ఇప్పటికే మున్నేరు ఉగ్రరూపంతో ప్రజలు తల్లడిల్లిపోయారు. గండం గడిచింది అంటూ , ఇండ్లకు చేరే లోపే, మళ్లీ మున్నేరుకు వరద పెరుగుతుందంటూ పోలీసులు మైకు పట్టుకుని హెచ్చరికలు చేశారు.. మరోపక్క ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు కూడా,

మున్నేరు ముంపు ప్రాంతాల ప్రజలంతా తక్షణమే ఇండ్లు ఖాళీ చేయాలంటూ హెచ్చరికలు చేశారు.. ఇంకేముంది…భయంతో ప్రజలు పరుగులు తీస్తూ, చంటి పిల్లలను చంకనెత్తుకొని , వృద్ధులను తీసుకొని వందలాదిగా రోడ్లపైకి వచ్చేసారు. ఎటు చూసిన అయోమయమే.. యమ గండం గడిచింది అనుకుంటే మళ్ళీ వచ్చిందంటూ, ప్రజలు వీధుల వెంట రోధించడం కనిపించింది.

ఇప్పటికే ప్రభుత్వం ఏర్పాటు చేసిన సహాయ పునరావాస కేంద్రాలకు ముందస్తు జాగ్రత్తగా ప్రభుత్వ అధికారులు తరలించేందుకు అహర్నిశలు కృషి చేస్తున్నారు. మరి కొందరేమో దగ్గరలో ఉన్న తమ బంధువుల ఇండ్లకు వెళ్లి తలదాచుకునే ప్రయత్నం చేస్తున్నారు.
…… హుటాహుటిన ఖమ్మం , చేరుకున్న డిప్యూటీ సీఎం….
వెనువెంటనే మరో తుఫాను ముప్పు పొంచి ఉండడం, మారిన వాతావరణ పరిస్థితులను గమనించిన రాష్ట్ర డిప్యూటీ చీఫ్ మినిస్టర్ మల్లు భట్టి విక్రమార్క , హైదరాబాదు నుండి శనివారం రాత్రి హుటాహుటిన తరలి ఖమ్మం వచ్చారు. రాబోయే వరద ముప్పును ఎప్పటికప్పుడు అంచనా వేస్తూ, అధికారులను అప్రమత్తం చేస్తూ , ఎక్కడ కూడా ఒక్క ప్రాణం కూడా నష్టం జరగకుండా ఉండేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నారు.
వైరా నది పరివాహక ప్రాంతంలో కూడా శనివారం భారీ వర్షం కురవడంతో ఇప్పటికే విక్రమార్క స్వగ్రామమైన స్నానాల లక్ష్మీపురం లో వైరా నది ఒడ్డు పైకి ఎక్కి ప్రవహిస్తున్నట్లు అక్కడి అధికారులు తెలిపారు. మున్నేరుకు కూడా వరద ముప్పు మరోసారి పొంచి ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఒకపక్క ప్రభుత్వ అధికారులు ప్రాణాంతకమైన పరిస్థితులు ఉండవచ్చని హెచ్చరికలు జారీ చేస్తుండగా, మరోపక్క చీకటిలో చిన్న పిల్లలను, వృద్ధులను వేసుకొని పునరావాస కేంద్రాలకు వెళ్లేందుకు ఇష్టం లేక కొందరు మున్నేరు పరివాహక ప్రాంత ప్రజలు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. మునుపెన్నడూ లేని విధంగా ఈ సంవత్సరం హృదయ విదారకమైన దృశ్యాలు మున్నేరు ముంపు ప్రాంతంలో ఆవిష్కృతమయ్యాయి. మొత్తం మీద ఈ సంవత్సరం వర్షాలు వరద బీభత్సం ఇటు ప్రజలకు అటు ప్రభుత్వానికి కంటిమీద కునుకు లేకుండా చేస్తుందని చెప్పవచ్చు.
