క్రైమ్ వార్తలు జాతీయం ప్రత్యేక కథనాలు

ఉక్కు కండరాల యువకులేరి..!మత్తుకు బానిసలై మృగాలుగా మారితే ఎలా..!కరోనా కంటే విషాదాన్ని మిగుల్చుతున్న మత్తు పదార్థాలు..

Written by Mohiddin Shaik

మానసిక బలహీనతలకు లొంగని , ఉక్కు కండరాలు, ఇనుప నరాలు , కలిగిన యువత, ఈ దేశానికి కావాలంటారు స్వామి వివేకానంద.. మానసిక దుర్బ లు ల సంఖ్య నానాటికి పెరిగిపోతోంది.. మత్తుకు బానిసలై పశువులుగా ప్రవర్తిస్తున్న వారు కొందరైతే, కమ్మిన మైకంలో నరహంతకులుగా మారుతున్న వారు మరి కొందరు.. గంజాయి తో పాటుగా ఇతర మత్తు పదార్థాల కు బానిసలు అవుతున్నారు.

ఖమ్మం రామన్నపేటలో నాలుగు రోజుల క్రితం ఒకడు గంజాయి మత్తులో కన్న తల్లిని హత్య చేశాడు. హత్య చేసి గుట్టుగా ఖననం చేసే ప్రయత్నం చేశారు. గ్రామస్తులు చూసి అడ్డగించి పోలీసులకు సమాచారం ఇస్తే విషయం బయటికి వచ్చింది. ఇటీవల హైదరాబాదులో ఇద్దరు స్నేహితుల మధ్య చిన్న గొడవ గంజాయి మత్తు కారణంగా ఆ ఇద్దరు కత్తులతో ఒకరిపై ఒకరు దాడి చేసుకుని అందులో ఒకడు మృతి చెందాడు. కొన్ని ప్రాంతాల్లో పాఠశాలల్లో చదువుకునే, మైనర్ బాలికలకు గంజాయి మత్తు అలవాటు చేసి అత్యాచారం చేస్తున్న దుర్మార్గమైన సంఘటనలు వెలుగుచూస్తున్నాయి.

మత్తుకి బానిసైన వాడికి కుటుంబంతో గాని, ఈ సమాజంతో కానీ, ఎంత మాత్రం పని లేదు. వాడు నిత్యం మత్తులో జోగటానికి మత్తు పదార్థం దొరికితే చాలు. ఆ పదార్థం కోసం వాడు ఎవరినైనా కొడతాడు, ఎవరినైనా అవసరమైతే హత్య కూడా చేస్తాడు, అనే స్థాయికి మత్తు మహమ్మారి వెళ్లింది. ఇది ఉన్నతస్థాయి కుటుంబాలకు చెందిన యువతను కూడా నాశనం చేస్తోంది. మత్తుకు బానిసలైన ఇంజనీరింగ్, డిగ్రీ , పీజీ స్థాయి విద్యార్థులు కొందరు మంద బుద్ధులై, వింతగా ప్రవర్తిస్తుంటే , ఆయా కుటుంబాలకు చెందిన తల్లిదండ్రులు బయటికి చెప్పుకోలేక, పిల్లలను ఎలా రక్షించుకోవాలో తెలియక ,గుట్టుగా మానసిక కౌన్సిలింగ్ సెంటర్లను ఆశ్రయిస్తున్నారు.

మత్తు మహమ్మారి ఈ దేశంలో కరోనా మిగిల్చిన విషాదం కంటే , ప్రమాదకరంగా మారిందని కొందరు వ్యాఖ్యానిస్తున్నారు, . దీన్ని ఉక్కుపాదంతో తొక్కేయకపోతే , భావితరాలకు గొడ్డలిపెట్టుగా మారుతుంది అని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మత్తు పదార్థాలు మాదకద్రవ్యాలను గతంలో కొందరు స్మగ్లర్లు మాత్రమే విక్రయించేవారు. ఇప్పుడు వాటిని విక్రయించే వారి సంఖ్య బాగా విస్తరించింది. వాటికి అలవాటు పడిన వారే ఆయా పదార్థాలను విక్రయిస్తున్నారు. అందుకే పోలీసు నిఘా విభాగాలు వీటి కట్టడికి ఉక్కు సంకల్పంతో నడుం బిగిస్తే తప్ప , దీన్ని కట్టడి చేయడం అసాధ్యమని కూడా కొందరు పేర్కొంటున్నారు.

About the author

Mohiddin Shaik

Leave a Comment