తెలంగాణ

స్వచ్ఛమైన పసి మనసు…

Written by Mohiddin Shaik

ప్రేమ తత్వమే దైవిక గుణం

కల్మషం ఎరుగని పసి మనసులో అంతులేని ప్రేమ కనిపించింది…
స్నేహం గట్టిగా పెనవేసుకున్నాక నరుడు అయితే నేమి, వానరుడైతేనేమి అన్నట్లుంది ఆ పసివాడి ఆనందం… వాడితో ఆడుకునేది వాడి తమ్ముడు , అన్నో , ..కాదు వాడిలాగే అల్లరి చేసే ఓ కోతి పిల్ల..

ఒక ట్రైన్ లో ఓ మూడేళ్ల పసివాడు ఒక కోతి పిల్లను తన ఒడిలో కూర్చో పెట్టుకున్నాడు. అంతటితో ఆగలేదు ఆ కోతి పిల్లతో ఆటలాడుతూ దాని మూతిని తన రెండు చేతులతో గట్టిగా పట్టుకొని ముద్దు పెట్టాడు. . అలా ఒక్కసారి కాదు అనేకసార్లు చేశాడు. ఆ తరువాత దాన్ని తన ఒడిలో కూర్చోబెట్టుకొని ఆడుకుంటున్నాడు. ఆ కోతి పిల్ల కూడా నదురు బెదురు లేకుండా అచ్చం తన స్నేహితుడితో హాయిగా ఆడుకుంటుంది. ఆ దృశ్యం చూసినప్పుడు ఫోటో తీయాలనిపించింది. ఆ పసివాడు ఎవరంటే .. ఆ కోతిని ఆడిస్తూ చిన్నచిన్న వీధి ప్రదర్శనలు చేసే సంచార , జాతి కుటుంబానికి చెందిన వాడు. ఆ బాలుడిని చూసినప్పుడు వాడిలో ఆ కోతిపై ఉన్న నిండైన ప్రేమ కనిపించింది. అదే సందర్భంలో వాడి పక్కనే ఉన్న తల్లి తండ్రి స్థితిని చూసినప్పుడు వారు అనుభవిస్తున్న దుర్భర దారిద్రం కనిపించింది. ఈ పిల్లవాడికి ఆ కోతి పిల్లకి మధ్య ఉన్న స్నేహ బంధానికి అసలు కారణం ఆకలి. ఆ కోతి పిల్లను ఆడిస్తేనే ఆ కుటుంబం ఆకలి తీరుతుంది, వారు చెప్పినట్లు ప్రదర్శనలో ఆడితేనే ఆ కోతి పిల్లకు ఆకలి తీరుతుంది. ఆ ఇద్దరి మధ్య నర , వానర , భేదం ఉన్నప్పటికీ, ఆకలి మాత్రం ఇద్దరిదీ ఒక్కటే. ఇటువంటి దరిద్ర నారాయణులను ఉద్ధరించే పేరుతో భారత సర్కారు కేటాయిస్తున్న కోటానుకోట్లు వీరి చీకటి బతుకుల్లో వెలుగు రేఖలు ఇంకెన్నేళ్లకు నింపుతాయో చెప్పడం ఎవరికి సాధ్యం కాకపోవచ్చు.
……….
By మొహిద్దిన్, సీనియర్ జర్నలిస్ట్. 9441087659

About the author

Mohiddin Shaik

Leave a Comment