కరోనాకాలంలో అడ్రస్ లేకుండా పోయిన డెంగ్యూ వైరస్ మళ్ళీ ఈ మధ్యకాలంలో విజృంభిస్తుంది… కరోనా కి ముందు ఖమ్మం జిల్లాలోని బోనకల్లు, ఎర్రిపాలెం , మధిర , మండలాల్లో డెంగ్యూ తీవ్ర రూపం దాల్చి ,..దాదాపు పదుల సంఖ్యలో అప్పట్లో ప్రజలు మృతి చెందిన విషయం గుర్తుండే ఉంటుంది.
కానీ కరోనా తర్వాత చాలా కాలం వరకు డెంగ్యూ వెనక్కు తగ్గింది. కాగా ఇప్పుడు మళ్లీ తన విస్తృత రూపాన్ని ప్రదర్శిస్తుంది.. ఖమ్మం నగరం తో పాటు తల్లాడ, ఎర్రు పాలెం ,బోనకల్లు, తిరుమలాయపాలెం , కారేపల్లి , మండలాల్లో తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నట్లు ప్రజలు చెబుతున్నారు.. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ సీజనల్ వ్యాధుల ముందస్తు కట్టడికి సకాలంలో చర్యలు తీసుకోవడంలో విఫలమైందనే విమర్శలు వినిపిస్తున్నాయి..
డెంగ్యూ కేసులు నమోదు అవ్వటం పై జిల్లా కలెక్టర్ అనుదీప్ రిశెట్టి ఆ శాఖ అధికారులపై అసంతృప్తి వ్యక్తం చేయడంతో పాటు వేగంగా డెంగ్యూ వ్యాప్తిని అరికట్టేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. తల్లాడ మండలంలో ఒక మహిళ డెంగ్యూ లక్షణాలతో మృతి చెందినట్లు తెలుస్తోంది అదే ఇంట్లో మరో ఇద్దరు డెంగ్యూ లక్షణాలు కలిగిన పేషెంట్లు ఉన్నట్లు కూడా సమాచారం.. డెంగ్యూ తో పాటు ఇతర సీజనల్ వ్యాధులు వ్యాప్తి చెందకుండా వైద్య ఆరోగ్య శాఖ యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టాల్సి ఉంది…

