లీకుల సూత్రధారి బండి సంజయ్యేనా…!
ప్రభుత్వాన్ని బదనాం చేసే కుట్ర జరిగిందా..
విద్యార్థుల జీవితాలతో కొన్ని రాజకీయ పార్టీలు ఆటలాడుకుంటున్నాయి..
పరీక్ష ప్రశ్న పేపర్ లీకేజీకి కుట్ర చేశారంటూ బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు ని తెలంగాణ పోలీసులు అరెస్టు చేశారు . హనుమకొండ కోర్టులో హాజరు పరచగా న్యాయమూర్తి ఆయనకు 14 రోజులు రిమాండ్లు ఉంచవలసిందిగా ఆదేశించారు ఈ పరిణామాలు తెలంగాణ బిజెపిలో , రాజకీయ వర్గాల్లో ప్రకంపనలు సృష్టించాయి . బండి సంజయ్ అరెస్ట్ కు గల ఆధారాలను మీడియా ముందు పోలీసు అధికారులు చూపించారు. బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఉద్దేశ పూర్వకంగానే, నమో టీం సభ్యుల ద్వారా పేపర్ లీక్ చేయించి, దాన్ని మీడియా సంస్థలకు షేర్ చేయించి , ఆ తర్వాత ఆయన అదే అంశాన్ని పత్రికలకు విడుదల చేయడం వంటి చర్యలకు పాల్పడినట్లు పోలీసులు తమ దర్యాప్తులో తేల్చారు. ఈ కేసులో బండి సంజయ్ ను ప్రథమ ముద్దాయిగా పేర్కొంటూ ఎఫ్ ఐ ఆర్ చేశారు . ఆయనను అరెస్టు చేసి బుధవారం న్యాయమూర్తి ఎదుట హన్మకొండలో హాజరు పరిచారు. ఈ మొత్తం వ్యవహారం తెలంగాణలో హీట్ ఎక్కేలా చేసింది. బండి సంజయ్ కుట్రపూరితంగా ప్రభుత్వాన్ని అభాసపాలు చేసేందుకు విద్యార్థుల జీవితాలతో ఆడుకున్నారని , అడ్డంగా దొరికిపోయారని అధికార బి ఆర్ ఎస్ మంత్రులు, శాసనసభ్యులు ఆరోపించారు. ఇక బిజెపి నేతలు తమ నాయకుడు ఇటువంటి తాటాకు చప్పుళ్ళకు భయపడడని , ఆయనపై అక్రమ కేసులు బనాయించారని ఆరోపించారు. బండి సంజయ్ అరెస్టుతో అనూహ్య పరిణామాలను చూసిన బిజెపి కేంద్ర అధినాయకత్వం కూడా ఒక్కసారిగా ఉలిక్కిపడింది. గతంలో ఎమ్మెల్యేల కొనుగోలు ఆరోపణలతో తెలంగాణ ప్రభుత్వంతో ఉన్న అనుభవంతో , బిజెపి కేంద్ర అధినాయకత్వం అమిత్ షా తో సహా , కొందరు పెద్ద నాయకులు రంగంలోకి దిగారు. ఈ వ్యవహారాన్ని చక్కబెట్టేందుకు చర్యలు చేపట్టారు. వరంగల్ పోలీస్ కమిషనర్ రంగనాథ్ మీడియాతో మాట్లాడుతూ బండి సంజయ్ నీ ప్రధమ ముద్దాయిగా చూపడానికి అవసరమైన అన్ని ఆధారాలు తమ వద్ద ఉన్నాయని , ఆయన ఎంపీ అయినందున చట్టపరంగా తీసుకోవలసిన అన్ని జాగ్రత్తలు తీసుకొని అరెస్టు చేశామని చెప్పారు. బండి సంజయ్ మొబైల్ ఫోన్ అడిగితే పోలీసులకు ఆయన ఇవ్వకుండా తన వద్ద లేదని, ఎక్కడ ఉందో తెలియదు అంటూ సమాధానం చెప్పడాన్ని ఆయన తప్పు పట్టారు. ఇదిలా ఉంటే ఇటు బి ఆర్ఎస్ నేతలు , అటు బిజెపి నేతలు మధ్య పరస్పర ఆరోపణల యుద్ధం కొనసాగుతోంది. ఇదివరకే టి ఎస్ పి ఎస్ సి , పేపర్ లీక్ వ్యవహారంతో