ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాజకీయం

కృష్ణ… కృష్ణ….! ఏమిటయ్యా.. నీ లీల ఎన్టీఆర్ కృష్ణుడి విగ్రహం పై ఎడతెగని రభస.

Written by Mohiddin Shaik

కృష్ణయ్య… ఏమిటయ్యా నీ లీల… ప్రపంచ తెలుగు భక్తుల దృష్టిని మరోసారి ఇలా ఆకర్షిస్తున్నావా…!

నీ వేషధారణలో ఉన్న ఎన్టీఆర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయకుండా అడ్డుకొని తీరుతామని కొన్ని హిందూ సంఘాలు శబదం చేస్తున్నాయి. … ఎన్టీఆర్ నీ రూపంతో పాటుగా రాముడు విష్ణువు ఇత్యాది దేవుళ్ళ రూపాలన్ని ధరించి నటించడాన్ని ప్రపంచ తెలుగు ప్రజలంతా కొన్ని దశాబ్దాల పాటు చూశారు. చూసి భక్తి పారవశ్యంలో మునిగి తేలారు. అంతెందుకు లక్షలాదిమంది తెలుగువారి ఇండ్లలో ఆయన ధరించిన దేవుళ్ళ ఫోటోలు ఇప్పటికీ ఉన్నాయి ..అందుకే లక్షలాదిమంది పర్యాటకులు వచ్చే చోట లకారం చెరువు మధ్యలో నీ రూపాన్ని ధరించిన ఎన్టీఆర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ తో సహా అనేకమంది ప్రవాస తెలుగు భక్తులు నిర్ణయించారు. ప్రభుత్వ అనుమతితో సకల ఏర్పాట్లు చేశారు. ఎన్టీఆర్ శ్రీకృష్ణుని రూపంలో ఉన్న విగ్రహ ఏర్పాటుకు సంబంధించి నమూనా చిత్రాలతో సహా కొన్ని నెలలుగా వివిధ మాధ్యమాల్లో ప్రచారం కూడా జరిగింది. కానీ ఈ విగ్రహ ఏర్పాటుపై అంతకుముందు ఏ హిందూ సంఘం కానీ ,కుల సంఘాలు కానీ అభ్యంతరం చెప్పిన దాఖలాలు లేవు. కానీ ఈ నెల 28న ఎన్టీఆర్ మనవడు జూనియర్ ఎన్టీఆర్ చేతులమీదుగా విగ్రహ ఆవిష్కరణ చేసేందుకు సన్నాహాలు చేస్తుండగా హిందూ సంఘాలుగా భావిస్తున్న కొందరు విగ్రహ ఏర్పాటును అడ్డుకొని తీరుతామని పోరాటానికి దిగారు. ఎన్టీఆర్ కృష్ణుడి రూపంలో ఉండడాన్ని వారు వ్యతిరేకిస్తున్నారు. కృష్ణుడు యాదవుడని వేరే కులం వ్యక్తి ఆయన రూపంలో ఉంటే యాదవుల మనోభావాలు దెబ్బతింటాయంటూ ఆందోళనకు దిగారు. లక్షలాదిమంది నీ భక్తులకు ఎన్టీఆర్ అభిమానులకు ఆనందాన్ని పంచాలని మంచి ఉద్దేశంతో ఈ ప్రదేశంలో 50 అడుగుల నిలువెత్తు విగ్రహాన్ని మంత్రి చొరవతో ఏర్పాటు చేయాలనుకుంటే, అనుకోకుండా కొన్ని కుల సంఘాలు హిందూ సంఘాలంటూ ఆందోళనలకు దిగారు.

…..ఇది కృష్ణుడి వేషధారణలో ఉన్న , సాదాసీదా విగ్రహం మాత్రమే. .. దీన్ని ఏర్పాటు చేసేది లకారం చెరువు మధ్యలో. … ఇక్కడ జరిగేది దేవుడు గుడిలో విగ్రహ ప్రతిష్ట కాదు. .. దీన్ని ఏ వేద పండితులో ఏ బ్రహ్మజ్ఞాన మఠాధిపతులు, పీఠాధిపతులు ప్రతిష్టాపన చేయడం లేదు. … ఈ విగ్రహాన్ని జూనియర్ ఎన్టీఆర్ చేతులు మీదుగా ఆవిష్కరిస్తున్నారు .

