తెలంగాణ రాజకీయం

ఉత్సాహం నింపిన మహమూద్ అలీ పర్యటన…అజయ్ నా తమ్ముడు.. మీ బిడ్డ మీరు అండగా నిలవండి..బహిరంగ సభలో మహమూద్ అలీ ..

Written by Mohiddin Shaik

ఖమ్మం నగరంలో గురువారం సాయంత్రం జరిగిన ముస్లిం మైనారిటీల బహిరంగ సభ కు ఆ వర్గానికి చెందిన ప్రజలు భారీ సంఖ్యలో హాజరయ్యారు.. తాజా మాజీ హోం మంత్రి మహమూద్ అలీ ఖమ్మం నగరానికి వచ్చిన సందర్భంగా నిర్వహించిన బహిరంగ సభకు ముస్లిం మైనారిటీలు పెద్ద సంఖ్యలో తరలి వచ్చారు.

బైక్ ర్యాలీలో సైతం పెద్ద సంఖ్యలో ముస్లిం యువకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బహిరంగ సభలో మెహమూద్ అలీ మాట్లాడుతూ పువ్వాడ అజయ్ కుమార్ నా సోదరుడు నా తమ్ముడు మీకు బిడ్డ లాంటివాడు మీరందరూ అండగా నిలవాలి అంటూ పిలుపునిచ్చారు.

కెసిఆర్ కేటీఆర్ సహకారంతో వందల కోట్ల రూపాయల నిధులు తెచ్చి ఖమ్మం నగరాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేశారని ఆయన పేర్కొన్నారు. సభలో పువ్వాడ అజయ్ కుమార్ మాట్లాడుతూ ముస్లిం మైనారిటీలు అంత తన వారేనని తనను తమ బిడ్డగా భావిస్తారని పేర్కొన్నారు. 2018 ఎన్నికల సందర్భంగా ఇదే నెలలో ఈ ప్రాంతంలోనే నిర్వహించిన సభ తనకు ఒక సెంటిమెంట్ అని అజయ్ పేర్కొన్నారు.

ఇప్పుడు కూడా అదే మాదిరిగా ఉత్సాహంగా సభ జరగడం తన విజయానికి సంకేతం అని ఆయన అన్నారు. మహమూద్ అలీ ఖమ్మం కార్పొరేషన్ ఎన్నికల ప్రచారానికి వచ్చారని 16 డివిజన్లకు 16 గెలుచుకున్నామని అన్నారు.

ఆయన ఎన్నికల ప్రచారంలో పాల్గొంటే ఆ ఎన్నిక కచ్చితంగా విజయం సాధిస్తుందని పువ్వాడ పేర్కొన్నారు. బి ఆర్ ఎస్ నుంచి ఇటీవల కొన్ని వలసలు కాంగ్రెస్ లోకి జరుగుతున్న వేళ మహమూద్ అలీ పర్యటన గులాబీ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపడంతో పాటు వారిలో నూతన ఉత్తేజాన్ని కలిగించిందని పలువురు అంటున్నారు.

ఎంపీ నామ నాగేశ్వరరావు మాట్లాడుతూ పువ్వాడ అజయ్ కుమార్ ఖమ్మం నియోజకవర్గ అభివృద్ధికి శక్తివంచన లేకుండా కృషి చేశారని అన్నారు. అన్ని వర్గాల ప్రజలతో మమేకమై పనిచేయడం ద్వారా వారి అభిమానాన్ని పొందారని అన్నారు. టిఆర్ఎస్ ప్రభుత్వ పనితీరును గత కాంగ్రెస్ పరిపాలనను బేరీజు వేసుకొని ప్రజలు మరొకసారి కెసిఆర్ని ముఖ్యమంత్రిని చేయాలని నిర్ణయించుకున్నారని నామ పేర్కొన్నారు.

About the author

Mohiddin Shaik

Leave a Comment