తల బొప్పి కట్టిన తెలంగాణ సర్కారు పదవ తరగతి పరీక్ష పేపరు లీకేజీ వ్యవహారంపై గట్టి నిఘ పెట్టినట్లు తెలుస్తోంది . దీంతో వరసగా రెండు రోజులు జరిగిన పేపర్ లీకేజీ వ్యవహారాన్ని పరిశీలించిన పోలీసులు , పకడ్బందీ వ్యూహంతో బండి సంజయ్ పై కేసు పెట్టారనే చర్చ జరుగుతోంది. బండి సంజయ్ అరెస్టుతో రాష్ట్రవ్యాప్తంగా బిజెపి కార్యకర్తలు ఆందోళనలు నిర్వహించారు. మరో పక్క బీజేపీ నాయకుల నిర్వాకంతోనే పదో తరగతి పరీక్షల పేపర్ లీకేజీల వ్యవహారం జరుగుతోందనే సంకేతాలు ప్రజల్లోకి వెళ్లడంతో ఈ వ్యవహారంలో విద్యార్థుల తల్లిదండ్రుల్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది. ఇటు అధికార పార్టీ అటు బిజెపి మధ్య పరస్పర ఆరోపణలు చేసుకుంటుండగా రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న కాంగ్రెస్ వాదన మరోలా ఉంది. కాంగ్రెస్ నేతలు చేసే ఆరోపణ ప్రజలకు ఓ పట్టణ అర్థం కావడం లేదని చర్చ జరుగుతోంది. బిజెపి తమ నాయకుడి పై అక్రమ కేసు పెట్టారని ఆరోపిస్తుండగా, అధికార బి ఆర్ ఎస్ నేతలు బండి సంజయ్ అడ్డంగా దొరికిపోయారని ఆధారాలతో సహా నిరూపిస్తున్నామని చెబుతున్నారు. కాగా కాంగ్రెస్ మాత్రం బండి సంజయ్ అరెస్ట్ వ్యవహారం ఇటు బీజేపీ, అటు బి ఆర్ ఎస్ రెండు పార్టీలు కలిసి ఆడుతున్న డ్రామా అని అంటుంది . కాంగ్రెస్ సీఎల్పీ నేత భట్టి విక్రమార్క చేసిన కామెంట్ ఇది . అంటే నమో టీం సభ్యుల ద్వారా పేపర్ లీకేజీ చేయించి పోలీసులకు దొరికిపొమ్మని బండి సంజయ్ కి బి ఆర్ ఎస్ నాయకులు చెప్పారా, లేక తనను నేరస్తుడుగా నమోదు చేసి అరెస్టు చేయమని బండి సంజయ్ పోలీసులకు సూచించారా ..అలా జరగనప్పుడు ఇద్దరూ కలిసి ఆడుతున్న నాటకంగా ఈ వ్యవహారాన్ని ఎలా చూడాలో ఒక పట్టాన సామాన్యులకు అర్థం కాని అంశం. మొత్తం మీద రాజకీయ పార్టీల ఆరోపణలు ఎలా ఉన్నా , తెలంగాణలో పేపర్ లీకేజీల వ్యవహారం విద్యార్థుల పాలిట శాపంగా మారిందని మాత్రం ఖచ్చితంగా చెప్పవచ్చు. రాజకీయ నేతల వ్యూహాలు ఎత్తులు తెలియని విద్యార్థులు లీ కు లతో ఏర్పడే గందరగోళం వల్ల వారి మానసిక స్థితి దెబ్బ తిని , ఆందోళనకు గురవుతున్న విషయం అర్థం చేసుకోవాల్సి ఉంది. తెలంగాణ రాష్ట్రంలో ఎమ్మెల్యేల కొనుగోలు ఆరోపణలతో జరిగిన ఘటన తర్వాత ఇప్పుడు మళ్లీ పేపర్ లీకేజీ ప్రభుత్వాన్ని బదనాం చేసే కుట్ర కేసుతో బండి సంజయ్ అరెస్టుతో, తెలంగాణ మరోసారి వేడెక్కింది. జాతీయ స్థాయిలో చర్చకు తెరతీసింది. బండి సంజయ్ కుట్ర చేశారా లేదా అనే విషయాలు పూర్తిస్థాయి విచారణలో తేలనుంది.
. … మొహిద్దిన్. .


