ప్రభుత్వ పాఠశాలల్లో కల్పిస్తున్న మెరుగైన విద్యా బోధనతో పిల్లలకు ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ తెలిపారు. మంగళవారం జిల్లా కలెక్టర్ స్థానిక రమణ గుట్టలో బడిబాట కార్యక్రమంలో పాల్గొన్నారు.అధికారులు, ఉపాధ్యాయులు, పిల్లలచే ర్యాలీగా, విద్య ప్రాముఖ్యత, ప్రతిఒక్కరు చదువుకోవాలనే నినాదాలతో ర్యాలీ కొనసాగింది. జిల్లా కలెక్టర్ ఇంటింటికి తిరుగుతూ, ఇంట్లో చదువుకొనే పిల్లలు ఉన్నది, ఏ పాఠశాలలో చదువుతున్నది అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, విద్యా ప్రాముఖ్యతను ప్రతి ఒక్కరూ అర్థం చేసుకుని వారి పిల్లలను తప్పనిసరిగా చదివించాలని తెలిపారు.
ప్రతి ఒక్క పిల్లవాడు పాఠశాలలో నమోదయ్యే దిశగా బడిబాట కార్యక్రమాన్ని ప్రభుత్వం జూన్ 6 నుంచి జూన్ 19 వరకు నిర్వహిస్తుందని ఆయన అన్నారు. జిల్లాలోని ప్రభుత్వ ఉపాధ్యాయులు, సిబ్బంది ఇంటింటికి తిరిగి ప్రభుత్వ విద్యాలయాల్లో విద్యార్థుల నమోదు శాతం పెరిగేలా చర్యలు తీసుకోవాలని, అమ్మ ఆదర్శ కమిటీల ద్వారా ప్రభుత్వ పాఠశాలల్లో కల్పించిన వసతులు, ప్రైవేటు కార్పొరేట్ పాఠశాలల కంటే ప్రభుత్వ పాఠశాలలో వస్తున్న మెరుగైన ఫలితాలను తల్లిదండ్రులకు వివరిస్తూ అధిక సంఖ్యలో విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల్లో నమోదు అయ్యేలా చూడాలని కలెక్టర్ తెలిపారు.
పదవ తరగతి ఫలితాల్లో జిల్లాల్లో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులు ఉత్తీర్ణత పెరిగిందని, ప్రైవేట్ కంటే మెరుగ్గా ప్రభుత్వ పాఠశాలల్లో ఫలితాలను సాధిస్తున్నామని, ప్రభుత్వ పాఠశాలల్లో ఎటువంటి ఖర్చు లేకుండా నాణ్యమైన విద్య, విద్యార్థులకు అందుతుందని కలెక్టర్ తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లో రెగ్యులర్ గా ప్రతి నెల పేరెంట్, టీచర్స్ మీటింగ్ నిర్వహిస్తున్నామని, విద్యార్థుల పురోగతే లక్ష్యంగా ఎప్పటి కప్పుడు తల్లిదండ్రులను భాగస్వామ్యం చేస్తూ కృషి చేయడం జరుగుతుందని అన్నారు.
ప్రపంచంలోని అనేక దేశాలు విఫలమైన చంద్రయాన్ ప్రయోగాన్ని మన భారత శాస్త్రవేత్తలు విజయవంతం చేశారని, అటువంటి శాస్త్రవేత్తలు సైతం ప్రభుత్వ పాఠశాలలోనే చదివారని, ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులకు నాణ్యమైన విద్య ఉచితంగా అందించడంతో పాటు వారికి అవసరమైన యూనిఫామ్, పాఠ్య, నోట్ పుస్తకాలను ఉచితంగా పంపిణీ చేస్తున్నామని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లలను చేర్చాలని, అనవసరంగా ప్రైవేటు పాఠశాలల్లో చేర్చి డబ్బు వృధా చేసుకోవద్దని, ప్రభుత్వ పాఠశాలలోని విద్యార్థులు ఐఐటి, నీట్ ఫలితాల్లో మంచి ప్రదర్శన కనబరుస్తున్నారని, క్రీడా పోటీలలో సైతం ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు అధికంగా రాణిస్తున్నారని ఆయన అన్నారు.
