దున్నేవాడికే భూమి..ఈ నినాదం ఈ ప్రాంతంలో, ఒకప్పుడు చాలామంది భూస్వాముల వెన్నులో వణుకు పుట్టించిన సంగతి తెలిసిందే.. ఇప్పుడు తాజాగా రైతు భరోసా విషయంలో పండించే రైతుకే పంటసాయం అనే సరికొత్త నినాదం తెరపైకి వచ్చింది..
రైతు భరోసా పై రైతులు, ప్రజల నుంచి అభిప్రాయ సేకరణ ఈనెల 10 నుంచి 23వ తేదీ వరకు రాష్ట్రంలోని ఉమ్మడి పది జిల్లాల్లో జరగనుంది. ప్రజాభిప్రాయ సేకరణకు సంబంధించిన వర్క్ షాప్ నిర్వహణ కు మొట్టమొదటిగా ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి శ్రీకారం చుట్టనున్నారు.
రైతు భరోసా పథకం కింద రైతులకు చేసే సాయం పంట సాయం ఎలా చేయాలి? ఎవరికి ఇవ్వాలి అనే అంశంపై ప్రజల నుంచి ప్రభుత్వం విస్తృతంగా అభిప్రాయాలను సేకరించనుంది. ఇందులో పంట పండించే వాడికే సాయం అందించాలని కొత్త నినాదం వినిపిస్తోంది.
నిజంగా పంట పండించే వాడికే పంటసాయం అనేది స్థూలంగా చూసినప్పుడు ఇదే సరైన న్యాయం అనిపిస్తుంది. అయితే మరి కొంతమంది పంట పండించటం చేతకాక తమ పొలాలను కౌళ్ళకు ఇచ్చుకున్న రైతుల సంగతేంటి అనేది ఇప్పుడు చాలామంది రైతులను వేధిస్తున్న ప్రశ్న. ఎన్ని ఎకరాలు ఉన్న రైతుకు రైతు భరోసా ఇవ్వాలి, పంట పండించే రైతుకే ఇవ్వాలా, భూమి కౌలుకు ఇచ్చుకున్న రైతుకు కూడా ఇవ్వాలా.., ఒకవేళ భూమి కౌలుకు ఇచ్చుకున్న రైతుకు రైతు భరోసా ఇస్తే ఆ భూమిలో పంట పండించిన నష్టపోయి ఆత్మహత్యలు చేసుకుంటున్నా కౌలు రైతుకు పంటసాయం ఇవ్వకుంటే అన్యాయం కాదా.
మరి ఇటు రైతుకు అటు కైరు కవులు రైతుకు పంటసాయం ఇవ్వడం ఎలా సాధ్యం.. ఈ మొత్తం అంశాలపై రైతుల నుంచే సమగ్రమైన అభిప్రాయ సేకరణ చేసేందుకు రేవంత్ రెడ్డి నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. రాష్ట్ర డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క చైర్మన్గా ఏర్పడిన రైతు భరోసా మంత్రివర్గ ఉప సంఘం దీనిపై రాష్ట్రవ్యాప్తంగా విస్తృతంగా రైతుల నుంచి ప్రజల నుంచి అభిప్రాయ సేకరణ చేస్తోంది.
ఈ నెల 10వ తేదీ అంటే నేడు ఖమ్మంలో ఇదే అంశంపై వర్క్ షాప్ నిర్వహించేందుకు రైతు భరోసా ఉప సంఘం అధ్యక్షులు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పట్టి విక్రమార్క నేతృత్వంలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, రాష్ట్ర రెవెన్యూ గృహ నిర్మాణ శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, జిల్లా ఇన్చార్జి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తో సహా మంత్రులు వర్క్ షాప్ నిర్వహించి రైతు భరోసా పై నూతన మార్గదర్శకాలు ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వానికి సూచనలు చేయనున్నారు.
టిఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన మాదిరిగా రైతుబంధు కింద భూస్వాములకు కూడా పంటసాయం ఇచ్చే సాంప్రదాయానికి చెక్కు పెట్టనుంది. గతంలో వందల ఎకరాలు ఉన్న భూస్వాములకు కూడా ప్రజల సొమ్మును రైతుబంధు రూపంలో ప్రభుత్వం దోచిపెట్టిందని తీవ్ర విమర్శలు ఉన్నాయి. అదేవిధంగా పంటలకు పనికిరాని భూములకు ధరణిలో వ్యవసాయ భూమిగా చూపించుకొని కొందరు రియల్ ఎస్టేట్ ఆసాములకు కూడా రైతుబంధు అందింది.
అయితే గత ప్రభుత్వం ఇంత పెద్ద ఎత్తున ప్రజాధనాన్ని భూస్వాములకు అందించినప్పటికీ భూమిని నమ్ముకొని వ్యవసాయం చేసి అప్పులు పాలై ఆత్మహత్యలు చేసుకునే కవులు రైతును మాత్రం అసలు రైతుగానే గుర్తించలేదు.
కాగా కాంగ్రెస్ ప్రభుత్వం మాట ఇచ్చిన ప్రకారం రైతు భరోసా పథకం కింద కవులు రైతులకు కూడా పంట సాయం చేసేందుకు సిద్ధమవుతోంది. ఈ విషయంలోనే రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కొందరు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెబుతూ కౌలుకు ఇచ్చే రైతు కౌలుకు తీసుకునే రైతు పంటసాయం విషయంలో ముందే మాట్లాడుకోవాలని పంట ఎవరు పండిస్తారు సహాయం వారే పొందుతారని ఒక సంకేతాన్ని వారికి ఇచ్చారు.
