తెలంగాణ రాజకీయం

కలవర పెడుతున్న కర్ణాటక ఫలితాలు…!

Written by Mohiddin Shaik

ఫిరాయింపు ఎమ్మెల్యేల గుండెల్లో దడ.

హస్తం గుర్తుపై గెలిచి ఆ తర్వాత గులాబీ కండువా కప్పుకున్న ఫిరాయింపు ఎమ్మెల్యేలను కర్ణాటక ఫలితాలు కలవరపెడుతున్నాయా..! అక్కడ కాంగ్రెస్ నుంచి పార్టీ ఫిరాయించి కాషాయం కండువా కప్పుకున్న వారందరినీ కర్ణాటక ఓటర్లు చిత్తుచిత్తుగా ఓడించి ఇంటికి సాగనంపారు. రాబోయే ఎన్నికల్లో తెలంగాణలో కూడా అలాంటి పరిస్థితి ఏర్పడదనే గ్యారెంటీ ఏమీ లేదనే చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతోంది. కర్ణాటకలో 14 మంది కాంగ్రెస్ పక్షాన బిజెపిపై విజయం సాధించి ఆ తర్వాత కమలం ఆకర్షణ పథకంలో భాగంగా వారంతా కమలం పార్టీలో చేరి పోయారు. కాగా వారందరికీ మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కమలం పార్టీ టిక్కెట్లు ఇచ్చి ఎన్నికల్లో నిలబెట్టింది . ఈసారి కమలం గుర్తుపై వారంతా పోటీ చేశారు. కాగా వారందరినీ కర్ణాటక ఓటర్లు చిత్తుచిత్తుగా ఓడించారు. ఇది ఇలా ఉండగా గత ఎన్నికల్లో తెలంగాణలో కూడా హస్తం పార్టీపై విజయం సాధించిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు దాదాపు 13 మంది గులాబి పార్టీలో చేరిపోయారు. కాంగ్రెస్ కార్యకర్తలు ఎన్నికల సందర్భంగా అనేక ప్రయాసలు కూర్చి అనేక కేసులను లాటి దెబ్బలను ఎదుర్కొని తమ పార్టీ అభ్యర్థులను గెలిపించారు. విజయోత్సవాలు జరుపుకున్న కొద్దిరోజులకే హస్తం గుర్తుపై గెలిచిన ఆ ఎమ్మెల్యేలు 13 మంది టిఆర్ఎస్ కండువాలు కప్పుకున్నారు . దాంతో ఆయా నియోజకవర్గాల్లోని కాంగ్రెస్ కార్యకర్తలు పెద్ద ఎత్తున ఆందోళనలు నిర్వహించిన విషయం తెలిసిందే. స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంలో అదే ఎమ్మెల్యేలు కారు గుర్తుకు ఓటు వేయమని అడిగేందుకు వచ్చినప్పుడు అనేకచోట్ల కాంగ్రెస్ కార్యకర్తలు వారిపై దాడులకు దిగిన సంఘటనలు కూడా చూశాం. పలుచోట్ల అదే ఎమ్మెల్యేలపై చెప్పులు విసిరిన సంఘటనలు కూడా చూసాం. కాలక్రమేణా ఆయా ఎమ్మెల్యేలపై ఆగ్రహం కొంత తగినట్లు కనిపిస్తున్నప్పటికీ తిరిగి మళ్లీ వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో , ఆయా సిట్టింగ్ ఎమ్మెల్యేలు అందరికీ బి ఆర్ ఎస్ టికెట్లు ఇచ్చినట్లయితే వారిని నిజాయితీ గల నాయకులుగా ఓటర్లు గుర్తించి గెలిపిస్తారా, లేక కర్ణాటకలో మాదిరి ఓడించి ఇంటికి పంపిస్తారా అనే అంశంపై

రాజకీయ , వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోనే నలుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు పార్టీని ఫిరాయించి బిఆర్ఎస్ లో చేరగా , ఇద్దరు తెలుగుదేశం పార్టీ పక్షాన గెలిచిన శాసనసభ్యులు పార్టీ ఫిరాయించారు. కాంగ్రెస్ నుంచి పాలేరు, ఇల్లందు , కొత్తగూడెం , పినపాక నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు గా గెలిచి బిఆర్ఎస్ చేరిన విషయం తెలిసిందే. ఇది ఇలా ఉండగా అశ్వరావు పేట సత్తుపల్లి నియోజకవర్గాల నుంచి తెలుగుదేశం పార్టీ తరఫున గెలిచిన ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించగా, వైరా నుంచి విజయం సాధించిన స్వతంత్ర అభ్యర్థి బి ఆర్ ఎస్ లో చేరారు. ఒక పార్టీ గుర్తుపై గెలిచి అధికార పార్టీలో చేరిన వీరందరిలోనూ కర్ణాటక ఫలితాలు ఒక విధంగా ఆందోళన కలిగిస్తున్నాయని పలువురు అంటున్నారు. పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల పట్ల కర్ణాటక ప్రజలు ఇచ్చిన తీర్పును ప్రజాస్వామ్యవాదులు స్వాగతించటంతో పాటు కర్ణాటక ఓటర్లను అభినందిస్తున్న వార్తలను చూస్తున్నాం . అదే సందర్భంలో అధికారం కోసం అర్రులు చాచిన ఎమ్మెల్యేలకు కర్ణాటక ఓటర్లు సరైన సమయంలో కర్రు కాల్చి వాత పెట్టారని కొందరు వ్యాఖ్యానిస్తున్నారు. మొత్తం మీద కర్ణాటక ఫలితాలు తెలంగాణలోని ఫిరాయింపు ఎమ్మెల్యేల గుండెల్లో అలజడి రేపుతున్నాయి అనే చర్చ సర్వత్ర జరుగుతోంది.
……………………………
By మొహిద్దిన్

About the author

Mohiddin Shaik

Leave a Comment