ఆయన పాట కోట్ల తూటాల పెట్టు.. ఆయన ఆట, పాట అభ్యుదయ భావాల పూదోట.. ఆయన ఆహార్యం బడుగు జీవుల ప్రతిరూపం.. పంచ కట్టు, కాళ్లకు గజ్జలు, చేతిలో ఎర్ర రిబ్బను కట్టిన కర్ర.. భుజాన గొంగళి, మరో భుజాన ఎర్ర కండువా, వేదికపై అటు ఇటు తిరుగుతూ, ఒక రాగం ఆలాపన చేస్తాడు.. ఎర్రజెండాను గాలిలోకి ఎగరేసి గొంగళి చింగుతో పట్టుకుంటాడు.. ఆ ఎర్ర జెండాను ప్రేమతో చంటి పిల్లాడిని చూసినట్లు చూస్తూ, పాట అందుకుంటాడు.. అప్పటికే వేదిక ముందున్న వేలమంది, లక్షల మంది ప్రజల దృష్టి గద్దర్ అన్న పాట మీదే కేంద్రీకృతమైపోతుంది.. ఆయన ఏ పాట పాడిన అది ప్రజల బాధలనే చెబుతుంది.. ఆయన పాటలోని మాటలు తూటాలై పాలకుల పై ప్రశ్నల వర్షం కురిపిస్తాయి.. కార్మిక కర్షక దళిత గిరిజన బహుజన పీడిత వర్గాల కన్నీటి గాథలనే వివరిస్తాయి… ఆయన ఒక మానవీయ కవి .. ఆయన ఒక విప్లవ వీరుడు . ఆయన ఒక నవ సమాజ స్వాప్నికుడు . . ఆయన విశ్వ మానవుడు.. పీడిత ప్రజల పక్షాన గర్జించే ఆ గళం ఇప్పుడు మూగబోయింది… తుపాకీ తూటాలు శరీరంలో దించిన తగ్గని ధిక్కార స్వరం ఇప్పుడు మూగబోయింది ..దండకారణ్యం నుంచి జనారణ్యం వరకు ఆయన అభిమాన కోటి ఘన నివాళులర్పిస్తోంది..శోకసంద్రంలో మునిగితేలుతోంది..

.. గద్దర్ అన్న మృతికి సీఎం కేసీఆర్ ఘన నివాళి…
గుండెపోటుతో హైదరాబాద్ యశోద ఆసుపత్రిలో చేరిన ప్రజా గాయకుడు గద్దర్ అన్న చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందారు. ఆ వార్త విని రాష్ట్ర అసెంబ్లీలో మంత్రి కేటీఆర్ సంతాపాన్ని ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. అసెంబ్లీ ఆయనకు నివాళులర్పించింది ..ఆ తర్వాత రాష్ట్ర ముఖ్యమంత్రి, ఆసుపత్రికి వచ్చి గద్దర్ అన్న పార్థివ దేహాన్ని సందర్శించి ఘనంగా నివాళులర్పించారు . ఆయన కుటుంబానికి కేసీఆర్ ధైర్యం చెప్పారు. ముఖ్యమంత్రితో పాటు మంత్రులు , ప్రతిపక్ష నాయకులు ఆయనకు నివాళులర్పించారు.

గద్దర్ లేని గోరటి వెంకన్నను ఊహించలేమన్న గోరేటి వెంకన్న. గద్దర్ అన్న ఆట పాటల మధ్య అన్న ఎప్పుడు మన మధ్య ఉంటాడన్న జూనియర్ ఎన్టీఆర్.
గద్దర్ పార్థివ దేహాన్ని చూసి కంటతడి పెట్టుకున్న పవన్ కళ్యాణ్, గద్దర్ భౌతిక కాయానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించిన మంత్రి కేటీఆర్ , రసమయి బాలకృష్ణ.కాగా పౌర హక్కుల సంఘాలు ,విప్లవ రచయితల సంఘాలు , మానవ హక్కుల సంఘాలు ఇలా అనేకమంది ఆయన ఉద్యమ సహచరులు, నాయకులు మేధావులు పలువురు సినీ ప్రముఖులు ఆయనకు ఘనంగా నివాళులర్పించారు. తనతో కళా రంగంలో జననాట్యమండలిలోనే పనిచేసిన విప్లవ గాయని విమలక్క తో సహా జయరాజు తదితర సహచర కళాకారులంతా కన్నీరు మున్నీరుగా విలపించారు. విప్లవ రచయితగా దళిత జనోదరణ కోసం రచనలు చేసి బుర్రకథలు ఒగ్గు కథలు ఎల్లమ్మ కథలు చెబుతూ, దళితవాడల్లో విస్తృతంగా పర్యటిస్తూ వెనుకబడిన జాతుల్లో చైతన్యం నింపిన మహా మనిషిగా నాయకుడిగా వీరుడుగా గద్దర్ కు పేరుంది. అది కారంచెడు దళితులపై జరిగిన మారణకాండ అయినా, మణిపూర్ లో మహిళలపై జరిగిన హత్యాకాండ అయిన, బాధితుల పక్షాన నిలిచి తన పాటల ద్వారా పాలకులను నిలదీసే ధైర్యశాలి గద్దర్ అన్న.
… స్థూలంగా గద్దర్ చరిత్ర…

