కొన్ని రోజులుగా ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయ నాయకుల నోళ్ళల్లో తిరుపతి వెంకన్న స్వామి లడ్డు అంశమే నానుతుంది. కల్తీ అంశంతో ఒకపక్క వేద పండితులు ఆలయాల్లో , సంప్రోక్షణలు, ప్రాయశ్చిత్త , శుద్ధి కార్యక్రమాలు చేస్తున్నారు. మరో పక్క అక్కడి అధికార ప్రతిపక్ష నేతలు లడ్డులో వాడిన నెయ్యిలో కల్తీ ఉందని, లేదని వాదనలు విచారణలు ఇత్యాది ఘటనలు జరుగుతున్నాయి..
ప్రపంచవ్యాప్తంగా ఉన్న వెంకన్న స్వామి భక్తుల్లో ఈ అంశంపై సర్వత్ర చర్చ జరుగుతోంది.. అయితే నెయ్యితో పాటు ఇతర మృతి చెందిన పశువుల నుంచి తీసిన కొవ్వును కూడా ఉపయోగించారనే ఆరోపణలు ఉన్నాయి. వీటిలోంచి మిగతా వాటిని పక్కన పెడితే ఒక్క నెయ్యి విషయంలో కార్పొరేట్ కంపెనీల పై ఆధారపడకుండా ,ఆవులను పెంచి ఆ నెయ్యిని వాడలేమా అనే ప్రశ్న వెంకన్న భక్తుల నుంచి వస్తోంది.

….. లక్షల ఆవులు పెంచి ఆ నెయ్యిని వాడలేమా…!
అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు ఆ తిరుమలేశుని లడ్డు తయారీకి సరిపోయే స్థాయిలో ఆవుల మందలను పెంచలేరా అని భక్తులు ప్రశ్నిస్తున్నారు.. ఏదో అరకొరగా గోశాలను ఏర్పాటు చేసి వందో వెయ్యో గోవులను పెంచి చేతులు దులుపుకోవడం కాకుండా , తిరుమలేశుని లడ్డుకి సరిపోయే అంత స్థాయిలో సొంత ఆవుల నుంచి నెయ్యి వచ్చే విధంగా చేయాలని డిమాండ్ సర్వత్రా వినిపిస్తోంది. శ్రీవారి లడ్డు 1940 నుంచి కళ్యాణోత్సవ ప్రసాదంగా భక్తులకు అందుబాటులోకి వచ్చింది 2009లో ఆ లడ్డుకు పేటెంట్ వచ్చిందని తెలిసింది.
…. గోవర్ధనగిరి కంటే శ్రీనివాసునికి స్థలం ఏమి తక్కువ …!
గోవర్ధనగిరి ప్రాంతంలో గోవులే ప్రధాన ఆస్తిగా ఆవుల మందలను సాక్షాత్తు కృష్ణుడు గోపాలుడుగా ఉండి గోవులు కాసాడని మన పురాణాలు, మన సుప్రసిద్ధ ప్రవచనకర్తలు చెబుతున్నారు. ఆ గోవర్ధనగిరిని మనం చూడలేదు . కానీ మన శ్రీనివాసుని ఏడుకొండలు ఆయన కు గల విశాలమైన ప్రదేశాలను మనం చూశాం.
….. వెంకన్న స్వామి భక్తులైన రైతులకు కొన్ని గోవులను ఇవ్వండి…
కొంతమంది రైతులకు టీటీడీ తరఫున గోవులను ఇస్తే ,వారు ఆ గోవులను పెంచి వాటి ద్వారా వచ్చే నెయ్యిని భక్తితో స్వామివారికి సమర్పించుకుంటారు .ఈ ప్రయత్నం టీటీడీ ద్వారా చేయవచ్చు . అటు రైతుకు ఉపయోగం , గోసంపద పెరుగుతుంది . స్వచ్ఛమైన ఆవు నెయ్యి స్వామివారికి చేరుతుంది.
స్వామివారి ప్రసాదం కల్తీ అంశం దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున జరుగుతున్న సందర్భంగా భక్తుల నుంచి అనేక అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.
