జాతీయం తెలంగాణ

కస్తూర్బా కష్టాలు…వెట్టి చాకిరికి ఆనవాళ్లు.. ఆందోళన బాట పట్టిన కేజీబీవీ ఉద్యోగులు…సమాన వేతనం కల నెరవేరుతుందా..!

Written by Mohiddin Shaik

కార్మిక చట్టాల ప్రకారం వెట్టి చాకిరి ఏనాడో రద్దయింది.. కానీ కస్తూర్బా గాంధీ విద్యాలయాల్లో ప్రభుత్వ ఆదేశాలతోనే అనధికారిక వెట్టిచాకిరి కొనసాగుతోంది… ఈ శ్రమ దోపిడీని మార్చి వేయాలని , వారి ఉద్యోగాలను రెగ్యులరైజ్ చేయాలని సుప్రీం కోర్ట్, నీతి ఆయోగ్ చేసిన సూచనలు, ఆదేశాలు అమలుకు నోచుకోవడం లేదు.. దేశంలోని పంజాబ్ తో సహా మూడు రాష్ట్రాల్లో ఇప్పటికే కేజీబీవీ లో పనిచేసే ఉద్యోగులను రెగ్యులరైజ్ చేశారు ..కానీ తెలంగాణలో అడుగులు పడటం లేదు.. నేడు కేజీబీవీ ఉద్యోగులు హక్కుల సాధన కోసం హైదరాబాదులో ఆందోళన చేయనున్నారు…

కస్తూర్బా గాంధీ విద్యాలయాలు ( కే జి బి వి) లు వెనుకబడిన తరగతుల బాలిక విద్యను ప్రోత్సహించడానికి జాతీయ విద్యా పథకం కింద ఏర్పాటైన వి.. వీటి అభివృద్ధి తెలంగాణ రాష్ట్రంలో బాగుంది… కానీ వాటిలో వెట్టిచాకిరీ విధానం కొనసాగుతోంది.. తాను అధికారంలోకి వస్తే రాష్ట్రంలో అవుట్సోర్సింగ్ కాంట్రాక్టు ఉద్యోగులు అందరిని రెగ్యులర్ చేస్తానని కేసీఆర్ చేసిన వాగ్దానం చేశారు ..9 ఏళ్లు గడిచిన నెరవేరలేదు. ఆశ వర్కర్లు, హోంగార్డులు మున్సిపల్ వర్కర్లు ఇలా అనేకమంది అరకొర జీతాలను పెంచి వారికి ధైర్యాన్ని కల్పించిన ముఖ్యమంత్రి కేసీఆర్. కేజీబీవీ లో పనిచేసే టీచింగ్, నాన్ టీచింగ్ సిబ్బందిని కూడా రెగ్యులరైజ్ చేస్తారని వారు కొండంత ఆశ పెట్టుకున్నారు… చివరకు సుప్రీంకోర్టు ఆదేశాలు గౌరవించి సమాన పనికి సమాన వేతనమైన ఇస్తారని ఆశించారు… కానీ సీఎం కేసీఆర్ వారి పట్ల సానుకూల నిర్ణయం తీసుకోలేదు…ఉద్యోగులు 9 ఏళ్లుగా ఎదురుచూస్తున్నారు… ఆయనకు కరుణ ఎప్పుడు కలుగుతుందో అర్థం కాని పరిస్థితి..

      . .... అంతా క్వాలిఫైడ్ ఉద్యోగులు ..అందరూ కాంట్రాక్టు ఉద్యోగులే.... 

