ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండల పరిధిలోని ఏజెన్సీ గ్రామాల్లో గిరిజనులు ఒక సీఐని వెంటపడి తరిమి కొట్టిన తీరు భయానకంగా ఉంది… అసలు ఆ అడవి బిడ్డలకు పోలీసులపై అంత ఆగ్రహం ఎందుకు వచ్చింది…

సహజంగానే పోలీసులంటే భయపడే గిరిజనులు బహిరంగంగా సిఐని తరిమి తరిమి కొట్టే అంత తెగింపు ఎలా వచ్చింది… మార్చి 31వ తేదీన సత్తుపల్లి నియోజకవర్గం పరిధిలోని గిరిజన గ్రామాల్లో జరిగిన ఈ సంఘటన రాష్ట్రస్థాయిలో సంచలనం కలిగించింది… గిరిజనులు ప్రవర్తించిన తీరుపై ఆగ్రహించిన పోలీసు శాఖ కూడా అదే స్థాయిలో స్పందించి దాదాపు 30 మందిని అదుపులోకి తీసుకొని వారి పద్ధతిలో చర్యలు తీసుకున్నట్లు సమాచారం…మరొకసారి పోలీసు పోయి చెయ్యత్తడానికి భయపడే లా చేసి వారిలో 20 మందిని అరెస్టు చేసి సోమవారం రిమాండ్ కు పంపినట్లు తెలిసింది…

సత్తుపల్లి మండలంలోని ఏజెన్సీ గ్రామాలైన బుగ్గపాడు రుద్రాక్ష పల్లి గాంధీ నగర్ గిరిజన గూడాలకు చెందిన గిరిజనులు వన సంరక్షణ సమితులకు సంబంధించిన ప్రభుత్వ స్థలం 25 ఎకరాల్లో గుడిసెలు వేసుకునే ప్రయత్నాలు ఇటీవల ముమ్మరం చేశారు. కాగా ఆ మూడు గ్రామాలకు చెందిన గిరిజనులు గాక గుడిసెలు వేసే ప్రాంతంలోని మరో గ్రామానికి చెందిన గిరిజనులు ఆ స్థలం తమకే కావాలని ఇక్కడ మీరు గుడిసెలు వేయడానికి వీలు లేదంటూ వాదిస్తూ వచ్చారు.
ఈ రెండు వర్గాల మధ్య గతం నుంచి వివాదాలు జరుగుతున్నాయి. కాగా ఇటీవల ఆ మూడు గిరిజన గ్రామాలకు చెందిన వారు ఆ స్థలాన్ని ఆక్రమించుకునేందుకు గుడిసెలు వేయటం అక్కడే ఉండే ఏర్పాటు చేసుకోవడం లాంటివి ముమ్మరంగా చేయడంతో ఆ స్థలం ఉన్న ప్రాంతానికి చెందిన స్థానిక గ్రామానికి చెందిన గిరిజనులు గట్టిగా అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో ఆ రెండు వర్గాల మధ్య ఘర్షణ వాతావరణం ఏర్పడింది.
సమాచారం తెలుసుకున్న పోలీసులు సత్తుపల్లి సిఐ కిరణ్ తన సిబ్బందితో అక్కడికి వెళ్లి ఇరుపక్షాలకు సర్ది చెప్పే విషయంలో ఆ మూడు గూడాలకు చెందిన గిరిజనులను గుడిసెలు వేయకుండా ఫారెస్ట్ అధికారులు వచ్చి ఏమి చెబుతారో చూసి అప్పుడు గుడిసెలు వేసుకోవాలి అప్పటిదాకా వెయ్యడానికి వీలులేదని చెప్పే ప్రయత్నం చేశారని తెలిసింది.
ఈ క్రమంలోనే ఆ గిరిజనులకు సీఐ కి మధ్య వాగ్వాదం జరగడం ఆ విషయాలను సదరు గిరిజనులు మొబైల్ ఫోన్ లో రికార్డు చేస్తుంటే పోలీసులు ఆ మొబైల్ ఫోన్ను లాక్కోవడంతో వారంతా ఆగ్రహం వ్యక్తం చేస్తూ పోలీసులు పై తిరగబడినట్లు కొందరు చెబుతున్నారు. అయితే ఆ ఘర్షణ చినుకు చినుకు గాలి వానలా పెద్దదై సీఐను లక్ష్యంగా చేసుకొని గిరిజనులు వెంటపడి కర్రలతో కొట్టేదాకా వచ్చింది. పోలీస్ కానిస్టేబుల్ అడ్డుకునే ప్రయత్నం చేస్తుంటే వారిపై కూడా దాడి చేశారు గిరిజనుల సంఖ్య ఎక్కువగా ఉండటం వారు ఆగ్రహంతో ఏది దొరికితే అది తీసుకొని దాడి చేసే ప్రయత్నాలు చేస్తుండడంతో సీఐ అక్కడనుండి ఒక దశలో పారిపోయే ప్రయత్నం కూడా చేశారు.
అయినప్పటికీ వెంటపడి అడ్డుకొని గిరిజనులు దాడి చేస్తున్న దృశ్యాలు సోషల్ మీడియాలో సంచలనం కలిగించాయి. ఇటు పోలీసులు కూడా ఆ తర్వాత అదే స్థాయిలో స్పందించి గిరిజన గుడియాల్లోకి వెళ్లి దొరికిన వారిని అదుపులోకి తీసుకుంటున్న క్రమంలో ఆయా గిరిజన గుడాల్లోని గిరిజనులు ఇల్లు వదిలి పరారయ్యారు. కొంతమందిని అరెస్టు చేసి రిమాండ్ చేస్తున్నట్లు వార్తలు వస్తున్నప్పటికీ ఆయా గిరిజనులు భయంతో బిక్కుబిక్కుమంటున్నారు. మొత్తం మీద సత్తుపల్లి నియోజకవర్గ పరిధిలో , మునుపు ఎన్నడు లేని విధంగా జరిగిన ఈ ఘటన పోలీసు వర్గాల్లో కూడా తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
