తెలంగాణ రాజకీయం

ఏకతాటిపైకి ఎర్రసైన్యం…

Written by Mohiddin Shaik

ఈనెల 9 న సిపిఐ సిపిఎం ఐక్య సభ.
హాజరుకానున్న ఇరు పార్టీల అతిరథ మహారధులు

సిపిఐ సిపిఎం ఈ రెండు వామపక్షాలు ఏకతాటిపై నిలిచి ఐక్యంగా పోరాటాలు చేయటం సాధ్యమేనా…! ఒకే మాట ఒకే బాటగా సింగిల్ ఏజెండా కార్యక్రమాలతో కలిసి ఉద్యమాలు నిజంగానే చేస్తారా అంటే చేస్తామని చేసి తీరుతామని పద్ధతిలో ఆ రెండు పార్టీల నేతలు ఉమ్మడి కార్యాచరణను రూపొందిస్తున్నారు…
ఇది ఒక చారిత్రక పరిణామంగా పరిశీలకులు భావిస్తున్నారు.

ఒకే సిద్ధాంతంతో రెండుగా విడిపోయి పోరాటాలు చేస్తున్న సిపిఐ, సిపిఎం ఐక్యంగా అడుగులు వేసేందుకు నిర్ణయించాయి.
ఇందుకోసం ఈనెల 9 న హైదరాబాదులో చారిత్రిక ఐక్య సదస్సు నిర్వహించబోతున్నారు.
ఈ సదస్సుకు ఆయా పార్టీల అతిరథ మహారధులు డి రాజా , సీతారాం ఏచూరి , తెలంగాణ రాష్ట్ర కార్యదర్శులు, జిల్లా మండల , గ్రామస్థాయి , నాయకులు కూడా ఈ సదస్సుకు హాజరవుతున్నారు. పదివేల మందితో జరిగే ఈ సదస్సు వామపక్ష పార్టీల చరిత్రలో మొట్టమొదటి సదస్సుగా చెబుతున్నారు. ఉభయ కమ్యూనిస్టు పార్టీలు అనేక సందర్భాలలో తెలంగాణలో ఒకసారి కాంగ్రెస్తో ను, మరొకసారి తెలుగుదేశం పార్టీతోను ఎన్నికల పొత్తు పెట్టుకున్న విషయం తెలిసిందే. అప్పట్లో ఆయా పార్టీల మద్దతు ఏ పార్టీకి ఉంటే ఆ పార్టీ విజయం సాధించిన సందర్భాలు కూడా చూశాము. ఇది ఇలా ఉంటే కొన్ని సందర్భాలలో సిపిఐ ఒక బూర్జువా పార్టీకి మద్దతునిస్తే , సిపిఎం మరో బూర్జువా పార్టీకి మద్దతునిచ్చి ఎన్నికల్లో పోరాడిన సందర్భాలు కూడా చూశాం. అయితే ప్రస్తుతం బిజెపి వల్ల ప్రజాస్వామ్యానికి ప్రమాదం ఏర్పడిందని బిజెపి నుంచి దేశాన్ని రక్షించుకోవడం ప్రథమ కర్తవ్యం గా ఆ పార్టీలు భావిస్తున్నాయి. బిజెపి హటావో దేశ్ బచావో అనే నినాదంతో బిజెపిని గట్టిగా వ్యతిరేకించి పోరాడే శక్తులతో ఆ రెండు పార్టీలు కలిసి పని చేసేందుకు అడుగులు వేస్తున్నాయి. అందులో భాగంగానే తెలంగాణ రాష్ట్రంలో బి ఆర్ఎస్తో కలసి ఎన్నికల్లో పోటీ చేయడం ద్వారా బిజెపిని అడ్డుకోవాలని లక్ష్యంతో ఆయా పార్టీలు ఐక్య కారాచరణకు శ్రీకారం చుట్టపోతున్నాయి. రెండు పార్టీలు రెండు అభిప్రాయాలతో కాకుండా ఒకే అభిప్రాయంతో ఒకే వ్యూహంతో ఒకే నినాదంతో రాబోయే ఎన్నికల్లో బిజెపిని అడ్డుకోవాలని అదే సందర్భంలో తమ పార్టీలను బలోపేతం చేసుకోవడం ద్వారా అసెంబ్లీలో అడుగు పెట్టాలని వ్యూహంతో ఆయా పార్టీలు ఐక్య కార్యాచరణను ఏర్పాటు చేసుకుంటున్నాయి. ఈ విషయాలను సిపిఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి కోణంనేని సాంబశివరావు స్వయంగా మీడియా సమావేశంలో వెల్లడించారు. తెలంగాణ రాష్ట్రంలో 40 నుంచి 50 స్థానాల్లో గెలుపును ప్రభావితం చేసే శక్తి తమ పార్టీకు ఉందని చెప్పారు. బి ఆర్ఎస్ తమ పార్టీలకు గౌరవప్రదమైన స్థాయిలో సీట్ల కేటాయింపు చేయాలని తాము కోరుకుంటున్నట్లు పేర్కొన్నారు . తద్వారా , బి ఆర్ఎస్ తో కలిసి బిజెపిని తెలంగాణలో అడుగు పెట్టకుండా అడ్డుకుంటామని ఆయన అన్నారు. అదే సందర్భంలో ప్రజా సమస్యల పరిష్కారం కోసం బి ఆర్ఎస్ ప్రభుత్వంపై పోరాటం కొనసాగుతుందని అన్నారు.
కమ్యూనిస్టు పార్టీల్లో వచ్చిన మార్పు , ఐక్యంగా నడవాలని నిర్ణయించిన పరిణామాలపై రాజకీయ పరిశీలకులు ఆసక్తికర వ్యాఖ్యలు చేస్తున్నారు. ఒకనాడు ఉమ్మడి రాష్ట్రంలో కమ్యూనిస్టులు బలీయమైన శక్తిగా ఉన్నారని కమ్యూనిస్టు పార్టీ విడిపోయిన తర్వాత జరిగిన పరిణామాలతో ఆయా పార్టీలు బలహీనపడ్డాయని అంటున్నారు. మళ్ళీ ఆయా పార్టీలు ఐక్యంగా పనిచేస్తే పూర్వ వైభవం వస్తుందని చెప్పలేము కానీ ఆ పార్టీలు మరింత బలపడతాయని మాత్రం చెప్పవచ్చని అంటున్నారు . మొత్తం మీద కామ్రేడ్స్ నూతన ఆలోచన ఏ మేరకు ఫలితాలను ఇస్తుందో వేచి చూడాల్సిందే.

… మొహిద్దిన్…

About the author

Mohiddin Shaik

Leave a Comment