తెలంగాణ ప్రత్యేక కథనాలు రాజకీయం

కూటికోసం కాదు..ఓటు కోసం కోటి విద్యలు.. ఓటర్ల కరుణ కోసం నేతల పాట్లు … ఎన్నికల ప్రచారంలో ఎన్నెన్ని సిత్రాలో…!

Written by Mohiddin Shaik

అడుగడుగునా పోలీసులు …చుట్టూ అల్లుకొని ఉండే ముఖ్య అనుచరులు.. అధికారులు… చెప్పులు కుట్టుకునే ఓ సామాన్యుడు అమాత్యుల వారిని కలవడం అంత తేలికైన పని కాదు… ఆయనే ప్రజల ముందుకు వచ్చి సభలోను , సమావేశంలోనూ మాట్లాడుతుంటే, దగ్గరగా చూడటం తప్ప, సామాన్యుడు నేరుగా కలవడం ఒకింత కష్టమే..

కానీ అంత భారీ బందోబస్తు మధ్య ఉండే, అదే అమాత్యుడు ఓ సామాన్యుడు కింద కూర్చొని రోడ్డు పక్క చెప్పులు కుట్టుకునే ప్రదేశానికి వచ్చి, తనను ఆప్యాయంగా పలకరించి, నీలాగే నేను బూట్లకు పాలిష్ చేస్తా , అంటూ ఆ సామాన్యుడు చేతిలోని బూట్లు తీసుకొని పాలిష్ చేస్తే…!. అప్పుడు ఆ సామాన్యుడి హృదయం పులకించిపోదా..!. అతనికి ఆ దృశ్యం ఆశ్చర్యంగా , అసాధారణంగా అనిపించడం సహజం..

ఆ అమాత్యుడు చెప్పులు కుట్టడం ఒక్కటేనా… అనేక విద్యలు ప్రదర్శిస్తున్నాడు… టీ కొట్టు దగ్గర టీ తయారుచేసి తన సహచరులకు ఇస్తున్నాడు… కిల్లి షాపుకు వెళ్లి కిల్లి కట్టి ఆ షాపు యజమానికే తినిపించి ఉత్సాహపరుస్తున్నాడు.. ఇలా ఒకటా, రెండా, అనేక విద్యలు… కూటికోసం కోటి విద్యలు అంటారు కదా… ఇవి కూటికోసం కాదు..ఓటు కోసం విద్యలు అనే విషయం పామరుడు నుంచి , పండితుని దాకా అందరికీ తెలిసిందే…

ఎన్నికల సందర్భంలో మంత్రులు, ముఖ్యమంత్రులు, అనేకమంది ఇటువంటి ప్రదర్శించి సామాన్యుల్లో, తను ఒకటిగా ముద్ర వేసుకునే ప్రయత్నం చేయడం సహజం… మరి ఓటన్న మనసులో ఉన్న ఎన్నికల గుర్తు ఏమిటో, అతని వేలు ఏ గుర్తు కలిగిన బటన్ నొక్కుతుందో, ఎవరికీ తెలియదు..

ఎన్నికల తర్వాతే ఎవరిని అందలం ఎక్కించాలో, ఎవరిని ఇంటికి పంపించాలో , ఓటర్ అన్న నూరు శాతం తేల్చనున్నాడు.. అప్పటివరకు ఓట్ల కోసం నేతల పాట్లు కొనసాగుతూనే ఉంటాయి అనడంలో సందేహం ఎందుకు…!

About the author

Mohiddin Shaik

Leave a Comment