రైతుబంధుకు కేటాయించిన డబ్బు నీ ఖాతాలో, మీ మామ ఖాతాల్లోకి వెళితే, వెంటనే రైతుబంధు ఎలా ఇస్తాం ..అంటూ రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.గత ప్రభుత్వంలో అనేక శాఖలో పందికొక్కులు కొల్లగొట్టినవన్నీ సరి చేయాల్సిన అవసరం ఉందని, వాటన్నిటిని సరిచేసుకొని ఖచ్చితంగా రైతుబంధు వేస్తామని శ్రీనివాసరెడ్డి అన్నారు. టిఆర్ఎస్ ప్రభుత్వంలో ఉద్యోగాలు లేవు, నిరుద్యోగికి భరోసా లేదు ,నిరుద్యోగ భృతి లేదు ,పేదవాడికి ఇల్లు లేదు అన్నారు.
ఆదివారం ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తో కలిసి తొలిసారిగా ఖమ్మం వచ్చిన సందర్భంగా ఆయన జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో వారితో కలిసి పాత్రికేయుల సమావేశంలో మాట్లాడారు.

డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క మీడియా సమావేశంలో ముందుగా మాట్లాడారు . తొలిసారిగా ఖమ్మం వచ్చిన సందర్భంగా ఆయన జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో పాత్రికేయుల సమావేశం జరిగింది. ముగ్గురు మంత్రులు జిల్లాకు వచ్చిన సందర్భంగా భారీ సంఖ్యలో కాంగ్రెస్ శ్రేణులు వారికి జిల్లా సరిహద్దు నాయకన్ గూడెం వద్ద ఘన స్వాగతం పలికారు.ఆ తర్వాత ఖమ్మం కాల్ వొడ్డు వద్ద గజమాలతో సత్కరించి అక్కడి నుంచి కాంగ్రెస్ శ్రేణులు భారీ ర్యాలీగా మంత్రులను తీసుకువచ్చారు.
ఈ సందర్భంగా విక్రమార్క మాట్లాడుతూ గత పాలకులు రాష్ట్రాన్ని 5.50 లక్షల కోట్ల అప్పుల కుప్పగా చేశారని, అన్నారు. అయినప్పటికీ సంపద సృష్టించి పీడిత తాడిత అనాధ ప్రజలందరిని భాగస్వాములను చేస్తామని స్పష్టం చేశారు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గా కాంగ్రెస్ మంత్రివర్గం ప్రమాణం చేసిన రెండవ రోజే ఆరు గ్యారెంటీల్లో రెండింటిని అమలు చేశామని ఆయన చెప్పారు.మిగిలిన నాలుగు హామీలు కూడా 100 రోజుల లోపు లోనే అమలు చేసి తీరుతామని ఆయన అన్నారు.
గోదావరి జలాలను పారించేందుకు కూడా పూర్తిస్థాయిలో పనిచేస్తామని బట్టి విక్రమార్క చెప్పారు. ఇది మా ప్రభుత్వమని ప్రజలు చెప్పుకునే విధంగా కాంగ్రెస్ పరిపాలన ఉండబోతుందని అన్నారు. ఉమ్మడి జిల్లాలో పది స్థానాలకు 9 స్థానాల్లో కాంగ్రెస్ దాని మిత్రపక్షమైన సిపిఐ ని గెలిపించిన ప్రజలకు విక్రమార్క కృతజ్ఞతలు తెలిపారు.
.. జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు ఇస్తాం…
రాష్ట్రంలోని జర్నలిస్టులు అందరికీ గతంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వంలోనే ఇండ్ల స్థలాలు ఇచ్చామని ఇప్పుడు కూడా తమ ప్రభుత్వమే ఇస్తుందని డిప్యూటీ సీఎం ప్రకటించారు. జర్నలిస్టుల స్థలాల విషయంలో కోర్టు స్పష్టత ఇచ్చినప్పటికీ బిఆర్ఎస్ ప్రభుత్వం స్థలాలు ఇవ్వలేదని ఆయన గుర్తు చేశారు.
…. కబ్జాలు పోలీసులను లేని పాలన అందిస్తాం…మంత్రి తుమ్మల…
ఎన్నికల ముందు తాను చెప్పినట్లే రాష్ట్రంలో గాని ఖమ్మం నగరంలో గాని కబ్జాలు పోలీసు జులుంతో ప్రజలు భయపడకుండా స్వేచ్ఛగా ఉండే పరిపాలన అందిస్తామని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చెప్పారు. తనను అత్యధిక మెజారిటీతో గెలిపించిన ఖమ్మం నియోజకవర్గ ప్రజలను గుండెల్లో పెట్టుకొని చూసుకుంటానని వారందరికీ కృతజ్ఞతలు అభినందనలు అని అన్నారు.మల్లు భట్టి విక్రమార్క అత్యంత సమర్థవంతమైన వ్యక్తి అని తుమ్మల అన్నారు రాష్ట్రం అప్పుల కుప్ప అయినప్పటికీ ఆయన సమర్థతతో సరిదిద్దుకు రాగల సమర్థుడని ఆయనకు ఆర్థిక శాఖను అప్పజెప్పారని అన్నారు. 85 వేల కోట్ల రూపాయల నష్టాల్లో ఉన్న కరెంటు శాఖను కూడా ఆయనకే ఇచ్చారని అన్నారు.
ఇక పేదలకు ఇళ్ల స్థలాలు ధరణి లోపాలురెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చూసుకుంటారని ఆయన అన్నారు. అటు ఉచిత కరెంటు భూముల వివాదాలు పరిష్కారం వంటి కీలక విషయాలను ఇద్దరు మంత్రులు చూసుకుంటారు కాబట్టి తన వ్యవసాయ శాఖ సాఫీగా నడిచిపోతుందంటూ తుమ్మల చలోక్తిగా అన్నారు.