వీటిలో పనిచేసే ఉపాధ్యాయులు అందరూ వెల్ క్వాలిఫైడ్ పీజీ బీఈడీలు చేసిన వారు. డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ ద్వారా ఎంపికైన వారు. వీరికి బాధ్యతలు చాలా ఎక్కువ… హక్కులు , జీతాలు మాత్రం చాలా తక్కువ. వీటిలో పనిచేసే వారంతా మహిళలే… సి ఆర్ టి లుగా పని చేసే బోధన సిబ్బంది తప్పనిసరిగా నైట్ డ్యూటీ కూడా చేయాలి. వందల మంది ఆడపిల్లల రక్షణ రాత్రి పూట వాచ్ ఉమెన్ తో కలిసి సి ఆర్ టి బాధ్యత వహించాలి. ప్రభుత్వ ఉపాధ్యాయులకు ఉండే సౌకర్యాలు హక్కులు వీరికి ఉండవు. వీరి పాఠశాలల్లో చదివే విద్యార్థులు తల్లిదండ్రి లేనివారు , బడి మానివేసిన వారు , అనాధలు ఎక్కువగా ఉంటారు. కానీ రిజల్ట్స్ తెచ్చే విషయంలో బాగా చదివే ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులతో సమానంగా తేవాలి .. రిజల్ట్స్ అంతకంటే బాగా తీస్తున్నారు కూడా .. ఒకవేళ ఎక్కడైనా రిజల్ట్స్ తగ్గితే కాంట్రాక్టు ఉద్యోగం రెన్యువల్ చేయడం ఆపేస్తారు. భారీ జీతాలు తీసుకునే ప్రభుత్వ ఉపాధ్యాయుల కంటే ఎక్కువ పని చేసే ఈ కేజీబీవీ ఉపాధ్యాయులకు ఇచ్చే జీతం 23,000 నుంచి 26,000 మాత్రమే.
విచిత్రం ఏమంటే వందల మంది బాలికలు ఉండే ఈ రెసిడెన్షియల్ స్కూల్లో పని చేసే ఎస్ ఓ ఇటీవల దీనికి అనుబంధంగా ఏర్పాటు చేసిన జూనియర్ కాలేజీకి కూడా ఆమె ప్రిన్సిపాల్ గా వ్యవహరించాలి.
ఈ భారం చాలదన్నట్లు టీఎస్ మోడల్ స్కూల్స్ లో హాస్టల్లకు కూడా కేజీబీవీల ఎస్ఓ ల కె కొన్నిచోట్ల అదనపు బాధ్యతలు అప్పజెప్పారు. ఇంత పెద్ద బాధ్యతలు నిర్వహించే ఎస్ ఓ కూడా కాంట్రాక్టు ఉద్యోగి.. ఆరవ తరగతి నుండి ఇంటర్మీడియట్ వరకు గొప్ప గొప్ప భవనాలలో ఉన్నతమైన సౌకర్యాలతో చదువు అందిస్తున్న ఈ వ్యవస్థలో ఒక్క రంటే ఒక్కరు కూడా పర్మనెంట్ ఉద్యోగులు లేకపోవడం విచిత్రం.
దేశంలోని పంజాబ్ తో సహా మూడు రాష్ట్రాల్లో అక్కడి రాష్ట్ర ప్రభుత్వాలు కేజీబీవీ ఉద్యోగులను రెగ్యులరై జ్ చేశాయి.. కానీ తెలంగాణ ప్రభుత్వం రెగ్యులరైజ్ చేస్తామని ప్రకటించినప్పటికీ, చేయడం లేదు కనీసం సమాన పనికి సమాన వేతనం కూడా ఇవ్వడం లేదు.

.. సమాన వేతనం ఫైల్ పై సీఎం సంతకం అవుతుందా..!

రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కేజీబీవీ ఉద్యోగులకు సమాన పనికి సమాన వేతనం కల్పిస్తారని ఉద్యోగులకు , ఉపాధ్యాయ సంఘాలకు ఇదివరకే మంత్రులు హామీ ఇచ్చారు. ఇప్పటికీ ఆ ఫైలు ముఖ్యమంత్రి టేబుల్ పై ఉందని త్వరలోనే సీఎం సంతకం చేసి మీ అందరికీ తీపి కబురు చెబుతారు అంటూ ఒక ఉపాధ్యాయ సంఘం వారికి చెబుతూ వస్తోంది. ఆ తీపి కబురు కోసం పాపం ఆ ఉద్యోగులు వెయ్యి కళ్ళతో ఎదురుచూస్తున్నారు. అనేక సంక్షేమ పథకాల అమలుతో పాటు దేశంలో ఎక్కడా లేని విధంగా కొన్ని శాఖల చిరుద్యోగులకు, కాంట్రాక్టు ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు జీతాలు పెంచి ఆదుకున్న ముఖ్యమంత్రి , కేజీబీవీ ఉద్యోగులకు కూడా ఆ తీపి కబురు తప్పక చెబుతారని ఇప్పటివరకు నమ్మారు.. సంవత్సరాల తరబడి ఆలస్యం అవుతున్నందున ఉద్యోగుల్లో ఆ నమ్మకం సన్నగిల్లుతోంది. రాత్రి డ్యూటీలు చేసేందుకు చంటి పిల్ల తల్లులు నానా అవస్థలు పడుతుంటారు… అయినా , ఉద్యోగం చేస్తేనే ఇల్లు గడిచే పరిస్థితులు. అందుకే వారిని ఆ బాధనుండి తప్పించేందుకు కేర్ టేకర్లను నియమించాలని వారు ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తున్నారు.

