జిల్లా కలెక్టర్ వి పి గౌతమ్
ఖమ్మం, మే 20: ప్రభుత్వ స్థలాల్లో నివాసం ఏర్పరచుకున్న వారికి జీవో 59 ద్వారా ప్రభుత్వం చేపట్టిన క్రమబద్ధీకరణ ప్రక్రియను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ అన్నారు. శనివారం కలెక్టర్ సత్తుపల్లి లోని జలగం నగర్, జవహర్ నగర్, ద్వారాకాపుడి కాలనీల్లో పర్యటించి, జీవో 59 దరఖాస్తుదారులకు డిమాండ్ చెల్లింపుపై అవగాహన కల్పించారు. క్రమబద్ధీకరణ తో చేకూరే ప్రయోజనాల గురించి వారికి వివరించారు. ప్రభుత్వం మంచి అవకాశం కల్పించిందని, ఈ అవకాశాన్ని కోల్పోతే నష్టపోతారని వారికి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జీవో 59 క్రింద కల్లూరు డివిజన్ లో 1,361 దరఖాస్తులను ఆమోదించినట్లు ఆయన తెలిపారు. ఇట్టి దరఖాస్తుదారులకు క్రమబద్ధీకరణ చేసి, పట్టాలు జారికిగాను ప్రభుత్వ కనీస భూ ధర చెల్లింపుకు డిమాండ్ జారిచేయుట జరిగినదని ఆయన అన్నారు. డిమాండ్ మేరకు చెల్లింపులు చేసి, ప్రభుత్వం కల్పించిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. చెల్లింపులు చేసిన వారికి క్రమబద్ధీకరణ చేసి, పట్టాల జారిచేయుట జరుగుతుందన్నారు. క్రమబద్ధీకరణతో సర్వ హక్కులు వస్తాయన్నారు. బ్యాంకర్లు నిర్మాణాలు తదితర అవసరాలకు ఋణాలు అందజేస్తారన్నారు. అధికారులు క్షేత్రస్థాయిలో సందర్శించి డిమాండ్ చెల్లింపుపై అవగాహన కల్పించాలన్నారు. సంబంధిత తహసీల్దార్, మునిసిపల్ కమిషనర్లు సంయుక్తంగా క్షేత్ర సందర్శన చేయాలని, డిమాండ్ వసూళ్లపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. అనధికారికంగా ప్రభుత్వ స్థలాల్లో ఉంటున్న వారికి ప్రభుత్వం మంచి అవకాశం కల్పించిందని ఇట్టి అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని వెంటనే క్రమబద్దీకరణ చేసుకోవాలన్నారు. డిమాండ్ చెల్లించకుండా అనధికారికంగా ప్రభుత్వ స్థలాల్లో ఉన్న వారిపై తగు చర్యలు చేపట్టనున్నట్లు ఆయన తెలిపారు.
కలెక్టర్ పర్యటన సందర్భంగా కల్లూరు ఆర్డీవో సిహెచ్. సూర్యనారాయణ, సత్తుపల్లి తహసీల్దార్ శ్రీనివాసరావు, కమీషనర్ సుజాత, ఎంపిడిఓ సుభాషిణి, అధికారులు తదితరులు ఉన్నారు.