గద్దర్ అన్న అసలు పేరు గుమ్మడి విటల్ ఆయన 1948 జూన్ 5న తూఫ్రాన్ లోని లచ్చమ్మ శేషయ్య లకు జన్మించారు. దళిత కుటుంబంలో పుట్టి అనగారిన వర్గాలు అనుభవించే అనేక ఇబ్బందులను అర్థం చేసుకున్న ఆయన వారిలో చైతన్యం నింపే ఏకైక లక్ష్యంతో అభ్యుదయ పదం పట్టారు.
1969 లో తెలంగాణ ఉద్యమంలో ఆయన చురుకైన పాత్ర పోషించారు. తన కళల ద్వారా ప్రజా చైతన్యం కలిగించే గద్దర్ అన్న తొలి దశ తెలంగాణ ఉద్యమం సమయంలోనే బుర్రకథలను ఎంచుకొని పల్లెల్లో ప్రదర్శనలు ఇచ్చేవారు. ఆయన ప్రదర్శనలను చూసిన సినిమా నిర్మాత బి నర్సింగరావు 1971లో ఆయనకు పాట రాసే అవకాశం ఇచ్చారు.ఆపరా రిక్షా పాటతో ఆయన పెద్ద పేరు సంపాదించారు . ఆ పాటల ఆల్బమ్కు గద్దర్ అనే పేరు ఉంది . విటల్ గా ఉన్న ఈయనకు గద్దర్ గా పేరు వచ్చింది. 1972 దళిత, జనోదరణ లక్ష్యంగా ఏర్పడిన జననాట్యమండలి కార్యకలాపాల్లో చురుకుగా పాల్గొన్నారు. కమ్యూనిస్టు భావజాలం కలిగిన గద్దర్ అన్న తన ఆట పాట ఏదైనా పీడితుల ఉద్ధరణ కోసమే సాగేది .
ఇంజనీరింగ్ వరకు చదివిన ఆయన 1975లో కెనరా బ్యాంకు క్లర్క్ ఉద్యోగంలో చేరారు. 1984లో ఆ ఉద్యోగానికి రాజీనామా చేశారు. చెన్నారెడ్డి రెండవసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత నక్సలైట్లపై నిషేధం ఎత్తివేశారు. 1990 ఫిబ్రవరి 18న జననాట్యమండలి ఆధ్వర్యంలో గద్దర్ నిర్వహించిన హైదరాబాద్ సభకు రెండు లక్షల మంది హాజరవ్వడం ఓ చరిత్ర. 1997లో ఆయనపై కాల్పులు జరిగాయి. ఆయన శరీరంలో ఐదు బుల్లెట్లు దిగగా వాటిలో ఒకటి ఇంకా శరీరంలోనే మిగిలి ఉంది. 2002లో నక్సలైట్లకు ప్రభుత్వానికి మధ్య జరిగిన చర్చల సందర్భంగా నక్సలైట్ల పక్షాన వరవరరావు తో పాటు గద్దర్ అన్న దూతలుగా వ్యవహరించారు. 1985లో కారంచేడు లో దళితుల హత్యలు జరిగిన సందర్భంలో వారి పక్షాన పోరాటం చేశారు. ఆయన విమలను వివాహం చేసుకున్నారు ఆయనకు సూర్యుడు , చంద్రుడు , వెన్నెల ముగ్గురు సంతానం ఉండగా , చంద్రుడు మృతి చెందారు. ఇక గద్దర్ అన్న రాసిన సినిమా పాటలకు నంది అవార్డుతో సహా అనేక అవార్డులు పురస్కారాలు లభించాయి . అయితే ఆయన నంది అవార్డును తిరస్కరించారు. మలిదశ తెలంగాణ ఉద్యమంలో ఆయన మళ్లీ ఎగిసిన కెరటంలా ఉద్యమించారు. తన పాటల ద్వారా తెలంగాణ భావవ్యప్తికి విస్తృతంగా కృషి చేశారు . ఆయన రాసిన అమ్మ తెలంగాణమా ఆకలి కేకల గానమా అనే పాట రాష్ట్రపాటగా నిలిచింది. పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న కాలమా పోరు తెలంగాణమా అనే పాట సినిమాలో, తెలంగాణ ఉద్యమంలోనూ మారుమోగింది. ఇంకా అనేక ఉద్యమాలకు అండగా నిలబడి తన గొంతునే ఓ వజ్రాయుధం లా పీడిత జనుల ఉద్ధరణ కోసం ఉపయోగించిన ప్రజా గాయకుడు ,కమ్యూనిస్టు స్వప్నికుడు గద్దర్ అన్న . చివరి దశలో కేంద్రంలో ఉన్న బిజెపి ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా గళమెత్తాడు . కాంగ్రెస్ కేంద్రంలో అధికారంలోకి రావాలని ఆకాంక్షించాడు . రాహుల్ గాంధీ ప్రధాని కావాలని ఆకాంక్షించాడు . ఖమ్మం సభలో రాహుల్ గాంధీని ముద్దాడి ఆలింగనం చేసుకొని అందరినీ ఆశ్చర్యపరిచాడు . గద్దర్ బూటకపు ఎన్కౌంటర్లను తీవ్రంగా నిరసించాడు. వాటిని ప్రభుత్వ హత్యలుగా అభివర్ణించాడు. ప్రజా గాయకుడిగా ఆయన ప్రజల గుండెల్లో గొప్ప స్థానం సంపాదించాడు.
