తెలంగాణ ప్రత్యేక కథనాలు

అమ్ముడు పోయే సరుకు కాంగ్రెస్లో లేదు…నేడు హైదరాబాద్కు బూత్లెవెల్ కమిటీ సభ్యులు తరలి వెళ్లాలి..మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పిలుపు..

Written by Mohiddin Shaik

అమ్ముడు పోయే సరుకు కాంగ్రెస్ పార్టీలో లేదని రాష్ట్ర వ్యవసాయ మార్కెటింగ్ ,ఎనర్జీ శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు.
బుధవారం ఖమ్మం లోని తమ క్యాంపు కార్యాలయంలో జిల్లా నలుమూలల నుంచి వచ్చిన కాంగ్రెస్ ముఖ్య నాయకులు ,బూత్ కమిటీ సభ్యుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల ముందు బి ఆర్ఎస్ నేతలు కాంగ్రెస్ పార్టీ పట్ల చేసిన కొన్ని దుష్ప్రచారాలపై ఆయన మాట్లాడారు.

ఎన్నికల ముందు బి ఆర్ఎస్ పార్టీ నాయకులు కొందరు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను ఉద్దేశించి గెలిచిన తర్వాత మళ్ళీ బి ఆర్ఎస్ లోకి వెళతారని పెద్ద ఎత్తున ప్రచారం చేశారని గుర్తు చేశారు. కానీ కాంగ్రెస్ పక్షాన గెలిచిన ఏ ఒక్క ప్రజాప్రతినిధి కూడా ఇతర పార్టీలో చేరే ప్రసక్తే లేదని, అటువంటి సరుకు లేదని ఆయన స్పష్టం చేశారు.

ఎన్నికల్లో ఓటమి నుంచి తప్పించుకునేందుకు బి ఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ కీలకమైన నాయకులతోటి మూడు రోజుల్లో చక్రం తిప్పుతామని, అంతా మారిపోతుందని, తమకు పోల్ మేనేజ్మెంట్ చేసుకునే సౌకర్యం ఉందని, రకరకాలుగా ప్రచారం చేశారని ఆయన అన్నారు. కానీ చక్రం తిప్పుతామని చెప్పిన వారికి పోలింగ్ బూత్ లో ఉన్న ఏజెంట్ల నుంచి కాంగ్రెస్ కార్యకర్తలు అంతా చుక్కలు చూపించారని ఆయన అన్నారు.

తుమ్మల మనవాడు కాంగ్రెస్ ను గెలిపించి తీరుతామని పట్టుదలతో నిలబడిన కార్యకర్తలకు ,నాయకులందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు చెబుతున్నానని మంత్రి పేర్కొన్నారు. కాంగ్రెస్ నుంచి వేరే పార్టీకి వెళ్ళటం పక్కన పెడితే , ప్రస్తుతం కాంగ్రెస్ గేటు తీయడం లేదని, అదే గేటు తీస్తే ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు ఎంత మంది దూకుతారో ప్రజలు తెలుసుకుంటారని అన్నారు,.

… క్షేత్రస్థాయి నాయకుల ద్వారానే పార్టీ పటిష్టత…

కాంగ్రెస్ గ్రామ కమిటీ అధ్యక్షుడు , నగర కమిటీ అధ్యక్షుడు, మండల కమిటీ ఇలా క్షేత్రస్థాయిలో ఉన్న నాయకత్వం ద్వారానే పార్టీ పటిష్టమవుతుందని , అదే విధానాన్ని తాను అవలంబిస్తానని , ఇతర కాంగ్రెస్ శాసనసభ్యులకు కూడా తాను అదే సలహా ఇచ్చానని తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నారు. కొత్తగా పార్టీలో చేరిన, లేదా ఏదైనా పనులు చేయించాలన్న , నేరుగా తన వద్దకు రావడం కాకుండా స్థానిక నాయకుల ద్వారా రావాలని ఆయన సూచించారు.వచ్చే పార్లమెంటు ఎన్నికల్లోను కాంగ్రెస్ శ్రేణులు సత్తా చాటాలని , ఎంపి స్థానాలు గెలిపించడం ద్వారా, రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేయాలని తుమ్మల పిలుపునిచ్చారు…

…. నేడు బూత్ లెవెల్ నాయకులు హైదరాబాదుకు తరలి రావాలి…

అసెంబ్లీ ఎన్నికల్లో కష్టపడి పని చేసిన కీలకమైన బూతు లెవెల్ నాయకులు నుంచి ప్రతి బూతు నుంచి ఒకరు గురువారం హైదరాబాదులో జరిగే సమావేశానికి హాజరుకావాలని సూచించారు. తెలంగాణలో పనిచేసిన కాంగ్రెస్ కార్యకర్తలను ఏఐసిసి అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే తో పాటు రాష్ట్ర ఇన్చార్జి ఇతర అగ్ర నాయకులు అభినందించనున్నారని ఆయన తెలిపారు. అదే సందర్భంలో రాబోయే పార్లమెంటు ఎన్నికలకు సన్నద్ధం అయ్యేందుకు కూడా అగ్ర నాయకత్వం తగు సూచనలు చేస్తుందని ఆయన వివరించారు.కార్యక్రమంలో ఖమ్మం నగర అధ్యక్షులు మొహమ్మద్ జావేద్ , మాజీ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, ఖమ్మం మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ మానుకొండ రాధాకిషోర్, దీపక్ చౌదరి మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు దొబ్బల సౌజన్య తదితరులు పాల్గొన్నారు.

About the author

Mohiddin Shaik

Leave a Comment