రాజకీయం

కరెంటుతో తల గోక్కోవడం అవసరమా….!రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై తెలంగాణలో కరెంటు మంటలు

Written by Mohiddin Shaik

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రజాదరణ పొందుతుందనే వాతావరణం కనిపిస్తున్న తరుణంలో కరెంటు సరఫరా ఉచిత కరెంటు అంశాలపై మాట్లాడటం అవసరమా…అని కొందరు ప్రశ్నిస్తున్నారు..
గతం కంటే మెరుగైన సేవలు అందిస్తున్న విద్యుత్ శాఖపై గాని , విద్యుత్ సరఫరా, ఉచిత విద్యుత్ అంశాలపై విమర్శలు చేస్తే అది కొరివితో తల గోకున్నట్టేనని కొంతమంది వ్యాఖ్యానిస్తున్నారు. ..
ఆ విమర్శలు ప్రజల్లోకి వెళ్లకపోగా కాంగ్రెస్ పార్టీకే నష్టం తెచ్చి పెట్టే అవకాశాలు ఉన్నాయని కొంతమంది విశ్లేషిస్తున్నారు. కాంగ్రెస్ చీఫ్ రేవంత్ రెడ్డి అమెరికా పర్యటనలో ఉండగా తెలంగాణలో రైతులకు 24 గంటలు ఉచిత కరెంటు ఇస్తున్నామని సీఎం కేసీఆర్ గొప్పలు చెప్పుకుంటున్నారని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. అంతటితో ఆగకుండా రాష్ట్రంలో 95% మూడు ఎకరాలు కలిగిన సన్న , చిన్న కారు రైతులే ఉన్నారని , వారికి మూడు గంటలు ఉచిత కరెంటు ఇస్తే సరిపోతుందని , 24 గంటలు ఉచిత కరెంటు అవసరం లేదని అన్నారు. ఇప్పుడు ఈ వ్యాఖ్యలు తెలంగాణ రాష్ట్రంలో పెద్ద దుమారాన్ని రేపుతున్నాయి. రేవంత్ చేసిన వ్యాఖ్యలను బిఆర్ఎస్ అధినేత కేసిఆర్ తమ పార్టీకి ఉపయోగపడే ఆయుధంగా మలుచుకున్నారు. రేవంత్ వ్యాఖ్యలను బట్టి చూసినప్పుడు కాంగ్రెస్ అధికారంలోకి వస్తే మూడు గంటలు ఉచిత కరెంటు మాత్రమే ఇస్తుందనే విషయం బయటపడింది అంటూ బిఆర్ఎస్ నేతలు రాష్ట్రవ్యాప్త ఆందోళనలకు పిలుపునిచ్చారు..

…. రేవంత్ పై ఘాటు విమర్శలు , చేసిన మంత్రులు పువ్వాడ , జగదీష్ రెడ్డి….

రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు ఆసరా చేసుకుని , రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ , విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి మాట్లాడుతూ కరెంటు విషయంలో రైతులకు, కాంగ్రెస్ చేయబోయే అన్యాయం కుట్రను రేవంత్ రెడ్డి బయట పెట్టారని, రేవంత్ చంద్రబాబు శిష్యుడని వ్యాఖ్యానించారు. చంద్రబాబు హయాంలో విద్యుత్ కోసం జనం తిరగబడితే బషీర్బాగులో జరిగిన కాల్పుల ఘటన తెలంగాణ ప్రజలకు ఇంకా గుర్తుందని వారు వేరువేరుగా స్పందిస్తూ పేర్కొన్నారు. రేవంత్ రెడ్డి యాదృచ్ఛికంగా ఈ మాటలు అని ఉండరని పేర్కొన్నారు. రేవంత్ ప్రతి విషయం రాహుల్ గాంధీ అనుమతితోనే మాట్లాడతారని పేర్కొన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రైతులకు మూడు గంటలు ఉచిత విద్యుత్తు ఇస్తారనే విషయాన్ని బయట పెట్టాడని అన్నారు. గతంలో 6 గంటల విద్యుత్తు ఉచితంగా ఇస్తే రైతులకు సరిపోనందునే పెద్ద ఎత్తున ఆందోళనలు చేసిన విషయాన్ని వారు గుర్తు చేశారు . ఇప్పుడు మూడు గంటలు ఇస్తే సరిపోతుందని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించడం కచ్చితంగా , రైతులకు అన్యాయం చేయడమే అని అన్నారు.

