లోయల్లో ప్రవహించే గోదావరి మెరకలెక్కి పారింది… ఖమ్మం జిల్లా పంట పొలాల్లో పంటలకు ప్రాణం పోసేందుకు సిద్ధమైంది… దేశానికి స్వాతంత్రం వచ్చిన రోజు తరతరాల ఖమ్మం జిల్లా ప్రజల నేతల కలలు సాకారం చేస్తూ ఖమ్మం జిల్లా నేలపై వివిధ చెరువులు నింపేందుకు పరుగులు తీయనుంది..

ఆదివారం భారీ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి రాష్ట్ర వ్యవసాయ సహకార శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ,రాష్ట్ర రెవెన్యూ గృహ నిర్మాణ సమాచార పవర సంబంధాల శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సీతారామ ప్రాజెక్టు మూడు పంపు హౌస్ లను ట్రయల్ రన్ ప్రారంభించి చూశారు… స్విచ్ నొక్కగానే భారీ మోటార్ల ద్వారా నీరు నదిని వీడి ఖమ్మం జిల్లా రోడ్డుపై ఏర్పాటు చేసిన కాలువల్లోకి దూకింది..

ఇక ఉమ్మడి ఖమ్మం జిల్లా రైతులకు సాగునీటి తాగునీటి కరువు శాశ్వతంగా తీరినట్లే.. కొన్ని దశాబ్దాల పోరాటాల ఫలితం సీతారామరాజు లింక్ కెనాల్ కల సాకారం కాబోతోంది. ఈ ప్రాజెక్టు కోసం కమ్యూనిస్టుల పోరాటాలు చారిత్రకమైనవని చెప్పవచ్చు.. సిపిఎం నేత తమ్మినేని వీరభద్రం మూడు వేల కిలోమీటర్లు ఈ ప్రాజెక్టు కోసం పాదయాత్ర చేశారు.. అదే స్థాయిలో సిపిఐ నేత కోణంనేని సాంబశివరావు అప్పట్లో జిల్లా వ్యాప్తంగా గ్రామ గ్రామాన కాలినడకన తిరిగారు..
అప్పటి తెలుగుదేశం ప్రభుత్వంలో ఉన్న తుమ్మల నాగేశ్వరరావు సైతం ఈ ప్రాజెక్టు కోసం అటు ప్రభుత్వంలో ఉండి కూడా పోరాడారు.. 2004 ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు దివంగత నేత అప్పటి ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి దుమ్ముగూడెం రాజు సాగర్ పేరుతో ఆయన ముఖ్యమంత్రి కాగానే ఉమ్మడి ఖమ్మం జిల్లా రైతులకు నూతన సంవత్సర కానుకగా ఈ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు..వైయస్ రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వంలో అప్పట్లో కీలకంగా ఉన్న ఖమ్మం జిల్లా నేత ప్రస్తుత డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క కూడా తన స్థాయిలో ఈ ప్రాజెక్టు కోసం పోరాడారు.
వైయస్ కు కృతజ్ఞతలు అభినందనలు తెలిపిన కమ్యూనిస్టు నేతలు ఈ ప్రాజెక్టులో దుమ్ముగూడెం నుండి సాగర్ వరకు ఏర్పాటు చేసే టైల్ పాండ్ నిర్మాణాన్ని ఆనాడు వ్యతిరేకించారు…
మారిన రాజకీయ పరిణామాలు, ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు తరువాత కెసిఆర్ ప్రభుత్వం ఈ ప్రాజెక్టుపై ప్రత్యేక దృష్టి సారించి పనులు వేగం పెంచే ప్రయత్నం చేసింది.. అయితే ప్రాజెక్టు నిర్మాణ వ్యయాన్ని 2,400 కోట్ల నుంచి 18 వేల కోట్లకు పెంచి నిధులను అడ్డగోలుగా దుర్వినియోగం చేసిందని ఆరోపణలు ఉన్నాయి. ఆ తర్వాత వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఈ ప్రాజెక్టుపై మరింత దృష్టి సారించి సాగర్ ఆయకట్టు రైతులకు సత్వరమే నీరు అందించే బృహత్తర ఆలోచన చేసి , రాజీవ్ లింకు కెనాల్ పేరుతో కేవలం 75 కోట్ల రూపాయల తక్కువ ఖర్చుతో ఏనుకూరు వద్ద సాగర ఎడమ కాలవకు లింకు చేస్తూనే అక్కడనుండి వైరా రిజర్వాయర్ లోకి గోదావరి జలాలను నింపే గొప్ప పధక రచన చేసి విజయవంతంగా పూర్తి చేయడం విశేషంగా చెప్పవచ్చు.
దశాబ్దాల రైతుల కల సహకారం కానుండటంతో ఉమ్మడి ఖమ్మం జిల్లా రైతాంగంలో ఆనందం వ్యక్తం అవుతోంది ఈ ప్రాజెక్టు కోసం దశాబ్దాలుగా వివిధ రూపాల్లో పోరాడిన నాయకులందరూ ఆనందిస్తున్నారు. వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గోదావరి జలాలతో ఖమ్మం జిల్లా రైతుల పాదాలు కడగాలనేదే తన జీవిత ఆశయమని పదేపదే చెబుతుండే ఆ మాట ఇప్పుడు నిజం కాబోతోంది. ఆయనతోపాటు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క రెవెన్యూ శాఖ మంత్రి పొంగిలేటి శ్రీనివాసరెడ్డి ఈ లింక్ కెనాల్ పై ప్రత్యేక దృష్టి సారించి దాదాపు మెరుపు వేగంతో పూర్తి చేయడం గొప్ప విషయం గా చెప్పవచ్చు. మొత్తం మీద తక్కువ ఖర్చుతో అతి తక్కువ సమయంలో దాదాపు ఒక లక్ష 50 వేల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందించే అద్భుతమైన అవకాశాన్ని రేవంత్ రెడ్డి సర్కారు అందించి ఉమ్మడి జిల్లా రైతుల మనసులో చెరగని ముద్ర వేసిందని చెప్పవచ్చు.
