ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ కార్యకర్తలు…చెక్కుచెదరని కత్తులు.. వారికి న్యాయం జరగాలి అప్పటివరకు వారితోనే ఉండి వారి కోసం పని చేస్తాను… ముమ్మాటికి ఖమ్మం సీటు అడిగే హక్కు నాకే ఉంది… ఒకవేళ సోనియమ్మ ఇక్కడ నుంచి పోటీ చేస్తానంటే అంతకంటే అదృష్టం మరొకటి లేదు… చరిత్రకు సాక్ష్యంగా నిలిచిన సీతారాములు మా భద్రాచలంలో ఉన్నారు. వారి ఆలయం రామదాసు నిర్మిస్తే ఆయనను అప్పటి రాజులు బంధీని చేశారు… ఇటువంటి చరిత్ర ప్రపంచంలో ఎక్కడా లేదు.. శ్రీరాముడు గౌరవాన్ని బ్యాలెట్ బాక్స్ స్థాయికి దించారు… ఎన్నికల నోటిఫికేషను ముందు గుడి నిర్మాణం పూర్తి కాకుండానే ప్రాణప్రతిష్ట సరికాదు… ఈ మాట అనేకమంది ఆధ్యాత్మిక గురువులు చెబుతున్నారు నా అభిప్రాయం కూడా అదే… పువ్వాడ అజయ్ కుమార్ తాగుతున్నది మా మోచేయి నీళ్లు.. ఖమ్మంలో గత పాలకుల అండతో జరిగిన కబ్జాలన్నీటిని తిరిగి వెనక్కి రప్పిస్తాం… ఖమ్మంలో పాత్రికేయుల సమావేశంలో మాజీ కేంద్రమంత్రి రేణుక చౌదరి వ్యాఖ్యలు ఇవి….
ఇటీవలే జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తాను జోస్యం చెప్పిన విధంగానే ఫలితాలు వచ్చాయని గుర్తు చేశారు. ప్రధానంగా ఖమ్మం ఉమ్మడి జిల్లాలో కాంగ్రెస్ తన సత్తా చాటిందని తాను చెప్పినట్లే ఖమ్మంలో మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఓడిపోయారని ఆమె అన్నారు. త్వరలో జరగబోయే పార్లమెంటు ఎన్నికల ఫలితాలు కూడా అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు మాదిరిగానే ఉంటాయని ఆమె చెప్పారు.
తెలంగాణ ఇచ్చిన తల్లిగా సోనియాగాంధీ , లేదా ప్రియాంక గాంధీ తెలంగాణ నుంచి పోటీ చేస్తే ఆ ప్రభావం రాష్ట్రం మొత్తం మీద ఉంటుందని రేణుకా చౌదరి అభిప్రాయపడ్డారు. ఖమ్మం సీట్ విషయంలో సోనియా గాంధీ నిర్ణయం తర్వాతనే స్పష్టత వస్తుందని ఆమె ఒక ప్రశ్నకు సమాధానం చెప్పారు. కబ్జాలకు గురైన ప్రభుత్వ , ప్రైవేటు స్థలాలన్నీ తిరిగి వెనక్కు రప్పిస్తామని అన్నారు. ఖమ్మంలో కబ్జాలకు గురైన స్థలాలను తాను పరిశీలించేందుకే వచ్చానని అన్నారు. కాంగ్రెస్ 6 గ్యారంటీలను అమలు చేస్తుందని అందులో భాగంగా ఉచిత బస్సు ప్రయాణం మహిళలకు కల్పించడం జరిగిందన్నారు. దీనిపై మహిళలు సంతోషం వ్యక్తం చేస్తున్నారని రేవంత్ రెడ్డి మరో 20 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా ఉంటారని తనతో అనేకమంది మహిళలు చెబుతున్నారని రేణుకా చౌదరి అన్నారు.
ఖమ్మం ఖిల్లా అభివృద్ధిలో భాగంగా సౌండ్ అండ్ లైట్నింగ్ ఏర్పాటుకు నిధులు మంజూరు చేయించానని, ఆ నిధులు ఆ తర్వాత ఏమయ్యాయో అర్థం కాలేదు అన్నారు. ఆ నిధులకు సంబంధించి ఆడిట్ జరపాలని ఆమె డిమాండ్ చేశారు.
ఖమ్మంలో తరుణ్ హార్ట్ ఏర్పాటు చేసి అందులో అప్పట్లో నిర్వహించిన స్తంభాద్రి ఉత్సవాలు ప్రజలను విశేషంగా ఆకట్టుకునేవని అన్నారు . మళ్ళీ ఆ వైభవాన్ని తెచ్చేందుకు ప్రయత్నం చేస్తామని పేర్కొన్నారు .జిల్లాకు ముగ్గురు మంత్రులు ఉండడం అదృష్టం అన్నారు.
పునుకుల గ్రామంలో గతంలో ఆర్గానిక్ పత్తి ఉత్పత్తులు వచ్చే విధంగా చేసిన కృషిని ఆమె గుర్తు చేశారు.
