బి ఆర్ ఎస్ పార్టీ కార్పొరేటర్ పై ఖమ్మం పోలీసులు కేసు నమోదు చేశారు. ఖమ్మం పట్టణంలో బైపాస్ రోడ్డు పక్కనే అత్యంత ఖరీదైన 4 15 గజాల ప్రభుత్వ స్థలాన్ని అక్రమ పద్ధతిలో తప్పుడు పత్రాలు సృష్టించి జీవో 59 కింద రిజిస్ట్రేషన్ చేసుకున్నారని అధికారులు విచారణలో తేల్చారు. దీంతో 53వ డివిజన్ కార్పొరేటర్ శ్రీ విద్యా చౌదరిపై ఖమ్మం టూ టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు.
అదేవిధంగా నగరంలో మరికొన్ని చోట్ల ప్రభుత్వ స్థలాలను బిఆర్ఎస్ కార్పొరేటర్లు కొందరు ఆక్రమించారని ఆరోపణలపై కాంగ్రెస్ పార్టీకి చెందిన కార్పొరేటర్లు కొందరు ఆదివారం కూడా ప్రత్యేకంగా ఒక టీం గా ఏర్పడి తిరుగుతూ ఆయా ఆక్రమణలను బయటపెట్టేందుకు ప్రయత్నాలు చేశారు.
శ్రీవిద్య చౌదరిపై కూడా ఇదే కాంగ్రెస్కు చెందిన కొంతమంది కార్పొరేటర్లు ఫిర్యాదు చేయగా అధికారులు విచారణ జరిపి ఆమెపై ఆదివారం కేసు నమోదు చేశారు. ఆమెతోపాటు అదే పార్టీకి చెందిన కార్పొరేటర్ బంధువు చిరుమామిళ్ల నాగేశ్వరరావు పై కూడా కాంగ్రెస్ కార్పొరేటర్లు కొందరు ఆరోపణలు చేశారు.
.. అధికారులకు చుట్టుకుంటున్న కబ్జాల కళంకం…
బి ఆర్ ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉండగా ఖమ్మం నగరంలో ఆ పార్టీకి చెందిన కొంత మంది భూ కబ్జాలకు పాల్పడ్డారని ఆరోపణలతో ప్రస్తుత ప్రభుత్వం వాటిపై విచారణకు ఆదేశించింది. దీంతో ఒకటి రెండు చోట్ల కబ్జాలు నిజమేనని తేలడంతో కేసులు నమోదు చేస్తుండగా, మరికొందరు పై అభియోగాలు వస్తున్నాయి దీనికి సంబంధించి అప్పట్లో జీవో 58 59 కింద అర్హులను నిర్ధారించే క్రమంలో విచారణ చేసిన అధికారులకు ఈ అక్రమ రిజిస్ట్రేషన్ వ్యవహారం ఇబ్బందికరంగా మారే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు.
బైపాస్ లోని సర్వే నెంబర్ 92 లో జరిగిన అక్రమ రిజిస్ట్రేషన్ వ్యవహారంలో అధికారులకు కూడా ఇబ్బందులు తప్పవని కొందరు అంటున్నారు. మొత్తం మీద ఖమ్మం నగరంలో కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత గత ప్రభుత్వం ఉండగా జరిగిన కబ్జాలపై ప్రత్యేక దృష్టి సారించి విచారణలు చేపట్టడంతో కబ్జాలకు పాల్పడిన వారిలో ఆందోళన వ్యక్తం అవుతోంది.