కానీ విగ్రహ ఏర్పాటును అడ్డుకుంటామంటున్నా సంఘాలు మాత్రం యాదవుడైన శ్రీకృష్ణ భగవానుని ఎన్టీఆర్ విగ్రహం ద్వారా ఏ కులానికి చెందిన వాడుగా చూపించబోతున్నారని ప్రశ్నిస్తున్నారు. శ్రీకృష్ణునికి అవమానం జరుగుతోందని ,యాదవ కులస్తుల మనోభావాలు దెబ్బతిన్నయని వారు వాదిస్తున్నారు.
సర్వాంతర్యామిగా భావించే నీకు కులాలను అంటగట్టి, సకల జీవరాసులకు నీవే దేవుడు అనే భావన నుంచి నీవు కేవలం యాదవుల దేవుడు అనే భావనల తో నిన్ను కొందరు మాత్రమే సొంతం చేసుకుంటున్నారు. మానవజాతి సమస్తం నిన్ను సొంతం చేసుకొని ఆరాధించాలని నీ విశాలమైన భావనలకు ఇది పూర్తిగా విరుద్ధం. కానీ ఇప్పుడు ఖమ్మంలో నీ భక్తుల్లో , ఈ భావనే అలజడి రేపుతోంది. నీ రూపంలో ఉన్న ఎన్టీఆర్ విగ్రహ ఏర్పాటును అడ్డుకునేందుకు పెద్ద ఎత్తున రభస జరుగుతోంది. ఎన్టీఆర్ అంటే ప్రపంచ తెలుగు ప్రజల ఆత్మగౌరవ ప్రతీక , తెలుగు వాడి గుండెల్లో రాముడిగా , కృష్ణుడిగా ,శివునిగా , ఇత్యాది దేవతల రూపాల్లో గుడి కట్టుకున్న అసమాన్యమైన వ్యక్తి అని నీకు తెలుసు . అయినా, ఆయన కూడా మనిషే. .. అందుకే నీ వేషధారణలో ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేయడం ద్వారా , ఇటు నీ భక్తులకు నయనానందం కలిగించటంతో పాటు, ఆయన అభిమానులకు కూడా ఆనందాన్ని ఇవ్వాలని, మంత్రి పువ్వాడ ఈ ఏర్పాటుకు నిర్ణయించారని తెలుస్తోంది. కొన్ని నెలలుగా ఈ విగ్రహం ఏర్పాటుపై వస్తున్న వార్తలను చూసి స్పందించని ఆయా సంఘాలు విగ్రహ ఆవిష్కరణ సమయంలో అడ్డుపడుతుండడం విశేషం. న్యాయస్థానానికి వెళ్లారు వారి అభ్యంతరాలను దృష్టిలో పెట్టుకొని న్యాయస్థానం తాత్కాలికంగా ఏర్పాటును ఆపమన్నది. దానిపై స్పందించిన నిర్వాహకులు ఆయా అభ్యంతరాల మేరకు విగ్రహానికి కొన్ని మార్పులు చేసి ఏర్పాటు చేస్తామంటే దాన్ని కూడా అడ్డుకొని తీరుతామంటూ హిందూ సంఘాలుగా చెప్పుకునే కొందరు ప్రకటించారు. ఖమ్మం నగరంలో మురికి కోపంగా ఉన్న లకారం చెరువును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్ది పర్యాటక క్షేత్రంగా మార్చిన మంత్రి , ఇక్కడ ఈ విగ్రహ ఏర్పాటు మంచి ఉద్దేశంతో చేశానని చెబుతున్నారు. విగ్రహ ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నది నీ భక్తులే, దాన్ని అడ్డుకొని తీరుతామంటూ పోరాటాలు చేస్తున్నది నీ భక్తులే. .. ఇందులో ఎవరి భక్తి వెనుక ఏ ప్రయోజనం దాగి ఉందో సర్వాంతరయామి అయిన నీకు తెలిసినంతగా వేరే ఎవరికీ తెలియదు. ఒక మంచి ఉద్దేశంతో తలపెట్టిన ఈ కార్యాన్ని నిర్విఘ్నంగా పూర్తి చేయాలని కోరుకుంటున్నారు ….నీట ముంచుతావో, భక్తుల పాలముంచుతావో, నిర్ణయం నీదే…

………….By, మొహిద్దిన్

About the author

Mohiddin Shaik

Leave a Comment