తెలంగాణ రాజకీయం

రైతు చుట్టూ కరెంటు రాజకీయాలు…కాంగ్రెస్ ను విలన్ గా చూపే వ్యూహం..ప్రారంభమైన బీఆర్ఎస్ రైతు సదస్సులు

Written by Mohiddin Shaik

ప్రస్తుత బి ఆర్ ఎస్ రైతు విధానం బాగుందా… కాంగ్రెస్ రైతు విధానం బాగుంటుందా.! బిఆర్ఎస్ తన రైతు విధానాన్ని విస్తృతంగా ప్రచారం చేస్తుందా… లేక కాంగ్రెస్ పార్టీని రైతు పాలిట విలన్ గా చూపించే వ్యూహాన్ని అమలు చేస్తుందా..! 24 గంటలు ఉచిత విద్యుత్ కావాలా… ఎనిమిది గంటలు సరిపోతుందా.! రేవంత్ రెడ్డి మాటలను బిఆర్ఎస్ వక్రీకరించింది నిజమేనా.! రేవంత్ రెడ్డి వ్యాఖ్యల పేరుతో తెలంగాణ సమగ్ర అభివృద్ధి పై చర్చ దారి మళ్లీందంటారా.! ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ పదిమంది కూడిన ఇవే అంశాలపై వాడి వేడిగా చర్చించుకుంటున్నారు.

ఎన్నికలు సమీపిస్తున్న వేళ అతిపెద్ద ఓటు బ్యాంకు కలిగిన రైతు వర్గాన్ని ఆకట్టుకునేందుకు తెలంగాణ రాజకీయ ప్రధాన పార్టీలు నానా అవస్థలు పడుతున్నాయి.
కరెంటు పరిస్థితి మునుపటి కంటే బాగుందని రైతులతో సహా అందరూ భావిస్తున్న తరుణంలో , ఉచిత కరెంటు పై కాంగ్రెస్ చీఫ్ చేసిన వ్యాఖ్యలతో చెలరేగిన దుమారం, ఇంకా కొనసాగుతూనే ఉంది. బిఆర్ఎస్ అధినేత కెసిఆర్ ఆదేశాలతో రైతులను ఆకట్టుకునేందుకు ఈ అంశాన్ని మరింత విస్తృతంగా రైతుల్లోకి తీసుకెళ్లే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.
నేటి నుంచి రాష్ట్రవ్యాప్తంగా , బిఆర్ఎస్ ఆధ్వర్యంలో రైతు వేదికల వద్ద పెద్ద ఎత్తున రైతు సదస్సులు నిర్వహిస్తున్నారు. ఈ సదస్సులు 10 రోజుల పాటు జరగనున్నాయి.
తద్వారా రైతుల కోసం కేసీఆర్ సర్కారు అమలు చేస్తున్న పథకాలను మరో మారు విస్తృతంగా ప్రచారం చేసుకోనుంది. అదే సందర్భంలో కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో , బిజెపి పాలిత రాష్ట్రాల్లో , రైతులకు ఏ విధమైన సహాయ సహకారాలు అందుతున్నాయి, తెలంగాణ రాష్ట్రంలో ఏ విధమైన సౌకర్యాలు సహకారాలు అందుతున్నాయో , రైతులకు విడమరిచి చెప్పనున్నారు.
రాష్ట్రంలో అత్యధిక ఓటు బ్యాంకు కలిగిన రైతు వర్గాన్ని ప్రసన్నం చేసుకుంటేనే మరో మారు తెలంగాణలో గులాబీ జెండా ఎగురవేయడం సాధ్యపడుతుందని గులాబీ బాస్ కు బాగా తెలుసు. అందుకే రైతు దృష్టి కాంగ్రెస్ వైపు మరలకుండా అడ్డుకునేందుకు తమ పార్టీ విధానాలను ఇతర పార్టీల విధానాలతో పోల్చి చెప్పడం ద్వారా, రైతు లోకాన్ని పూర్తిస్థాయిలో ఆకట్టుకునే ప్రయత్నం బి ఆర్ ఎస్ చేస్తోంది.

…… కాంగ్రెస్ ను విలన్ గా చూపే ప్రయత్నం చేస్తున్నారు…

కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి ఏదో సందర్భంలో చేసిన వ్యాఖ్యలను ఆసరా చేసుకొని తమ పార్టీని రైతుల పాలిట విలన్ గా చిత్రీకరించేందుకు బి ఆర్ ఎస్ పార్టీ పకడ్బందీ వ్యూహంతో వ్యవహరిస్తుందని కాంగ్రెస్ పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. ఉచిత కరెంటు, రైతు రుణమాఫీ , కరెంటు బకాయిల రద్దు , రైతులపై కేసుల రద్దు ఇవన్నీ కాంగ్రెస్ హయాంలోనే జరిగాయని ఆ పార్టీ చీఫ్ రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. తాను చేసిన వ్యాఖ్యలను ఉచిత కరెంటు మూడు గంటల ఇస్తామని ప్రకటించినట్లు వక్రీకరించారని 24 గంటలు ఉచిత కరెంటు ఇచ్చేందుకు కాంగ్రెస్ కట్టుబడి ఉందని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. అయినప్పటికీ బిఆర్ఎస్ నేతలు కాంగ్రెస్ ను రైతు వ్యతిరేక పార్టీగా చిత్రీకరించేందుకు నాన అడ్డదారులు తొక్కుతోందని ఆయన ఆరోపించారు. అందుకే రైతులు బి ఆర్ ఎస్ నాయకులు నిర్వహిస్తున్న రైతు సదస్సులోనే నాయకులను గల్లా పట్టి నిలదీయాలని ఆయన రైతులకు బహిరంగ లేఖ రాశారు. రైతు రుణమాఫీ, ధాన్యం డబ్బుల బకాయిలు, వ్యవసాయ సబ్సిడీ పరికరాలు, ధరణి పోర్టల్ తో వచ్చిన ఇబ్బందులు తదితర అంశాలపై రైతు సదస్సులోనే రైతులు తిరగబడాలని , నిలదీసి అడగాలని ఆయన పిలుపునిచ్చారు.

…. ఉచిత విద్యుత్ ఇచ్చింది వైఎస్ఆర్ కాంగ్రెస్, ఇప్పుడున్నది రేవంత్ రెడ్డి కాంగ్రెస్… కేటీఆర్..

ఉచిత విద్యుత్తు వైయస్సార్ హయాంలో ప్రారంభమైంది నిజమేనని , అది రాజశేఖర్ రెడ్డి నాయకత్వం వహించిన కాంగ్రెస్ పార్టీ అని ఇప్పుడున్నది చంద్రబాబు శిష్యుడైన రేవంత్ రెడ్డి కాంగ్రెస్ అని మంత్రి కేటీఆర్ వ్యాఖ్యానించారు. ఈ కాంగ్రెస్ మూడు గంటలు విద్యుత్తు తో సరిపెడుతుందని , రైతులు మూడు గంటల విద్యుత్తు కావాలో మూడు పంటలు పండించేందుకు 24 గంటల ఉచిత విద్యుత్తు కావాలో తేల్చుకోవాలని ఆయన రైతులకు పిలుపునిచ్చారు. మొత్తం మీద ఉచిత విద్యుత్ పై బి ఆర్ ఎస్ భారీ వ్యూహంతో రైతులను కాంగ్రెస్ వైపు వెళ్లకుండా కట్టడి చేసే కార్యక్రమాలకు పదును పెడుతుందని పరిశీలకులు అంటున్నారు.

About the author

Mohiddin Shaik

Leave a Comment