వైయస్ రాజశేఖర్ రెడ్డి కుమార్తె వైయస్సార్ టిపి అధ్యక్షురాలు షర్మిలమ్మ పాలేరు నుంచి పోటీ చేస్తానని ఇప్పటికే ప్రకటించారు. పాలేరు తో పాటు కొత్తగూడెంలో ఆమె తల్లి, వై ఎస్ ఆర్ సతీమణి విజయలక్ష్మి పోటీ చేస్తారని, ఖమ్మం, లేదా, సత్తుపల్లి నుంచి బ్రదర్ అనిల్ కుమార్ ను రంగంలోకి దించుతారని ప్రచారం జరుగుతుంది. వీరితోపాటు మరో స్థానం నుంచి వైయస్సార్ టిడిపి అభ్యర్థులను పోటీకి దించుతున్నట్లు సమాచారం.
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కొన్ని నియోజకవర్గాల్లో వైయస్ రాజశేఖర్ రెడ్డి అభిమానులు పెద్ద సంఖ్యలో ఉన్నారని షర్మిల భావిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రధానంగా పాలేరు నియోజకవర్గంలో గెలుపు ఓటములు ఎలా ఉన్నా , తనకు గౌరవప్రదమైన ఓట్లు లభిస్తాయని షర్మిలమ్మ నమ్ముతున్నట్లు ఆ పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. అయితే పాలేరులో ప్రతిష్టాత్మకంగా జరుగుతున్న ఎన్నికల్లో షర్మిలమ్మ రంగంలో ఉండడంవల్ల కాంగ్రెస్ ఓట్లు కొంతవరకు ఆమె చీల్చుకుంటుందని పరిశీలకులు అంటున్నారు. ఆమె పొందే ఓట్ల శాతం ఏ స్థాయిలో ఉన్నప్పటికీ ఆ మేరకు కాంగ్రెస్ అభ్యర్థిగా రంగంలో ఉంటున్న పొంగులేటి శ్రీనివాసరెడ్డికి ఒక విధంగా నష్టం జరుగుతుందనే అభిప్రాయాలు కొందరు వ్యక్తం చేస్తున్నారు.
..కొత్తగూడెం నుంచి రంగంలో విజయమ్మ..!
ఇక కొత్తగూడెంలో కూడా విజయమ్మను రంగంలోకి దించితే అక్కడ కూడా కాంగ్రెస్ ఓట్లు సీలిపోతాయని కొందరు అంటున్నారు. ఖమ్మం, లేదా సత్తుపల్లి నియోజకవర్గాల్లో కూడా వైఎస్ఆర్ టిపి అభ్యర్థులను నిలబెట్టడం ద్వారా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో వైఎస్ఆర్ టిపి తన ఉనికిని కాపాడుకోవాలని వ్యూహంతో షర్మిలమ్మ అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ పార్టీ ఓట్లను గండి కొట్టాలని ఉద్దేశం షర్మిలమ్మ కు లేకపోయినా , ఆమె పార్టీకి పోలయ్యే ఓట్ల లోంచి అత్యధికంగా కాంగ్రెస్ ఓట్లే ఉంటాయని కొందరు విశ్లేషిస్తున్నారు. ఆమె పోటీ చేస్తున్న పాలేరులో ఆమెకు పోలయ్యే ఓట్ల శాతాన్ని బట్టి టిఆర్ఎస్ అభ్యర్థి కందల ఉపేందర్ రెడ్డి కి మేలు జరిగే అవకాశం ఉందని కొందరు పేర్కొంటున్నారు. అయితే కొత్తగా తెలంగాణలో పార్టీని స్థాపించి , ఇప్పుడే ఎన్నికల రంగంలోకి షర్మిల పార్టీ వస్తున్నందున ప్రజల నుంచి ఆమెకు ఏ మేరకు ఆదరణ లభిస్తుందో, వేచి చూడాల్సిందే.