….పెరిగిన విద్యా ప్రమాణాలు ,సౌకర్యాలు…

కస్తూర్బా గాంధీ విద్యాలయాల్లో గతం కంటే విద్యా ప్రమాణాలు పెరిగాయి విద్యార్థులకు సౌకర్యాలు పెరిగాయి. 2004 నుంచి ఈ విద్యాలయాలు సర్వ శిక్ష అభియాన్ పథకం కిందకు వచ్చాయి వీటిని రాష్ట్ర ప్రభుత్వాలు అధీనంలోకి తీసుకొని నడిపిస్తున్నాయి. కోట్లాను కోట్ల రూపాయలు నిధులు కేటాయించి సొంత భవనాల నిర్మాణాలు , విద్యార్థులకు సన్న బియ్యంతో భోజనం, ఏకరూప దుస్తులు పుస్తకాలు ఇలా తెలంగాణ ప్రభుత్వం ప్రైవేటు కార్పొరేటు హాస్టళ్లకు ధీటుగా వీటిని అభివృద్ధి చేసిందనే చెప్పవచ్చు…
గతంలో కేజీబీవీలో విద్యార్థులను చేర్చుకునేందుకు సిఆర్టి లు గ్రామాలకు వెళ్లి ఇల్లు ఇల్లు తిరిగి విద్యార్థులను తెచ్చుకునేవారు. కానీ ఇప్పుడు కొన్ని కేజీ కేజీబీవీలో సీటు దొరకాలంటే ఎమ్మెల్యే స్థాయి రికమండేషన్లు కూడా విద్యార్థులు తెచ్చుకుంటున్నారు. దీన్నిబట్టి ఈ , సంస్థల్లో విద్యా ప్రమాణాలు , సౌకర్యాలు ఏ స్థాయిలో పెరిగాయో, వేరే చెప్పనక్కరలేదు.
విద్యా ప్రమాణాలు పెరిగేందుకు రేయి పగలు కష్టపడి పనిచేస్తున్న కాంట్రాక్టు టీచర్లు సిబ్బంది జీతాలు మాత్రం పెరగకపోవడం దారుణం.
వారిని రెగ్యులర్ చేయాలని, లేదా సమాన పనికి సమాన వేతనం తప్పనిసరిగా చెల్లించాలని దేశ సర్వోన్నత న్యాయస్థానం , దేశ అభివృద్ధికి దిశా నిర్దేశం చేసే నీతి అయోగ్ సైతం సూచించింది . చట్ట ప్రకారం ఉద్యోగ భద్రత హక్కులు కల్పించాలని ఆదేశించాయి . అయినా పట్టించుకున్న నాథుడు లేడు.. వారి గోడు ప్రభుత్వాలు వినడం లేదు.
రాష్ట్రవ్యాప్తంగా 470 కస్తూరిబా గాంధీ విద్యాలయాలు ఉన్నాయి ఒక్క ఖమ్మం జిల్లాలోనే దాదాపు 14 విద్యాలయాలు జూనియర్ కాలేజీలు ఉన్నాయి. రాష్ట్రవ్యాప్తంగా , వీటితో పాటు , అర్బన్ రెసిడెన్షియల్ స్కూల్స్ కూడా పనిచేస్తున్నాయి . వీటిలో వెనకబడిన తరగతుల బాలురకు విద్య నేర్పిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా , కేజీబీవీ లతో కలిపి విద్యాలయాల్లో మొత్తం సుమారు 15 వేల మంది కాంట్రాక్టు బోధన సిబ్బంది , బోధనేతర సిబ్బంది పనిచేస్తున్నారు. ముఖ్యమంత్రి కెసిఆర్ వీరికి ఉద్యోగ భద్రత కల్పించాలని , లేదా నీసం సమాన పనికి సమాన వేతనం ఇచ్చి ఆదుకోవాలని వారంతా ముక్తకంఠంతో కోరుకుంటున్నారు.. వారి డిమాండ్ల సాధన కోసం గురువారం హైదరాబాదులో ఆందోళన చేపట్టేందుకు నిర్ణయించుకున్నారు..

About the author

Mohiddin Shaik

Leave a Comment