ఒక బచ్చగాడిని పెట్టి పువ్వాడను ఓడిస్తాం.
అగ్గి రాజేసిన మాటల యుద్ధం

ఖమ్మం జిల్లా రాజకీయాల్లో నువ్వు ఒక బచ్చవి నీకు ఒక సిద్ధాంతం లేదు .. విలువలేదు గుణం లేదు… కాసేపు ఆ పార్టీ అంటావు.. కాసేపు ఈ పార్టీ అంటావు… సొంత పార్టీ అంటావ్.. చివరికి జై కాంగ్రెస్ అన్నట్లు అయింది నీ పని… నువ్వు కేసీఆర్ ని ఓడిస్తావా.. కూటిలో రాయి తీయనోడు , ఏటిలో రాయి తీస్తాడా..! ముందు నువ్వు గెలువు అంటూ రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పొంగిలేటి శ్రీనివాసరెడ్డి వ్యాఖ్యలకు కౌంటర్ ఎటాక్ చేశారు.. అంతటితో ఆగలేదు ఖమ్మం జిల్లాది ఘనమైన రాజకీయ చరిత్ర ఆ చరిత్ర నుంచి పుట్టినోడే పువ్వాడ …ఆ పువ్వాడకు పుట్టినోడే ఈ పువ్వాడ.. నువ్వు ఒక ఎండుటాకులాంటోడివి ఏ గాలికి ఎటు ఎగిరి పోతావు తెలియదు.. అంటూ ఘాటుగా స్పందించారు. సోమవారం మీడియా సమావేశంలో మంత్రి అజయ్ కుమార్ చేసిన ఈ వ్యాఖ్యలు రాజకీయంగా కాక రేపుతున్నాయి..
ఆదివారం ఆత్మీయ సమ్మేళనంలో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చేసిన ఘాటు వ్యాఖ్యలు మంత్రితో సహా టిఆర్ఎస్ అగ్ర నేతలకు సైతం ఆగ్రహం తెప్పించాయి. మంత్రిని ఉద్దేశించి పొంగులేటి మాట్లాడుతూ …అజయ్ ని ఓడించడానికి శీనన్న అక్కరలేదు , ఒక బచ్చా గాడిని పెట్టి ఓడిస్తాం.. మంత్రి అనుచరుల ఆగడాలు ఎక్కువయ్యాయి, ఖమ్మం చుట్టూ ఉన్న మట్టి కొండలను కూడా విడిచిపెట్టడం లేదు.. కెసిఆర్ నీకు రెండుసార్లు ప్రజలు అవకాశం ఇచ్చారు ఇక చాలు. ప్రజలు ప్రజారంజకమైన పాలన కోరుకుంటున్నారు. అంటూ వ్యాఖ్యలు చేశారు ఆ వ్యాఖ్యలకు కౌంటర్ గా మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ సోమవారం రెట్టింపు స్థాయిలో ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఒక విధంగా ఆ ఇద్దరి మధ్య మాటల యుద్ధమే జరిగింది. ఆ యుద్ధం ఖమ్మం జిల్లా రాజకీయాల్లో అగ్గి రాజేసింది.
…… పొంగులేటి కాంగ్రెస్లో చేరిక ఖాయమే..!
పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఖమ్మం జిల్లా నుంచి పది సీట్లలో ఒక్కరిని కూడా బి ఆర్ఎస్ తరఫున గెలవనివ్వనని , అసెంబ్లీ గేటు తాకనివ్వనని తాను గతంలో చేసిన ప్రతిజ్ఞకు ఇప్పటికీ కట్టుబడి ఉన్నానని పునరుద్ఘాటించారు. అదే సందర్భంలో తమ కార్యకర్తలపై తప్పుడు కేసులు పెడుతున్న పోలీసులు ఇతర అధికారులపై తమ ప్రభుత్వం వచ్చాక చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ హెచ్చరిక ద్వారా కాంగ్రెస్ లో చేరిక దాదాపు ఖాయమైనట్లేననే సంకేతాలు , తమ క్యాడర్ కి ఇచ్చినట్లేనని కొందరు అంటున్నారు.
