టియూడబ్ల్యూజె రాష్ట్ర మహాసభల్లో
రాష్ట్ర సమాచార శాఖా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి..జర్నలిస్టులు వృత్తి నైపుణ్యాన్ని పెంచుకోవాలి..మీడియా అకాడమీ ఛైర్మన్ కె.శ్రీనివాసరెడ్డి..


జర్నలిస్టులకు కొద్దిరోజుల్లోనే ఇళ్లస్థలాలు ఇస్తామని రాష్ట్ర రెవెన్యూ, హౌజింగ్,
సమాచార పౌర సంబంధాల శాఖా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి హామీ ఇచ్చారు. బుధవారం ఖమ్మం లోని ఉషాహరి కన్వెన్షన్‌లోని అమర్‌నాధ్ ప్రాంగణంలో జరుగుతున్న టియూడబ్ల్యూజె(ఐజెయు)
రాష్ట్ర మూడో మహాసభలను మంత్రి ప్రారంభించి ప్రసంగించారు.

రాష్ట్ర అధ్యక్షులు నగునూరి శేఖర్ అద్యక్షతన జరిగిన ప్రారంభ సభలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా జర్నలిస్టుల ఇళ్లస్థలాల కేటాయింపు సమస్యను త్వరలోనే పరిష్కరించేందుకు తాను ఈ సభలకు వచ్చే ముందే ముఖ్యమంత్రితో చర్చించి వచ్చానన్నారు. గత పదేళ్లుగా జర్నలిస్టులు భావ ప్రకటన చేయడానికి కూడా ఎంత ఇబ్బంది పడ్డారో అందరికీ తెలుసునని అన్నారు. ఇందిరమ్మ ప్రభుత్వం జర్నలిస్టుల డిమాండ్లను నూరుశాతం పరిష్కారం చేస్తుందని స్పష్టం చేశారు.
ప్రధానంగా జర్నలిస్టుల ఇళ్ల స్థలాలకు సంబంధించి కొన్ని చోట్ల మంజూరైనప్పటికీ కోర్టులో వివాదం ఉందని, వాటి ద్వారా క్లియరెన్స్ వచ్చినప్పటికీ గత ప్రభుత్వం స్థలాలు ఇవ్వలేదని అన్నారు. తమ ప్రభుత్వం వచ్చిన తర్వాత మీడియా అకాడమీ ఛైర్మన్‌గా ఐజెయూ జాతీయ అధ్యక్షులు శ్రీనివాసరెడ్డిని నియమించామన్నారు. ఆయన జర్నలిస్టుల సమస్యలపై సమగ్రంగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి వివరించారని అన్నారు. వారితో చర్చించి జర్నలిస్టుల ఇళ్లస్థలాలు ఇచ్చే విషయంలో ఒక సమగ్రమైన పాలసీని తీసుకొస్తున్నామని అన్నారు. ముందుగా ఖమ్మం నగరంలో ఇదివరకే జర్నలిస్టుల ఇళ్లస్థలాల కేటాయింపునకు ఒక జిఓ ఇచ్చారని, ఆ జీఓ అమలుకు ఇంకొంత పని ఉన్నప్పటికీ దానిని పరిష్కరించి కొద్దిరోజుల్లోనే ఇళ్లస్థలాలు ఇస్తామని అన్నారు. ముందుగా ఖమ్మం జర్నలిస్టులకు ఇళ్లస్థలాలు కేటాయిస్తామన్నారు.
జర్నలిస్టులు వృత్తినైపుణ్యం పెంచుకోవాలి ః కె.శ్రీనివాసరెడ్డి
వర్కింగ్ జర్నలిస్టులు వృత్తి నైపుణ్యం పెంచుకోవాలని మీడియా అకాడమీ ఛైర్మన్ కె.శ్రీనివాసరెడ్డి పిలుపునిచ్చారు. సమాజంలో ఆ వృత్తి పట్ల గౌరవాన్ని పెంచుకునే బాధ్యత కూడా వర్కింగ్ జర్నలిస్టులపైనే ఉందని ఆయన అన్నారు. మహాసభల్లో ఆయన ప్రసంగిస్తూ గత పదేళ్ల నుండి ఒక సమాచార శాఖా మంత్రి జర్నలిస్టుల వేదికపై కూర్చొవడం ఇదే తొలిసారి అని అన్నారు. గత పదేళ్లుగా జర్నలిస్టులు తమ సమస్యలను చెప్పుకునేందుకు నాటి ముఖ్యమంత్రిని కలిసే అవకాశం లేదని, ఇక సమాచార శాఖ అంతర్ధానం అయిపోయిందని ఆయన అన్నారు.
జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించాలనే ఒక మంచి ఉద్ధేశమున్న వ్యక్తి సమాచార శాఖా మంత్రి కావడం సంతోషకరమన్నారు. దేశంలో మోడల్ ప్రెస్‌క్లబ్ అనే బిల్లును పార్లమెంట్‌లో ప్రవేశపెట్టబోతున్నారని అన్నారు. ఆ బిల్లును న్యాయకోవిదులు, ఐఏఎస్ అధికారులు కలిసి రూపొందించారని శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. అదే తరహ బిల్లును తెలంగాణ రాష్ట్రంలో అమలులోకి తేవాలని సూచించారు. గత ప్రభుత్వం అకాడమీకి వంద కోట్లు కేటాయించినట్లు తాను ఓ పత్రికల్లో చదివానని, తాను ఛైర్మన్‌గా వచ్చిన తర్వాత అది నిజం కాదని తేలిందని, ఇలాంటి అవాస్తవపు ప్రకటనలు మానుకోవాలని హితవుపలికారు. జర్నలిస్టు ఉద్యమం రెండు తెలుగు రాష్ట్రాల్లో బలంగా ఉందని ఆయన పేర్కొన్నారు.20 ఏళ్ల తర్వాత తనను మళ్లీ మీడియా అకాడమీ ఛైర్మన్‌గా నియమించినందుకు ముఖ్యమంత్రికి, తెలంగాణ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేశారు.
