సింహం మెడలో బంగారు బెల్టు కడితే గర్జించే స్వధర్మాన్ని విస్మరిస్తుందా…! తమ జాతి పట్ల ఏం చేసినా విశ్వాసంగా ఉంటుందా…! సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి పై బూటు విసిరిన న సంఘటనపై అణగారిన వర్గాల గొంతుక పద్మశ్రీ మందకృష్ణ మాదిగ స్పందించడంతో ఆయా వర్గాల్లో హర్షం వ్యక్తం అయింది. .
అయితే దేశంలోని ప్రజాస్వామ్యవాదులు ,మేధావులు ,దేశ ప్రధానితో సహా అనేకమంది ఆ బూటు దాడిని ఖండించారు. .. అంతేకాదు విదేశాల్లో ఉన్న ప్రజాస్వామ్య వాదులు కూడా ఇది దళితుడిపై జరిగిన దాడి కాదు భారత రాజ్యాంగం పై జరిగిన దాడి అంటూ తీవ్రంగా ఖండించారు. .. నిరసనలు వెల్లువెత్తిన తరువాత మందకృష్ణ మాదిగ సింహ గర్జన ఒకింత ఆలస్యంగా వినిపించింది. ఇది ఆయన అభిమానుల్లో ఆశ్చర్యాన్ని రేకెత్తించింది. ..
దళితులపై దాడి జరిగితే అందరికంటే ముందు శత్రువు గుండెల్లో దడ పుట్టేలా గర్జించే ఉద్యమ సింహం వారం రోజులు ఆగి స్పందించడంపై రాజకీయ వర్గాల్లో కూడా విస్తృతంగా చర్చ జరుగుతుంది. ..
కొందరైతే ఆలస్యంగా స్పందించినప్పటికీ ,ఆ స్పందన కూడా మునుపటిలా ఘాటుగా ,సూటిగా లేదంటున్నారు. .. ఉద్యమ నేత స్వరంలో మునుపటి దిక్కారం కనిపించలేదని కొందరు వ్యాఖ్యానిస్తున్నారు.
… మందకృష్ణ స్పందన ఆయన మాటల్లోనే. ..
ఏ ధర్మం మమ్ముల వందల ఏళ్లుగా అంటరాని తనానికి గురిచేసిందో. .. ఏ ధర్మం మమ్ముల పశువుల కన్నా హీనంగా చూసిందో. .. మా చిన్నతనంలో కొందరు పశువుల మీద చేయి వేసి నడిచేవారు మమ్ములను మాత్రం దూరంగా ఉంచేవారు. .. అటువంటి వ్యవస్థలో బతుకుతున్నమేము. . జస్టిస్ గవాయి దళితుడైనందునే ఆయనపై బూటు విసిరారు ,దీన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. అంటూ మమ్ముల అంటరాని వారిగా హిందూ ధర్మం చూసిందా? .. ముస్లిం ధర్మమా లేక క్రైస్తవ ధర్మం చూసిందా అనేది నాకు తెలియదు అన్నారు.
ఈ మాటలే మందకృష్ణ అభిమానులు అనేకమందిని ఆశ్చర్యానికి గురిచేశాయి. మనువాదంతో సహా చాతుర్వర్ణ వ్యవస్థ, ఆర్య సంస్కృతి, దళితులు విద్యా బోధన వింటే చెవుల్లో సీసం కరిగించి పోసిన దృష్టాంతాలు ఎవరివి. .? ఇలాంటి అనేక ధార్మిక సామాజిక రుగ్మతల కు సంబంధించి అనర్గళంగా , విశ్లేషణాత్మకంగా ప్రసంగించే గొప్ప దళిత నాయకుడు మందకృష్ణ మాదిగ.
సనాతన ధర్మం గురించి ఇంకా ఏ రకమైన ధార్మిక విషయాల గురించైనా చర్చలో పాల్గొంటే వందమందికైనా సమాధానం చెప్పగలిగిన నాయకుడు అనే పేరు ఉంది. మరి ఇప్పుడు హైందవ ధర్మంలో ఏముందో, సనాతన ధర్మం ఏమిటో, తమను అంటరాని వారిగా పశువులకన హీనంగా చూసింది ఏ ధర్మము, ఇప్పుడు విశ్లేషించాలి ,తెలుసుకోవాలి అంటూ చేసిన ప్రకటన అనేకమంది ఆయన అభిమానులను విస్మయానికి గురిచేసింది.
దళితులను అణచివేయాలనే ధర్మమే ఈనాడు బూటు విసిరిందని , మాట్లాడాల్సిన సందర్భం వచ్చినప్పుడు అన్నిటి పైన మాట్లాడతానని వ్యాఖ్యానించారు.
దళితులే కాదు ఎస్సీ, ఎస్టీ , మైనారిటీ వర్గాల కోసం అనేక పోరాటాలు చేసి న నాయకుడు అతను. ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలో ముఖ్యమంత్రు లను సైతం ప్రభావితం చేసిన ధిక్కార స్వరం అతనిది. ఇప్పుడు ఆ స్వరంలో ఇంత తేడా ఎలా వచ్చింది .? మారిన పరిస్థితుల్లో పదును తగ్గిందా, అనే చర్చ జరుగుతోంది.
ఇదిలా ఉంటే హర్యానా సీనియర్ ఐపీఎస్ అధికారి వై. పురన్ కుమార్ ఆత్మహత్య దేశంలో సంచలనం రేపింది. కులాహంకారంతో తనను అవమానపరిచినందునే ఆ అధికారి ఆత్మహత్య చేసుకున్నాడని ఆరోపణలు వచ్చాయి. అంత పెద్ద స్థాయి అధికారులకు కూడా తక్కువ కులం అనే అవమానాలు తప్పడం లేదు. ఈ ఘటనపై విపక్ష నేత సోనియాగాంధీ, మాయావతి, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తో సహా కమ్యూనిస్టు నేతలు అనేకమంది సామాజికవేత్తలు ఈ ఘటనపై విచారణ జరపాలని కుల అహంకారాన్ని అణచివేయాలని డిమాండ్ చేశారు. . ఈ ఘటనపై కూడా సామాజిక ఉద్యమ సింహం జూలు విదిలించాలని ఆయా వర్గాల వారు కోరుకుంటున్నారు.
