బి ఆర్ ఎస్ బహిష్కృత నేత మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి తో బిజెపి పెద్దలు భేటీ కానున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. ఢిల్లీ టీం చేరికల కమిటీ తో కలసి ఖమ్మం చేరుకొని ఆయనతో మాట్లాడి పార్టీలోకి ఆహ్వానిస్తారని సమాచారం . అయితే పొంగులేటి బిజెపిలో చేరిపోతారా , లేక చేరిక విషయంలో తేల్చి చెప్పేందుకు మరికొంత సమయం తీసుకుంటారా, అనే అంశంపై భేటీ తర్వాతనే స్పష్టత వచ్చే అవకాశం ఉంది. పొంగులేటి చేరిక విషయంలో ఎటువంటి హామీ లేకుండానే ఢిల్లీ నుంచి బిజెపి పెద్దలు వస్తున్నారా ,..లేక హామీ తీసుకునే వస్తున్నారా, అనే అంశంపై కూడా స్పష్టత లేదు . పొంగులేటి ఏ పార్టీలో చేరతారనే అంశంపై కర్ణాటక ఎన్నికల ఫలితాల తర్వాత స్పష్టమైన నిర్ణయం తీసుకుంటారనే అభిప్రాయాలు ఉన్నాయి. కర్ణాటక ఎన్నికల ఫలితాలు బిజెపికి అనుకూలంగా రాకపోతే , పొంగులేటి చేజారిపోతారనే అభిప్రాయంతోనే బిజెపి పెద్దలు వ్యూహాత్మకంగా ముందస్తుగా భేటీ అవుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. శ్రీనివాసరెడ్డి ఏ పార్టీలో చేరుతారు అనే అంశంపై రాష్ట్ర రాజకీయ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చోప చర్చలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఇటీవల ఆయన ఖమ్మం జిల్లాలో రాజకీయంగా చేసిన ప్రతిజ్ఞ రాజకీయ వర్గాల్లో సంచలనంగా మారింది. ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి బి ఆర్ ఎస్ తరఫున ఒక్క ఎమ్మెల్యే ని కూడా అసెంబ్లీ గేటు తాకనివ్వనని ఆయన ప్రతిజ్ఞ చేసిన విషయం తెలిసిందే. ఆ ప్రతిజ్ఞ చేసిన తరువాత ఆయన దాన్ని నెరవేర్చుకోవాలంటే కచ్చితంగా కాంగ్రెస్ వైపే అడుగులు వేయాల్సి వస్తుందని అనేకమంది విశ్లేషకులు భావించారు. అదే తరుణంలో ఆయనను రాహుల్ టీం కలుస్తుందని ఆ తర్వాత ఆయన ప్రియాంక గాంధీ సమక్షంలో కాంగ్రెస్లో చేరుతారు అంటూ కూడా ప్రచారం జరిగింది. ఇది ఇలా ఉంటే ఇప్పుడు తాజాగా బిజెపి కేంద్ర అధినాయకత్వమే ప్రత్యేక బృందాన్ని పొంగిలేటితో చర్చించేందుకు పంపిస్తున్నట్లు వార్తలు తెరపైకి రావడంతో మరోమారు విస్తృత చర్చకు చెరలేచింది . బిజెపి అధినాయకత్వం పంపిన ప్రతినిధులతో మాట్లాడినంత మాత్రాన అప్పుడే ఆయన బిజెపిలో చేరిపోతారని చెప్పడం కూడా కష్టమే.
కానీ బిజెపి ఢిల్లీ నేతలతో భేటీకి ఆయన అవకాశం ఇచ్చినందున బిజెపి వైపు వెళ్లరనే గ్యారెంటీ లేదనే అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి.
…… రేణుక చౌదరి , వ్యాఖ్యలు వ్యూహాత్మక మా. ।
పొంగులేటి శ్రీనివాసరెడ్డి కాంగ్రెస్లో చేరతారనే ప్రచారంపై రేణుకా చౌదరి చేసిన వ్యాఖ్యలు పొంగులేటి వర్గంలో తీవ్ర అసహనాన్ని కలిగించిందని ప్రచారం జరుగుతోంది. శ్రీనివాసరెడ్డిని తక్కువ చేసి మాజీ కేంద్రమంత్రి రేణుకా చౌదరి యుహాత్మకంగానే కొన్ని వ్యాఖ్యలు చేశారని పొంగులేటి వర్గీయులు కొందరు అంటున్నారు. అందుకే రేణుక చౌదరి వ్యాఖ్యల తర్వాతనే బిజెపి నాయకులు పొంగిలేటితో భేటీకి వచ్చే అవకాశం ఏర్పడిందని చర్చ కూడా ఆయా వర్గాల్లో జరుగుతోంది. రేణుక చౌదరి నిజంగానే పొంగులేటి కాంగ్రెస్లోకి రావడం ఇష్టం లేక అడ్డుకునే ప్రయత్నంలో భాగంగానే ఆయనను రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు చేశారా. .? అది నిజమైతే మరి పొంగులేటి కూడా వ్యూహాత్మకంగానే తెలివైన నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. గత ఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీ తనకు ఎంపీ టికెట్ నిరాకరించినప్పుడే స్వతంత్ర అభ్యర్థిగా నైనా పోటీ చేసి ఉండాల్సిందని అలా చేయకుండా పొంగులేటి రాజకీయంగా తప్పు చేశారనే అభిప్రాయం ఆయన వర్గీయులు ఉంది. కాగా ఇప్పుడు కీలకమైన నిర్ణయం తీసుకునే సమయం ఆసన్నమైనందున తన రాజకీయ భవిష్యత్తుకు సంబంధించిన నిర్ణయం కాబట్టి దానిపై ఆచితూచి అడుగులు వేయాలని ఇప్పుడు తీసుకునే నిర్ణయం మరో చారిత్రక తప్పిదం కాకూడదని పొంగులేటి అభిమానులు, ఆయన వర్గీయులు కోరుకుంటున్నారు మొత్తం మీద ఆయన చేసిన ప్రతిజ్ఞ నెరవేర్చుకోవడానికి ప్రాధాన్యతనిచ్చి అడుగులు వేస్తారా, లేక బిజెపి వైపు అడుగులు వేస్తారా, అనే విషయం పై స్పష్టత రావాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే.
……………………………….
మొహిద్దిన్
