొంగులేటి కొత్తగూడెం నుంచి పోటీ చేయకపోవచ్చునే సంకేతాలు ఏమైనా ముఖ్యమంత్రికి అంది ఉంటాయేమో, అందుకే వద్దిరాజు రవిచంద్ర ను దించాలనుకున్న సీఎం తిరిగి వనమాకే టికెట్ ఇచ్చేందుకు నిర్ణయించుకున్నారేమో అనే చర్చ పరిశీలకుల్లో జరుగుతుంది.
….. మరి ఖమ్మం నుంచి పోటీ చేస్తారా…?
బి ఆర్ ఎస్ పై అంత పెద్ద ప్రతిజ్ఞ చేసిన పొంగిలేటి , ముందుగా ఖమ్మం కాకుండా కొత్తగూడెం నుంచి పోటీ చేయాలని ఎందుకు భావించారు..! అంటే ఖమ్మం నియోజకవర్గ పరిస్థితులను అత్యధిక ఓట్లు గలిగిన సామాజిక వర్గాలను విశ్లేషించినప్పుడు ఇక్కడ చౌదరి , ముస్లిం మైనారిటీ వర్గాల ఓట్లు అత్యధికంగా ఉన్నాయి. అదేవిధంగా ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు, తో పాటు ఖమ్మం నగర అభివృద్ధిలోనూ, మిగతా ప్రాంతాలతో పోల్చుకున్నప్పుడు చాలా బాగుందనే అభిప్రాయం ప్రజల్లో ఉంది. అన్నిటికీ మించి మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఈ నియోజకవర్గంలో తిరుగులేని పట్టు కలిగి ఉన్నారనే అభిప్రాయాలు ఉన్నాయి. ప్రధానంగా అన్ని సామాజిక వర్గాల ప్రజలతోనూ ఆయన దగ్గరగా ఉంటూ, ప్రజా సంబంధాలను తనదైన శైలిలో బలంగా కలిగి ఉన్నారనే అభిప్రాయాలు కూడా పరిశీలకుల్లో వ్యక్తం అవుతున్నాయి . ఈ నేపథ్యంలోనే పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఖమ్మం నియోజకవర్గం తనకు సేఫ్ జోన్ కాదని భావించి కొత్తగూడెం నియోజకవర్గాన్ని ఎంచుకొని ఉంటారని అభిప్రాయాలు కొందరు వ్యక్తం చేశారు. ఇదిలా ఉంటే ఆయన అభిప్రాయం ఎలా ఉన్నా , మంత్రి అజయ్ కుమార్ పై దీటైన అభ్యర్థి కావాలనే ఉద్దేశంతో కాంగ్రెస్ అధిష్టానం లోని కొందరు పెద్దలు పొంగులేటినీ ఖమ్మం నుంచి పోటీ చేయాలని సూచిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది..

…. మైనారిటీ అభ్యర్థి జావేద్కు అవకాశం దక్కుతుందా..!
ఇదిలా ఉంటే ఖమ్మం నియోజకవర్గం నుంచి ముస్లిం మైనారిటీ వర్గానికి చెందిన యువ నాయకుడు మల్లు భట్టి విక్రమార్క శిష్యుడు నగర కాంగ్రెస్ అధ్యక్షుడు అయిన మొహమ్మద్ జావేద్ కు ఖమ్మం కాంగ్రెస్ టికెట్ దక్కుతుందనే ప్రచారం కూడా ఆ పార్టీలో జోరుగా సాగుతోంది. సహజంగానే ఖమ్మం నియోజకవర్గంలో ఓటు బ్యాంకు కలిగి ఉన్న కాంగ్రెస్ పార్టీకి జావేద్ రంగంలో దిగితే ముస్లిం ఓట్లు కూడా భారీగా పడతాయని కాంగ్రెస్ అధిష్టానం లోని కొందరు అంచనా వేస్తున్నట్లు కూడా చర్చ జరుగుతుంది. మరి అలా జరిగితే పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఎక్కడ నుంచి పోటీ చేస్తారు, ఉమ్మడి జిల్లాలో ఉన్నవి మూడే మూడు జనరల్ స్థానాలు. కొత్తగూడెం , ఖమ్మం , పాలేరు . మొదటి రెండు నియోజకవర్గాలు సేఫ్ కాదనుకుంటే పొంగులేటి మరి పాలేరు వైపు అడుగులు వేస్తారేమో…అక్కడ ఇప్పటికీ రెడ్డి సామాజిక వర్గానికి చెందిన కొంతమంది నాయకులు ఆ నియోజకవర్గ ప్రజల్లో పట్టు కలిగి ఉన్నారు. ఆ విధంగా అటువైపు కూడా ఆయన అడుగు వేయవచ్చేమో అనే చర్చ కూడా జరుగుతుంది. కాంగ్రెస్లో చేరకముందు బి ఆర్ ఎస్ పై చేసిన శబదం వల్ల ఆయన పోటీపై రాష్ట్రస్థాయి రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది.. మొత్తం మీద ఆయన కాంగ్రెస్ లో చేరకముందు పొంగిలేటి బిజెపిలో చేరతారా.., కాంగ్రెస్లో చేరతారా, అనే అంశంపై రాష్ట్రవ్యాప్తంగా విస్తృత చర్చ జరిగిన విధంగానే ఇప్పుడు ఆయన పోటీ చేయబోయే స్థానం ఏది అనే అంశంపై కూడా రాజకీయ , వర్గాల్లో విస్తృత చర్చ జరుగుతోంది. ఎక్కడి నుంచి చేస్తారనే విషయం తేలాలంటే కాంగ్రెస్ ఉమ్మడి జిల్లాలో తన అభ్యర్థులను ప్రకటించాకనే స్పష్టం కానుంది.