రేవంత్ రెడ్డి వ్యాఖ్యలతో వివరణ ఇచ్చుకుంటున్న కాంగ్రెస్ నేతలు..

రేవంత్ రెడ్డి ఆ వ్యాఖ్యలు, పై కాంగ్రెస్ నాయకులు సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.
కాంగ్రెస్ అధికారంలోకి వస్తే 24 గంటలు ఉచిత విద్యుత్ ఇస్తామని దేశంలో ఎక్కడా ఉచిత విద్యుత్ ఇవ్వని రోజుల్లోనే వైయస్ రాజశేఖర్ రెడ్డి , ఇచ్చారని కోమటిరెడ్డి వెంకటరెడ్డి మీడియాకు వివరించారు ..
రేవంత్ రెడ్డి ఏ సందర్భంలో ఆ మాట అన్నారు కానీ అది కాంగ్రెస్ అధిష్టానం మాట కాదని , దీన్ని రాద్దాంతం చేయాల్సిన అవసరం లేదంటూ ఆయన వ్యాఖ్యానించారు.

. అమెరికాలో రేవంత్ చేస్తున్న వ్యాఖ్యలు ఇటీవల వివాదాస్పదం

రేవంత్ రెడ్డి అమెరికా పర్యటనలు ఉండి మీడియా ముందు చేస్తున్న కొన్ని వ్యాఖ్యలు ఇటీవల వివాదాస్పదం అవ్వడంతో పాటు మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఇటీవల ఒక సందర్భంలో సీతక్క తెలంగాణకు ముఖ్యమంత్రి కూడా కావచ్చు అని చేసిన వ్యాఖ్య రాజకీయ వర్గాల్లో కాంగ్రెస్ వర్గాల్లో కూడా తీవ్ర చర్చనీయాంశం అయింది. ఈ అంశంపై కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ ట్రైబల్ వర్గానికి చెందిన వ్యక్తి ముఖ్యమంత్రి కావాలంటే సీతక్కే ఎందుకు కావాలి? పో దెం వీరయ్య సీనియర్ నాయకుడుగా ఉన్నారు. ఆయన కూడా కావచ్చు, అని అంతటితో ఆగకుండా దళితుడు ముఖ్యమంత్రి కావాలని అందుకు రాష్ట్రంలో భట్టి విక్రమార్క , దామోదర రాజనర్సింహ ఇద్దరిలో ఎవరో ఒకరిని ముఖ్యమంత్రిని చేయొచ్చని వ్యాఖ్యానించారు . ఆ అంశం అలా ఉండగా బుధవారం మూడు ఎకరాల రైతులకు
ఉచిత విద్యుత్ పై చేసిన వ్యాఖ్యలు బి ఆర్ ఎస్ అధినేత ముఖ్యమంత్రి కేసీఆర్ ఆయుధంగా మలుచుకొని పెద్ద ఎత్తున రాద్ధాంతం చేసే పనిలో పడ్డారు .
రేవంత్ రెడ్డి , కాంగ్రెస్ దిష్టిబొమ్మలను రాష్ట్రవ్యాప్తంగా దగ్ధం చేసే కార్యక్రమానికి ఆ పార్టీ పిలుపునిచ్చింది. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే మూడు గంటల విద్యుత్ ఇస్తారని పెద్ద ఎత్తున ప్రచారానికి తెర లేపింది . దీనిపై కాంగ్రెస్ నాయకులు వివరణ ఇచ్చుకోవడంతోపాటు మేము అలా అనలేదు, మా ఉద్దేశం అది కాదు, మేము ఖచ్చితంగా 24 గంటలు ఉచిత కరెంటు ఇవ్వడానికి కట్టుబడి ఉన్నాం , అంటూ మరో మారు ప్రజలకు నమ్మకం కలిగించే ప్రకటనలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది . రేవంత్ రెడ్డి వ్యాఖ్యలతో గులాబీ పార్టీకి కాంగ్రెస్ను ఇరుకుని పెట్టేందుకు అవకాశం దొరికిందని కొందరు విశ్లేషిస్తున్నారు.

About the author

Mohiddin Shaik

Leave a Comment